ప్రజా పోరాటమే ఊపిరిగా 15 ఏళ్ల వైయస్ఆర్‌సీపీ ప్రస్థానం
తాడేపల్లి: దివంగత నేత వైయస్.రాజశేఖర రెడ్డి ఆశయ స్ఫూర్తితో, వైయస్ జగన్ నాయకత్వంలో సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం పేదవాడి సొంతం అని పార్టీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా ప్రజల అభిమానంతో వైయస్.జగన్ నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ ప్రజల గుండెల్లో సుస్థిర స్ధానం సంపాదించుకుందని హర్షం వ్యక్తం చేశారు. నాడు మహానేత వైయస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 700 కుటుంబాలను ఓదార్చడానికి వైయస్.జగన్ సిద్దపడితే.. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించినా, జైల్లో పెట్టి వేధించినా ప్రజల కోసం ఆయన వెనకడుగు వేయలేదని, అదే పోరాట పటిమ నేటికి పార్టీకి బలమన్నారు. `వైయస్ఆర్` అభివృద్ధి, సంక్షేమ పాలనను గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేల ఏర్పాటు ద్వారా గ్రామస్థాయికి తీసుకెళ్లిన వైయస్.జగన్ మహాత్ముని గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. 2019-24 మధ్య సాగిన వైయస్.జగన్ పాలన ప్రజా పరిపాలనకు నిలువుటద్దం" అని జూపూడి కొనియాడారు. కానీ గత 22 నెలల కూటమి పాలన ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి పనికీ ఒక రేటు కట్టి దోపిడీ చేస్తున్నారని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇచ్చిన పట్టాలను 'డెమోగ్రాఫిక్ ఇంబాలెన్స్' పేరుతో రద్దు చేయడం కూటమి ప్రభుత్వ పెత్తందారీ ఆలోచనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని, మళ్ళీ ప్రజా పోరాట మార్గాన్నే ఎంచుకుంటుందని ప్రకటించిన జూపూడి ప్రభాకరరావు.. అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా ప్రజలకు అందించిన వైయస్ జగన్ తిరిగి అదే పాలనను అందించేందుకు అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...
● ఘనంగా వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు...
వైయస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తానని చెబితే... అప్పటి రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు అంగీకరించలేదు. అయినా ఇచ్చిన మాటమీద నిలబడి ప్రజలదగ్గరకు ఓదార్పు యాత్ర వచ్చారు. ఆ క్రమంలో అది 2011 మార్చి 11న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా కాకినాడ దగ్గర జగ్గంపేటలో ప్రకటించి, మార్చి 12 వైయస్సార్ సమాధి వద్ద జెండా ఆవిష్కరించి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. కాలం గడిచే కొద్ది వస్తున్న మార్పుల్లో మార్చి 12, 2011 నుంచి రాష్ట్ర ప్రజలతో అనుబంధం పెనవేసుకుంది.
వైయస్సార్ స్ఫూర్తిగా సాగించిన వైయస్సార్సీపీ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరకు వైయస్.జగన్ ను కూడా జైల్లో పెట్టి వేధించింది. మాట కోసం నిలబడ్డ వైయస్.జగన్ పై సాధిస్తున్న కక్ష రాజకీయాలను గ్రహించిన ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు. ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైయస్.జగన్ వైయస్సార్సీపీ జెండా ఆవిష్కరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ, మండలం లోనూ గ్రామగ్రామాన ఆవిర్భావ దినోత్సవ వేడుకులు నిర్వహించుకుంటున్నాం.
● వైయస్సార్ ఆలోచనలే - వైయస్ఆర్‌సీపీ విధానాలుగా...
వైయస్.రాజశేఖర రెడ్డి ఆలోచనా విధానాన్నే వైయస్.జగన్ ఆచరణగా చేసుకుని 2019-24 వరకు ప్రజాపరిపాలన చేశారు. వైయస్సార్ పాలనలోని అభివృద్ధి, సంక్షేమానికి కొనసాగింపే వైయస్.జగన్ పాలనలో ఆచనలో చేసి చూపించారు. దేశం మొత్తం వైయస్.జగన్ పాలనవైపు చూసింది. నూతన రాష్ట్రంగా ఉన్న ఏపీలో.. సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు కంటే మిన్నగా... పాలనలో వినూత్నంగా సంక్షేమ రాష్ట్రంగా వైయస్.జగన్ పాలన చేశారు. మహాత్ముని గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశలో భాగంగా గ్రామాల్లో ఆర్బీలేకలు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు చేయడం ద్వారా పాలనను గ్రామస్థాయికి అందించిన ఘనత వైయస్.జగన్ కే దక్కుతుంది. ఇది దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. ప్రజాపరిపాలన ఇంటే ఇలా ఉంటుందని చేసి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
● పాలనలో నాటికీ -నేటికీ ఇదే తేడా..
