రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పై ప్రభుత్వ వైఖరి దారుణం

7 Jan, 2026 09:52 IST

తాడేపల్లి:  చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ స్కీం ఆపించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం బయటపడిందని వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం నెలకొందన్న ఆయన.. ఇంత జరుగుతున్నా ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్న శ్రీకాంత్ రెడ్డి.. 1995లో బాబు హయాంలోనే ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మించగా... తాజాగా మరలా రూ.70వేల కోట్లతో కర్ణాటక  ఆల్మట్టి విస్తరణ చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు కనీసం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాయలసీమకు జీవనాడి పోతిరెడ్డిపాడు లిఫ్ట్  అని.. అయితే శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు సాధ్యమన్న ఆయన..  ఎగువ రాష్ట్రాల వల్ల అది ఎప్పుడూ సాధ్యం కావడం లేదని తేల్చి చెప్పారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులు వైయస్సార్ కుటుంబం చలువే అని తేల్చి చెప్పారు.  వైయస్సార్ హయాంలో హంద్రీనీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు రూపకల్పన చేసుకోగా...  బ్రహ్మంసాగర్, అవుకు, చిత్రావతి, వామికొండ ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు గండికోటలో 27 టీఎంసీలు పుల్ లెవల్ నింపిన ఘనత కూడా వైయస్.జగన్ దేనని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం రూ.3600 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, రూ.900 కోట్లు ఖర్చు పెడితే.. అలాంటి ప్రాజెక్టు వృధా అనడం దారుణమని మండిపడ్డారు. రాయలసీమ పొట్ట కొట్టే ప్రయత్నం చేయవద్దని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఇంకా ఆయన ఏమన్నారంటే..
 
● బయటపడ్డ బాబు మోసం..

రెండు రోజుల క్రితం తెలంగాణా అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బయటపడింది. దీంతో రెండు రోజులగా ప్రజలు తీవ్ర ఆందోళనలో  ఉన్నారు. వివిధ కారణాలు బయటకు చెప్పినా.. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలన్న చంద్రబాబు ఆలోచనా ధోరణికే.. ఇవాళ ఏపీ  నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆమోద ముద్ర వేశారు. ఇది చాలా బాధాకరం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదన్న వాదనను నీటిపారుదలశాఖ మంత్రి చెప్పడం.. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశంతో కలుపుకుని ఆరు జిల్లాలో ప్రజల గుండెల్లో తీవ్ర ఆగ్రహం, ఆందోళన కలిగిస్తోంది. ఒక ప్రాంతం మీద ద్వేషంతో, ఆలోచనా రహితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ చేస్తున్న కుట్రలపై ప్రజలు ఆలోచన చేయాలి.

● పూటకో మాట మార్చుతున్న ప్రభుత్వం..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవసరం లేదని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి చెబుతుంటే... తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ తనకు చంద్రబాబుతో ఉన్న చనువు వల్ల ఆయన మీద ఒత్తిడి చేసి కేంద్రప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 
స్కీం నిలిపివేయించానని చెప్పారు. దానికి ఇవాళ నీటిపారుదలశాఖ మంత్రి ఆమోద ముద్ర వేశారు. 
 గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ పర్యావరణ అనుమతులు లేకపోవడం ప్రాజెక్టు నిలిపామని చెప్పింది. భిన్నమైన ప్రకటనలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది. 

● బాబు బాయాంలో రాష్ట్రానికి నీటి గండం...

1995లో ఎన్టీరామారావు గారిని గద్దె దించిన తర్వాత యునైడెట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేవగౌడను ప్రధాని మంత్రిని నేనే చేశానని చెప్పుకుంటున్న రోజుల్లో .. కేవలం  ఆనకట్టగా ఉన్న ఆల్మట్టీని పూర్తిస్థాయి  డ్యామ్ గా మార్చి అడ్డకట్ట వేయించారు. ఆ రోజే తెలుగురాష్ట్రాలకు నీటిని తీసుకురావడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు. మరలా చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈయన మద్ధతుతోనే కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం నడుస్తుంటే..  కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు రూ.70 వేల కోట్ల వ్యయంతో ఆల్మట్టి ఎత్తు పెంచి... రెండింతలు నీటిని నిల్వచేస్తే ప్రయత్నం చేస్తుంటే దానిమీద మాత్రం చంద్రబాబు నోరు మెదపడం లేదు.  కానీ రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం వైయస్.జగన్  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపడితే... అది అవసరం లేదని చెప్పడం నీకు తగునా చంద్రబాబూ?

