ఎస్సీలపై ఆదిరెడ్డి అప్పారావు దుర్భాషలేంటి?
రాజమహేంద్రవరం: ఎస్సీల విషయంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యవహారశైలి దారుణంగా ఉందని, తాజాగా లీకైన ఆడియో కాల్ లో ఆయన మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని స్థానిక మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. గతంలోనూ ఆయనకు ఎస్సీలపై దాడులకు దిగడం, అనరాని మాటలు అన్న చరిత్ర ఉందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు.
ప్రెస్ మీట్‌లో మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:
ఎస్సీలపై ఆదిరెడ్డి అప్పారావు అహంకారపు మాటలు:
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. కానీ ఆయన ఆ తర్వాత తన బుద్ధి చూపించి టీడీపీలోకి ఫిరాయించాడు. ఆ తర్వాత ఆయన చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. గతంలో వాలంటీర్ మహిళను ఆయన నీ అంతు చూస్తాను, ఓ పట్టు పడతానంటూ మాట్లాడిన చరిత్ర ఆయనకు ఉంది. ఆ తర్వాత పేపర్ మిల్లులో యూనియర్ లీడర్‌ను ఎలా బెదిరించాడో, బుచ్చయ్య చౌదరిని సైతం దుర్భాషలు ఆడిన వ్యక్తి ఈ పెద్ద మనిషి. ఇంకా వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి.
కుటుంబ వివాదాల జోలికి మేం వెళ్లడం లేదు. ఓ ఎస్సీ సామాజిక వర్గ వ్యక్తి గురించి ఆదిరెడ్డి అప్పారావు అన్న మాటల మీదే మా అభ్యంతరం. మాల మహానాడు, మాదిగ మహానాడు గురించి కూడా లోకువగా మాట్లాడారు. ఓ మహిళని కూడా చూడకుండా బూతులు మాట్లాడుతున్నాడు. ఆ మహిళ చాలా ఓర్పు, సహనంతో మాట్లాడింది. గతంలో ఎస్సీ సామాజిక వర్గ వ్యక్తిపై ఆయన మనుషులు దాడి చేశారు.
తండ్రి వ్యాఖ్యలపై సిటీ ఎమ్మెల్యే ఏం చెబుతారు?:
స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేను ఒకటే అడుగుతున్నాం. పొద్దున లేస్తే ఆయన మీ భద్రత– మా బాధ్యత అంటాడు. ఇదేనా మీరిచ్చే భద్రత?, మీ పార్టీ ఎంపీయే డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భం ఎప్పుడూ లేదు. ఆ టైటిల్ కూడా మీకే దక్కింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ‘సే నో టూ డ్రగ్స్‘ అంటున్నాడు. మీ సొంత తండ్రే ఇలా వ్యవహరిస్తున్న తీరు కనిపించడం లేదా? ఈ మధ్యే ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు తల పగులగొడితే. ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి జాయిన్ అయ్యాడు. ఇదీ ప్రభుత్వ ఆస్పత్రిని మీరు నిర్వహిస్తున్న తీరు.
బీసీ కులాలపై లోకేష్ చౌకబారు వ్యాఖ్యలు:
మంత్రి నారా లోకేష్ బీసీ కులాలైన గౌడ, శెట్టి బలిజల గురించి మాట్లాడిన మాటలు వింటుంటే ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం చేస్తున్నారో తెలియడం లేదు. ఎంతసేపూ బీసీ కులాలకు ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తామంటున్నారు. మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు. బీసీ కులాల్ని ఇంకా అణగారిన కులాలుగానే చూస్తున్నారా? మేం ఇంకా పనిముట్లతో పనులు చేసుకుంటూనే బతకాలా? మేం అగ్రకులాలతో సమానంగా ఎదగకూడదా? ఏంటీ మీ అహంకారం చెప్పండి లోకేష్.. మీ కింద గులాం గిరీ చేసే కార్యక్రమాలు ఇంకా మేం చేయాలా?.
మీరిచ్చే పనిముట్లు తీసుకుని రజకులు ఇంకా బట్టలు ఉతుక్కుని, నాయీ బ్రహ్మణులు ఇంకా గడ్డాలు గీసుకుని, శెట్టి బలిజలు అయితే ఇంకా తాటికల్లు గీసుకోవాలా చెప్పండి. మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, వ్యాపారస్తులు కావాలి, సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టుకోవాలని, అగ్రవర్ణాలతో పోటీ పడాలని ఆలోచిస్తున్నాం. తామూ జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో వాటా రావాలని భావిస్తుంటే నారా లోకేష్, చంద్రబాబు ఇలా మాట్లాడడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు.