కదిరిలో మంత్రి లోకేష్‌ కుట్ర బూమరాంగ్‌

24 Dec, 2025 17:47 IST

తాడేపల్లి:వైయస్‌ఆర్‌సీపీని అప్రతిష్టపాలు చేయాలనుకున్న మంత్రి నారా లోకేష్‌ ప్రయత్నం బూమరాంగ్‌ అయిందని, పార్టీపై బురద చల్లే ప్రయత్నంలో సీన్‌ రివర్స్‌ అయిందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి చురకలంటించారు. కదిరి ఘటనలో దళిత యువకుడు అజయ్‌ని వైయస్‌ఆర్‌సీపీకి అంటగట్టి బురద చల్లాలనుకున్నారని, అసలు అజయ్‌ మా పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుడే ధ్రువీకరించాడని ఆయన వెల్లడించారు. నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం కారణంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని గుర్తు చేశారు. దళిత యువకుడు అజయ్‌ను దారుణంగా హింసించి, నడిరోడ్డుపై నడిపించిన పోలీసులపై ప్రభుత్వం ఎందుకు ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు పెట్టడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సతీష్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.
ప్రెస్‌మీట్‌లో సతీష్‌కుమార్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

అరాచక పాలనకు కదిరి ఘటనే నిదర్శనం:
    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభినవ దుర్యోధనుడిగా వ్యవహరిస్తున్న లోకేష్, ధృతరాష్ట్రుడిలా మారిన చంద్రబాబును పూర్తిగా పక్కన పెట్టి రెడ్‌బుక్‌ పాలన కొనసాగిస్తున్నారు. నిన్న (మంగళవారం) కదిరిలో జరిగిన సంఘటనను పరిశీలిస్తే ఈ అరాచక పాలన ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా కనిపిస్తోంది. అజయ్‌ అనే దళిత యువకుడికి వైయస్‌ఆర్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదు. శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం, తనకల్లు మండలం, ముత్యాలవారిపల్లెలో రెండు కుటుంబాల మధ్య తగాదాలో జరిగిన చిన్న ఘర్షణలో తోపులాట కారణంగా ఒక గర్భిణి కిందపడితే, దాన్ని వక్రీకరించి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్లు, గర్భిణిపై దౌర్జన్యం చేసినట్లు చిత్రీకరించారు. 
    లోకేష్‌ గారూ ఒకసారి ఆలోచన చేయండి. ఆ యువకుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు ఏమిటో ముందుగా పరిశీలించాలి. ఏదో ఒక చిన్న సాకు దొరికిందని వైయస్‌ఆర్‌సీపీపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం చివరకు మీపైనే బూమరాంగ్‌ అయ్యింది. అజయ్‌ జనసేనకు సంబంధించిన వ్యక్తేనని, ఆ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్‌ స్వయంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అజయ్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమాని అని, తాను జనసేన నుంచి ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు తన గెలుపునకు అజయ్‌ ఎంతో సహకరించాడని అమర్‌ మీడియాతో వెల్లడించారు.

వైయస్‌ఆర్‌సీపీని నిందించడమే ఈ ప్రభుత్వ ఎజెండా:
    నారా లోకేష్‌కు ఎక్కడ అవకాశం దొరికితే చాలు అక్కడ వైయస్‌ఆర్‌సీపీని అప్రతిష్టపాలు చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీపైనా, మా నాయకుడిపైనా బురద జల్లడం తప్ప, ఈ ప్రభుత్వానికి మరే ఎజెండా లేదు. కదిరిలో ఎస్సీ యువకుడిపై దాడి చేసి నడిరోడ్డుపై నడిపించిన ఘటనలో పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక ఫిర్యాదు వస్తే,  ఏ మాత్రం వాస్తవాలు విచారించకుండా ఈ తరహా చర్యలకు పాల్పడటం చట్ట విరుద్ధం. ముత్యాలవారిపల్లెలో అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దగ్గరి బంధువులే. వారి మధ్య ఉన్న కుటుంబ తగాదాల వల్ల ఘర్షణ జరిగితే దాన్ని వైయస్‌ఆర్‌సీపీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసం?. ఇది అత్యంత హేయం.