● ఆరు జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం...

మీ నిర్ణయం మీద  ఈ ఆరు జిల్లాలకు చెందిన ప్రతి రైతు, ప్రతి వ్యక్తి  జీవితం, భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాంటి ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా మాట్లాడిన మంత్రి రామానాయుడు క్షమాపణ చెప్పాలి. ఆయనకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు కూడా లేదు. ఆయన మాట్లాడిన మాటలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేస్తే గతంలో శ్రీశైలం పుల్ లెవెల్ ఉంటేనే 7 నుంచి 11 వేల క్యూసెక్కులు నీరు పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చేది.
రాయలసీమ ప్రజలు నీళ్లు దోచుకున్నారని చెప్పేవాళ్లు ఒక్కటే ఆలోచన చేయండి... గత 20 ఏళ్లలో కేవలం 4 సంవత్సరాలలో మాత్రమే రాయలసీమకు కేటాయించిన నీటిని తీసుకోవడం జరిగింది. 16 సంవత్సరాలు మా వాటా ప్రకారం మాకు రావాల్సిన నీళ్లు రాలేదు. చెన్నైకి నీళ్లిచ్చినా.. రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు నీళ్లొచ్చినా లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నది కేవలం శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డ్ పాడు ద్వారా మాత్రమే సాధ్యం. 

● ఎగువ రాష్ట్రాల జలదోపిడీ...

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి ఏడాదిన్నరలో రికార్డు స్ధాయిలో పూర్తిచేశారు. గతంలో పోతిరెడ్డి పాడు ద్వారా 7 నుంచి 11 వేల క్యూసెక్కులు నీళ్లు మాత్రమే తీసుకోగలిగే పరిస్ధితి ఉండేది. పోతిరెడ్డి పాడు నుంచి బనకచర్ల క్రాస్ నుంచి అన్ని ప్రాజెక్టులకు వాడుకునే పరిస్థితి. పోతిరెడ్డి పాడును విస్తరిస్తే.. నీటిదోపిడీ జరుగుతుందని  తన ఎమ్మెల్యేలతో ధర్నాలు చేయించి ఆ ప్రాజెక్టు చేపట్టకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు... రాయలసీమను తానే ఉద్దరించినట్లు మాడ్లాడుతున్నాడు. పోతిరెడ్డిపాడు నిర్మించినా శ్రీశైలం నీటి మట్టం 840 దాటిన తర్వాత కేవలం 2వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోగలుగుతాం. 854 అడుగులు పైకి వస్తే 7వేల క్యూసెక్కులు తీసుకోగలుగుతాము... శ్రీశైలంలో 881 నీటమట్టం ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్ధాయిలో నీటిని తీసుకోలేము. ఇది వాస్తవం. శ్రీశైలంలో ఎప్పుడూ 881 అడుగులు నీటమట్టం ఉండనీయడం లేదు, ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు వైఫల్యం కారణంగా అల్మట్టి ఎత్తు పెరిగిపోతుంది.. కృష్ణా నీటిని గరిష్టంగా అక్కడే అడ్డుకుంటున్నారు. ఆ తర్వాత నారాయణపూర్ ప్రాజెక్టు నిండి, జూరాలకు నీళ్ళు రావాలి. జూరాల నుంచి అనేక చోట్ల తెలంగాణాలో కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు పోవాలి. వాటన్నింటి తర్వాత శ్రీశైలానికి నీళ్లు రావాలి. అక్కడ కూడా 840 లెవెల్ దాటిన తర్వాతనే 2వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. అంతవరకు రానిచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆల్మట్టి నుంచి జూరాల వద్దకు వచ్చేసరికే 
నీళ్లు తోడేస్తున్న పరిస్ధితి ఉంది. 2015 లో అప్పటి తెలంగాణా సీఎం కేసిఆర్ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్  కెపాసిటీని 20 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచి, శ్రీశైలంలో 800 అడుగులు నుంచే డ్రా చేసుకునే పని కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చేశారు. దీన్ని మరింత కిందకి 777 అడుగులు అంటే డెడ్ స్టోరేజీకి చేరినప్పుడు కూడా రోజుకి 2 టీఎంసీలు తీసుకునే విధంగా 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించడానికి పాలమూరు, రంగారెడ్డి దిండి ప్రాజెక్టును చేపట్టారు. మరోవైపు 825 అడుగుల వద్ద 40 టీఎంసీలు తీసుకునేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్( ఎస్ ఎల్ బీసీ) ద్వారా తీసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో శ్రీశైలంలో 777 నుంచి 825 అడుగులు వరకు తెలంగాణా ప్రభుత్వం రోజుకు 7 టీఎంసీలు తరలించుకుపోతుంది. మరి ఏ రకంగా అది 820 అడుగులు దాటే పరిస్థితి వస్తుంది. భారీ వరదలవస్తే సాధ్యం కాదు. మరోవైపు 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జూరాల, ఆల్మట్టి నుంచి కేవలం 52 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. తుంగభద్ర నుంచి 45 టీఎంసీల వరకు వచ్చింది కాబట్టి కొంతవరకు సస్టైన్ అయింది. ఒకవేళ 2014 తరహాలోనే కేవలం పైనుంచి 52 టీఎంసీలు వస్తే... శ్రీశైలం పైనున్న ప్రాజెక్టులన్నింటికీ నీళ్లు లిఫ్ట్ చేస్తే శ్రీశైలానికి ఏ రకంగా నీటి మట్టం పెరుగుతుంది.