రాజకీయాలకు కొత్తగా వచ్చినా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వైయస్.జగన్ పరిపాలన ఏంటో చేసి చూపించారు. వైయస్.జగన్ పాలన చూసిన తర్వాత 22 నెలలుగా కూటమి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక కూటమిగా మారి ప్రజల విశ్వాసాలను దెబ్బతీసింది. 2024-26 వరకు రెండేళ్ల పాటు సుధీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు, మూడు పార్టీల కూటమినేతలకు ప్రజాపాలన చేతకావడం లేదు. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రతి పనికీ ఒక రేటు కట్టి... అది చెల్లిస్తే ఏ పనైనా అవుతుందన్న దోపిడీ మీద ప్రజలు మాట్లాడుకుంటున్న దుస్థితి నెలకొంది.
వైయస్.జగన్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 56 శాతం పదవులు, వివిధ రకాల నియామాకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కట్టబెట్టి దేశంలోనే రూల్ మోడల్ గా నిలిచారు. పేదలను అప్ లిఫ్ట్ చేయడంలోనూ, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను గుర్చించి అందుకు అనుగుణంగా పరిపాలన సాగించిన వైయస్.జగన్ ప్రభుత్వానికి, దోపిడీయే పరమావధిగా సాగుతున్న కూటమి పాలనకూ మధ్య తేడాను ప్రజలు చాలా స్పష్టంగా అర్ధం చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వైయస్.జగన్ హయాంలో 51 వేల మందికి పట్టాలిచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీలు రాజధాని ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు డెమొగ్రఫిక్ ఇంబేలన్స్ వస్తుందని ఆ పట్టాలను రద్దు చేసింది. రాజధాని అంటే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లా ఉండాలని కోరుకుంటారు తప్ప.. కేవలం కొంతమందికే పరిమితం అన్నట్టు వ్యవహరించడం సరికాదు.
● ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పై పోరుబాట...
వైయస్సార్సీపీ చాలా స్పష్టంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ ప్రజలకు తెలియజెప్పారు. వైయస్సార్సీపీ ప్రజలను మాత్రమే నమ్ముకుంది.. ఆ ప్రజలతోనే ప్రజలకోసమే పాటుపడుతుంది. ప్రజలు సైతం ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ తర్వాత వైయస్.జగన్ మాత్రమే ప్రజారంజకమైన పాలన చేశారు తప్ప... 2014-19 మధ్య, తాజాగా 2024 నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదలకు అందుబాటులో ఉండడం లేదని స్పష్టం చేస్తున్నారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ... వైయస్సార్సీపీ తిరిగి పోరాట మార్గాన్నే ఎంచుకుంటుందని వైయస్.జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తిరిగి 2027 తర్వాత పాదయాత్ర ద్వారా ప్రజలమధ్య పూర్తిగా ఉండి, వారి తరపున ప్రశ్నించనున్నారు. 15 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన వైయస్సార్సీపీకి ప్రజల తరపున పోరాటమే ఊపిరిగా ముందుకు నడుస్తోంది. 2019 వరకు ప్రజా సమస్యల మీద వారి మధ్యే ఉండి వైయస్.జగన్ చేసిన పోరాటాల ఫలితంగానే 2019లో 51 శాతం మంది ప్రజలు ఆయన వెనుకే నిలబడి 151 సీట్లు ఇస్తే.. ప్రజలు శెభాష్ అనేలా ఆయన పాలన సాగించారు.
● తిరోగమన దిశలో కూటమి పాలన...
కానీ ఇవాళ మూడు పార్టీల కూటమి కలిసినా.. వైయస్.జగన్ పాలనకు ఏమాత్రం సరితూగడం లేదన్నది ప్రజల భావన. ముగ్గురు కలిసినా, ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న నేతలున్నా కూడా ఇవాళ పాలనలో, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తిరోగమన దశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 15వ ఆవిర్భావ దిశగా వైయస్ఆర్‌సీపీ, వైయస్.జగన్ పేద ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. ప్రజల ఆలోచనలకు దూరంగా వెళ్లిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు రానున్నాయి. ప్రజా పోరాట మార్గంలో వైయస్సార్సీపీ, వైయస్.జగన్ ప్రజల ముందుకు రానున్నారు. ప్రజాకంఠకులైన పాలకుల మెడలు వంచడం ఖాయం. కక్ష సాధింపు రాజకీయాలతో వైయస్ఆర్‌సీపీ నేతలను జైళ్లలో పెట్టినా, కేసులు పెట్టినా ఈ పోరాటం ఆగదు. సవాళ్లు వైయస్సార్సీపీకి కొత్తకాదు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూసిన రాష్ట్ర ప్రజలకు మరలా వారి అంచనాలను ముందుకు తీసుకెళ్లి అదే పాలనను వారికి అందించేందుకు వైయస్.జగన్ ముందుకు కదులుతున్నాడు. ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలకు కూడా సిద్దంగా ఉన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మించే క్రమంలో వైయస్ఆర్‌సీపీ ముందుంటుంది. ప్రజల తరపున పోరాటాలకు వెనుతిరిగే ప్రసక్తే లేదన్నది మా నాయకుడు వైయస్.జగన్ ఆలోచనలు వైయస్సార్సీపీ శ్రేణులు ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ ఆశీర్వచనాలు అందించాలని జూపూడి ప్రభాకరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.