కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో బాధితుల తరఫున వైయస్ఆర్‌సీపీ వేగంగా స్పందించి, గట్టిగా నిలబడి పోరాడింది కాబట్టే, ప్రభుత్వంలో కాస్తో కూస్తో చలనం వచ్చిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. లేకపోతే ఈ ప్రభుత్వం నగరంలో కల్తీ పాల బాధితులను అస్సలు పట్టించుకునేది కాదని ఆయన తేల్చి చెప్పారు. కల్తీ పాల మృతుల కుటుంబాలకు ఇప్పుడు ప్రకటించిన పరిహారం సరికాదని, వారికి రూ.25 లక్షల చొప్పున అందజేయాలని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
ప్రెస్‌మీట్‌లో మార్గాని భరత్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
సస్పెన్షన్‌తో చేతులు దులుపేసుకున్నారు:
కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది. అందుకే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్పెషలిస్టుల నియామకాలు చేయాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయడం లేదు. మరోవైపు కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సహాయం అందలేదన్న కారణం సాకుగా చూపి, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి, చేతులు దులిపేసుకోవడం హేయం.
పాల కల్తీపై కట్టుకథలు:
ఏ విషయాన్నయినా డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. ఫ్రీజర్‌లో పెట్టిన ఇథలీన్ గ్లైకోల్ అనే కూలెంట్ ప్రమాదవశాత్తు కలవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటూ, ప్రభుత్వం సమస్య నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఈ దారుణాన్ని ప్రమాదంగా చిత్రీకరించి నిందితుడు గణేష్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వారు చెప్పినట్టు ఇథలీన్ గ్లైకోల్ పాలలో కలిసే ఉంటే పాల రంగు మారేది. కల్తీ పాల సరఫరా నిందితుడు గణేష్ కూడా ఆ పాలు తాగాడని తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెబుతున్నాడు. నిజంగా గణేష్ ఆ పాలు తాగి ఉంటే ఖచ్చితంగా ఆస్పత్రి పాలయ్యేవాడే.
ఇన్ని దారుణాలు జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ మంత్రి కనీసం ఆరా తీసింది లేదు. ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ కనీసం నోరెత్తడం లేదు. వరుస దారుణాలు జరిగి అమాయక ప్రజలు మృత్యువాత పడుతుంటే ఎమ్మెల్యేలు విజయవాడలో కబడ్డీ ఆడుకుంటున్నారు.
కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారం చాలా తక్కువ కాబట్టి, వెంటనే దాన్ని రూ.25 లక్షలకు పెంచాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా వైద్యం అందించి, వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. అలాగే ఇప్పటికే బిల్లుల రూపంలో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును, ప్రభుత్వం రీయింబర్స్ చేయించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.