● నీటిపారుదలశాఖ మంత్రి అవగాహనా రాహిత్యం...

 ఇది అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు కాదా? నీటిపారుదలశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. మరోవైపు 796 అడుగులు దాటినప్పటి నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం రోజుకు 4 టీఎంసీలు నీళ్లు వినియోగిస్తున్నారు. డెడ్ స్టోరేజి నీళ్లు కూడా ఉండనివ్వడం లేదు. పేరుకేమో కృష్ణా కంట్రోలే ఆంధ్రప్రదేశ్ అని చెబుతూనే నీళ్లన్నీ పైనే తరలిస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూస్తే.. కుడి కాలువ మాత్రమే ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉంటే... మొత్తం డ్యామ్ నిర్వహణ అంతా తెలంగాణా ప్రభుత్వం చూస్తోంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణా నుంచి పారిపోయి వచ్చినప్పుడు జరిగినవే. 
ఈ రకంగా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. ఒక ప్రాంతానికి మంచి జరిగితే దాన్ని మంచిగా చెప్పాలే తప్ప.. ప్రతిపక్షంపై బురజ జల్లే ప్రయత్నం చేయకూడదు.

● వైయస్సార్ కుటుంబం వల్లే సాకారం..

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ రోజు పోలవరానికి  అనుమతులు లేవు అని అడ్డపడుతున్న నేపధ్యంలో...  పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కాకూడదనే ఒకవైపు అన్ని రకాల అనుమతులు కోసం ప్రయత్నం చేస్తూనే ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయకుండా మరోవైపు కుడి, ఎడమ కాలువల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మరోవైపు ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంతేకాకుండా గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలని.. తాడిపూటి, పుష్కర, వెంకటనగరం లాంటి లిఫ్ట్ స్కీములకూ రూపకల్పన చేశారు. మరోవైపు కృష్ణా డెల్టాను సుభిక్షం చేయడానికి పోలవరం కుడి కాలువను కూడా పూర్తి చేసి ఘనత కూడా వైయస్.రాజశేఖరరెడ్డిదే.