రాజకీయ కక్ష సాధింపు చర్యలు:
    ఇటీవల వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారు. అనంతపురంలో ఫిర్యాదు చేస్తే హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను అఘమేఘాలపై అరెస్టు చేసి అనంతపురం తీసుకువెళ్లారు. న్యాయమూర్తి పోలీసులకు చీవాట్లు పెట్టి, బెయిల్‌ ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు వర్గపోరులో పరస్పరం కొట్లాడుకొని చనిపోతే, ఆ ఘటనను వైయస్‌ఆర్‌సీపీ నేతలు పిన్నెళ్లి సోదరులపై మోపి, జైలులో పెట్టారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపే.

ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయింది:
    ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోయింది. విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఒప్పుకున్నారు. అయితే ఇందుకు కలెక్టర్లను బాధ్యుల్ని చేస్తూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. చంద్రబాబు చేయించుకున్న సొంత సర్వేల్లో కూడా ఈ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందని స్పష్టంగా తేలింది. ఈ పరిస్థితికి కలెక్టర్లు, ఎస్పీలు కాదు, నూటికి నూరుపాళ్లు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమని స్పష్టమవుతోంది. ఇంకా పైనుంచి కిందిస్థాయి వరకు ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడి సాగుతోంది.
    10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ, రెండేళ్లపాటు ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు చెల్లించాలన్న నిర్ణయం, విలువైన ప్రభుత్వ భూములను ఎకరా 99 పైసలకే ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడం, ఉర్సా వంటి కంపెనీల పేరుతో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు భూములు అప్పగిస్తున్న విషయాలు ప్రజలకు బాగా అర్థమయ్యాయి. 

పవన్‌గారూ. నోరు అదుపులో పెట్టుకొండి:
    డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు మరోసారి చెబుతున్నాం. మా పార్టీ వారెవ్వరూ మీ గురించి మాట్లాడడం లేదు. కానీ మీరు మాత్రం ప్రతిరోజూ అనవసరంగా మామీద నోరు పారేసుకుంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతూ, విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విధంగా మమ్మల్ని రెచ్చగొడితే, మా పార్టీ నుంచి ఎవరైనా గట్టిగా స్పందిస్తే, దాన్ని రాజకీయం చేయాలని మీరు చూస్తున్నారు. అలా మీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా మీరు ఇదంతా చేస్తున్నారు. కానీ, మీ కుట్ర నెరవేరదన్న విషయాన్ని గుర్తించండి.

జగన్‌గారికి మత రాజకీయాలు ఆపాదించొద్దు:
    వైయస్‌ జగన్‌ క్రిస్టియానిటీని నమ్ముతారని హిందువుల్లో వ్యతిరేకత రేకెత్తించేలా వార్తలు రాయించడం సరికాదు. ఒకసారి వైయస్సార్‌ కడప జిల్లాకు వచ్చి చూడండి. అక్కడ జగన్‌గారు, వైయస్సార్‌గారి హయాంలో హిందూ దేవాలయాలపై ఎక్కడైనా అన్యాయం జరిగిందని నిరూపించగలరా? వారి పాలనలో గండి ఆంజనేయస్వామి ఆలయానికి రూ.30 కోట్లు ఇచ్చారు. పులివెందులలో శ్రీకృష్ణ దేవాలయాన్ని రూ.8 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రతి పల్లెలో కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) ద్వారా హిందూ ఆలయాల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేశారు. వైయస్‌ఆర్‌ కుటుంబం ఎప్పుడూ హిందువులకు మచ్చ వచ్చేలా వ్యవహరించలేదు. అలాంటి నాయకులపై మత రాజకీయాల ముద్ర వేయడం దుర్మార్గమని, అందుకే ఇకనైనా వైఖరి మార్చుకోవాలని సతీష్‌కుమార్‌రెడ్డి హితవు చెప్పారు.