నువ్వేమో ఒకవైపు మనకు హంద్రీనీవా, గాలేరు-నగరి అవసరం లేదు అని చెబుతూ.. దాన్ని 40 టీఎంసీలకు పెట్టిన దాన్ని 5 టీఎంసీలకు కుదించింది నువ్వు కాదా ? దాన్ని మీ హయాంలో జీవోల రూపంలో విడుదల చేసిన విషయాన్ని కూడా స్పష్టం చేశాం. ఆ రోజు నువ్వు మోసం చేస్తే.. వైయస్సార్ గారు మరలా దాన్ని 40 టీఎంసీలకు చేసి మల్లెల నుంచి హంద్రీనీవాను మొదలుపెట్టారు. తొలిదశలో జీడిపల్లె నుంచి మొదలుపెట్టి... గొల్లపల్లితో సహా అనేక డ్యాములు నిర్మించుకుంటూ వెళ్లి.. మార్ల, శ్రీనివాసపురం, అడవిపల్లి  రిజర్వాయరు వరకు చేపట్టి నీళ్లిచ్చారు. కియా పరిశ్రమ గొల్లపల్లి రిజర్వాయరు వల్లే వచ్చింది. 

 వైయస్.రాజశేఖర్ రెడ్డి ఆలోచనలో భాగంగానే  రూ.3,600 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. అదే రకంగా ఎన్టీఆర్ గారు తెలుగుగంగ ప్రాజెక్టుకు కేవలం రూ.34 కోట్లు ఖర్చు పెట్టారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1989-94 వరకు రూ.1000 కోట్లు పైనే ఖర్చు పెట్టింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుగంగ ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత  వైయస్.రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూ.3,600 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి స్ధాయిలో నీళ్లు వెళ్లేందుకు రూపకల్పన చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల క్రాస్ ను విస్తరించి అక్కడ నుంచి గాలేరునగరి, అవుకు రిజర్వాయరు, గండికోడ ప్రాజెక్టు అక్కడ నుంచి చిత్రావతి,  వామికొండసాగర్ రిజర్వాయర్లను పూర్తి చేసిన వ్యక్తి ఎవరో ఆలోచన చేయండి. అదే విధంగా బ్రహ్మంసాగర్ పూర్తి చేసి ప్రారంభించారు. అది కూడా కేవలం 9,10 టీఎంసీలు మాత్రమే ఉంటే... దాన్ని పూర్తి స్ధాయిలో నీటిని నింపి పూర్తి స్థాయి స్టోరేజీ నింపిన ఘనత వైయస్.జగన్ కే దక్కుతుంది. గండికోటలో కూడా పూర్తిగా 27 టీఎంసీల నింపిన ఘనత కూడా వైయస్.జగన్ కే దక్కుతుంది. మేం ఏం చేశామని ప్రశ్నిస్తున్నారు? అసలు మీరేం చేశారు. ఏ ప్రాజెక్టునైనా చేయాలన్న ఆలోచన కూడా మీకు కలగలేదు. ఈ రోజు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అని అడుగుతున్నారు. మల్లెల నుంచి మచ్చుమర్రి నుంచి లిఫ్ట్ చేస్తున్నామని చెబుతున్నారు.  ఏ లెవెల్ నుంచి చేస్తున్నామో చెప్పలేదు. 
శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగులకు విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడుకుంటున్నారు, మరోవైపు 777 అడుగుల నుంచి ఇతర ప్రాజెక్టులకు నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు. 825 చేరేలోపే రోజుకి 7 టీఎంసీల నీళ్ళు వాడుకుంటుంటే... శ్రీశైలంలో ఎలా నీళ్లు పైకి వస్తాయి. 834 అడుగులకి శ్రీశైలం చేరితే మల్లెల రిజర్వాయరు ద్వారా 0.3 టీఎంసీ మాత్రమే తరలించవచ్చు. 795 అడుగులు నీటిమట్టం ఉంటే ముచ్చుమర్రి ద్వారా 0.31 టీఎంసీ నీటిని మాత్రమే తీసుకోవచ్చు. 

● రాయలసీమ ప్రజల ఉసురు తీయోద్దు..

అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా రోజుకు 3 టీఎంసీల లిఫ్ట్ చేసే ప్రాజెక్టును డిజైన్ చేసి రూ.3600 ఖర్చుతో పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసి.. అందులో దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేస్తే  మీరు దాన్ని వృధా అని చెప్పడం దారుణం. మీలా ఎవ్వరూ ఆలోచన చేయరు. రాయలసీమ ప్రాంత ప్రజల కరువును పారద్రోలడానికి ఆ ప్రాంతాలు అభివృద్ధి కోసమే ఈ ప్రాజెక్టు. వీటిపై అవగాహన లేకుండానే మీరు మాట్లాడుతున్నారు.  పాలమూరు-రంగారెడ్డి-దిండిని ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు. ఏ స్ధాయిలో కల్వకుర్తి ప్రాజెక్టు లిఫ్ట్ చేస్తున్నారో, ఏ స్ధాయిలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వృధా చేస్తున్నారో కనుక్కోకుండానే మీరు మాట్లాడ్డం శ్రేయస్కరం కాదు. రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాలు బాగుండాలన్న ఆలోచన చేయాలి. ఎవరికీ నష్టం చేయమని మేం చెప్పడం లేదు. దిగువ రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు ఉంటాయి. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మన హక్కుల కోసం మనకున్న బోర్డులు ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాల్సి ఉండగా.. చంద్రబాబు మాత్రం ఆ పనిచేయడం లేదు. దిగువ ప్రాంతాలు చుక్క నీరు కోసం అలమటిస్తుంటే.. ఆ ప్రాంతం పొట్ట కొట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం. 

● పోతిరెడ్డిపాడుని అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదే...

పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి వల్ల, ఉచిత విద్యుత్ వల్ల రాయలసీమలో సాగు పెరిగింది. కానీ చంద్రబాబు మాత్రం తన ఎమ్మెల్యేలతో పోతిరెడ్డిపాడును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నీ ఎమ్మెల్యేలతో రాయలసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాయించావు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నువ్వే ఆపించావని తెలంగాణా ముఖ్యమంత్రి చెబుతుంటే.. ఆ రోజు పర్యావరణ అనుమతులు లేవు అంటూ వేరే కారణం చెప్పావు. ఇవాళ మరలా మీ మంత్రితో  ఆ ప్రాజెక్టు ఏం అవసరం అని మాట్లాడిస్తుంటే... రాయలసీమ ప్రజల బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఇంత అన్యాయం చేస్తుంటే ఎవరిని నిందించాలి? ఈ ప్రాజెక్టు కోసం మీ ఆలోచన మార్చుకుంటామంటే మేం నాలుగు అడుగులు వెనక్కి తగ్గి.. మీ దగ్గరకే వచ్చి మీ వాదన తప్పని నిరూపిస్తాం. ఒక ప్రాంతం పొట్టకొట్టడం తప్పు కాదు. ఇంతకాలం ఎన్టీటీ అనుమతులు లేవని, పర్యావరణ అనుమతులు లేవని ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి ఇంతకాలం ఎందుకు సత్యదూరమైన మాటలు మాట్లాడావు చంద్రబాబూ? నీ ప్రోద్భలంలోనే ఆగిందని నీ మంత్రే చెప్పిన తర్వాత ఇంతకన్నా అన్యాయం ఏముంటుంది? అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలన్న ఆలోచనతోనే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు కరువు గురించి , రాయలసీమ నీటి ఎద్దడి గురించి, ఉత్తరాంధ్రా లో కిడ్నీ వ్యాధి గ్రస్తుల గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది. అలాంటిది ఉత్తరాంధ్రాలో ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బారిత ప్రాంతాల్లో అందరికీ తాగునీటి సరఫరా చేస్తూ.. ఆసుపత్రి నిర్మించి, రాయలసీమలో కరువు లేకుండా చేయడానికి రాయలసీమ లిఫ్ట్ చేపడితే నువ్వేం చేస్తున్నావు చంద్రబాబూ? దాన్ని నిలిపివేయడం ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను అడ్డుకుంటూ శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడానికి సిద్ధమవుతున్నావు. ఇది శ్రేయస్కరం కాదని హితవు పలికారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు.

● చరిత్ర మిమ్నల్ని క్షమించదు చంద్రబాబూ...

రాయలసీమ వాసిగా.. ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేకుండా చెబుతున్నాను. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది.  ఆ రోజున అష్యూర్డ్ వాటర్ గురించి ట్రిబ్యునల్ నిర్ణయించింది. తెలుగుగంగ పని జరిగింది కాబట్టి దానికి నికర జలాలు కేటాయించారు. 
హంద్రీనీవా, గాలేరు నగరి కనీసం 10 శాతం పని చేసుంటే...  వాటికి నికర జలాలు కేటాయించేవారు. అది లేకుండా మరణశాసనం రాశావు. వాటన్నింటికీ   వైయస్.రాజశేఖర్ రెడ్డి  ఊపిరి పోశారు.  ఇవాల ఎగువ రాష్ట్రాలు చేస్తున్న నీటి దోపిడీని అడ్డుకోవడానికి, ఈ ప్రాంతానికి ఊపిరి పోయడానికి, మిగిలిన ప్రాంతాలతో రాయలసీమ సమానంగా ఉండడానికి.. వైయస్.జగన్  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం తీసుకువస్తే దానిపై మీ మంత్రి హేళనగా మాట్లాడ్డం చాలా దారుణం. ప్రాంతం పేరును ఇంకో రకంగా మాట్లాడ్డం సమంజం కాదు. మీకు ఈ ప్రాంతంపో మనసులో ఎక్కడో ద్వేషం ఉంది. ఈ ప్రాంతంలో హైకోర్టు పెడితే దాన్ని తీసేశారు, లా యూనివర్సిటీ, ఎయిమ్స్ తరలించారు. ఈ ప్రాంతానికి జరగాల్సిన మంచిని ఏ రోజూ జరగనివ్వలేదు.  శ్రీసిటీ, హంద్రీనీవా, గండికోట ఇలా ఈ ప్రాంతానికి జరిగిన మేలంతా వైయస్.రాజశేఖర్ రెడ్డి ,వైయస్.జగన్ హయాంలో జరిగాయే తప్ప మీరు ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏమీ లేదు. 
మీరు కచ్చితంగా ఈ ప్రాంత ద్రోహులుగా మిగలడం ఖాయం. ఎగువ ప్రాంతాల వాళ్లు నీటిని వాటాలు ప్రకారమే తీసుకుంటున్నారా? ఎగువ రాష్ట్రాల వాళ్లు నీటిని విద్యుత్ కోసం 20-40 రోజుల్లోనే ఖాలీ చేస్తున్నారు. దీనిపై బోర్డులు ఎందుకు మాట్లాడ్డం లేదు? నిబంధనలు వ్యతిరేకంగా వెళ్లాలనో, నీటి దోపిడీ చేయాలనో మా అభిమతం కాదు. మీ వాదనలు వెనక్కి తీసుకోవాలి. రాయలసీమపై అవగాహన లేకుండా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. అన్ని ప్రాంతాలపై సమానమైన ప్రేమ ఉంటే.. ఏడాదిలోగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో చరిత్ర మిమ్నల్ని క్షమించదని హెచ్చరించారు. 

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ..

పోలవరం ప్రాజెక్టులకు అన్ని అనుమతులు రాకముందే... పనులు ప్రారంభం అయ్యాయి. పనులు చేస్తూ అంచలు అంచలుగా అనుమతులు తెచ్చుకుంటారు. ఇవాళ ఎన్టీజీ అనుమతి ఉండే కల్వకుర్తి చేపట్టారా? ఆల్మట్టి రెట్టింపు చేస్తున్నారు? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టిగా అడ్డుకోవాల్సింది పోయి.. గురుశిష్యులిద్దరూ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎగువ రాష్ట్రాలు చేస్తున్న అన్యాయంపై కలిసికట్టుగా పోరాటం చేయాలన్న ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు.