దుష్ప్ర‌చారం, వ్యక్తిత్వ హననమే చంద్రబాబు అజెండా

14 Mar, 2026 17:13 IST

వైయస్ఆర్ జిల్లా: సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం కాకుండా, కేవలం ప్రత్యర్థులపై బురద జల్లడానికే ఉపయోగిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అడ్డగోలుగా ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. "సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్  విచారణలో జంతు కొవ్వు లేదని తేలిన తర్వాత కూడా, బాత్‌రూమ్ కెమికల్స్ కలిసాయంటూ మాట్లాడటం రాజకీయాలకు నిదర్శనం. మతాన్ని, భక్తిని కేవలం ఓట్ల కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లింది" అని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడే చంద్రబాబు.. రెండేళ్లుగా అధికారంలో ఉండి ఎందుకు నిజాన్ని నిరూపించలేకపోతున్నారని నిలదీశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు, హైకోర్టును సీమకు రాకుండా అడ్డుకున్న చంద్రబాబే రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. తిరుమల పరిధిని ఏడు కొండలుగా నిర్ధారిస్తూ వైయస్సార్ జీవో ఇస్తే, నాడు దానిని రద్దు చేస్తానన్న చంద్రబాబు.. నేడు తానే హిందూ ధర్మ పరిరక్షకుడినని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైన చంద్రబాబు...  తప్పుడు ప్రచారాలతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలు, తిరుమల, సింహాచలం తొక్కిసలాట మరణాల నుంచి నిన్నటి కదిరి నర్సింహస్వామి రథయాత్ర వరకు జరిగిన ప్రతి తొక్కిసలాటకూ చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమన్నారు.
ఇప్పటికైనా అబద్ధాల రాజకీయం ఆపి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

● నాలుగు దశాబ్దాల్లో ఒక్క మంచి పనీ చేయని చంద్రబాబు...

తిరుమల లడ్డూ అంశం, వివేకానందగారి హత్యతో పాటు గత ప్రభుత్వ అప్పులు, వ్యవసాయం, నీటిపారుదలశాఖ ఇలా అన్నింటిలోనూ అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. వాస్తవాలు చెప్పడం చంద్రబాబు చరిత్రలోనే లేదు. నిత్యం ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దాన్నే ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే చంద్రబాబు అజెండా. ఇన్నేళ్ల పాటు సీఎంగా చేసినా... ఫలానా అంశంలో రాష్ట్రచరిత్రలో నా పేరు చిరస్ధాయిగా నిలిచిపోతుందని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పని కూడా చేపట్టలేదు.  ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

● పచ్చి అబద్దాలు- అడ్డగోలు ఆరోపణలు...

బాధ్యతాయుతమైన సీఎం స్ధానంలో ఉండి కూడా...ఆధారాల్లేకుండా తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు, పందికొవ్వు కలిసిందని పదే, పదే నోటికొచ్చినట్లు మాట్లాడాడు.సున్నితమైన మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా గొడవలు సృష్టించి, మిగిలిన వర్గాలను  కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేయాలన్న దురుద్దేశ్యంతో ఇదే అంశంపై పదేపదే మాట్లాడారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజల మనోభావాలు, భగవంతుడికి సంబంధించిన అంశం కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా సుప్రీం కోర్టునే ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు లేదని నిర్ధారించిన తర్వాత కూడా బాత్రూమ్ కెమికల్స్ ప్రసాదంలో కలిసాయంటూ మాట్లాడ్డం చంద్రబాబుకి దేవదేవుడి మీద ఉన్న విశ్వాసం ఏపాటిదో స్పష్టమవుతుంది. 
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చివరకు మతాన్ని, కులాన్ని ఓన్ చేసుకోవాలన్న ఆలోచన దురదృష్టకరం. మతపరమైన విశ్వాసాలు అందరికీ ఉన్నాయి. కానీ చంద్రబాబు మాత్రం తనకే ఉన్నట్టు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ తరహా వ్యవహారశైలితో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. 

దేవదేవుడిమీద నమ్మకంతో కేంద్ర అటవీశాఖకు లేఖ రాసి మరీ అన్ని అనుమతులు తీసుకొచ్చి రెండు కొండలుగా ఉన్న తిరుమల పరిధిని ఏడు కొండలగా నిర్ధారిస్తూ... వైయస్.రాజశేఖర రెడ్డి జీవో జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 19 దేవస్థానాల్లో అన్యమత ప్రచారం చేయకుండా నిరోధించేందుకు ఏకంగా జీవోలు జారీ చేశారు. కానీ ఇదే చంద్రబాబు 2009 ఎన్నికల్లో గెలుపుకోసం వైయస్సార్ హయాంలో ఇచ్చిన రెండు జీవోలను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి.. ఇవాళ మాట మారుస్తూ.. ఎదుట వాళ్లపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. 
రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా... సభల్లో వైయస్.జగన్ తన బాబాయిని చంపాడంటూ చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాడు. గొడ్డలితో వివేకానందరెడ్డిని నరికి చంపామని స్వయంగా అంగీకరించిన వ్యక్తులను కేవలం తన రాజకీయ లబ్ది కోసం అప్రూవర్లుగా మార్చి, దాదాగిరి చేసుకొమ్మని వారిని సొసైటీలో వదిలిపెట్టడంతో పాటు .. హత్యతో సంబంధం లేని వారిని జైల్లో పెట్టి హింసించిన చరిత్ర చంద్రబాబుది. అయినా చంద్రబాబు పగ చల్లారలేదు. 

● అధికారం నీదే దమ్ముంటే నిరూపించు బాబూ?

ఈ కేసు గురించి వైయస్.జగన్ పై పదే పదే విమర్శనలు చేసిన నువ్వు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లైంది. చంద్రబాబూ నీకు  ఇక్కడ నీ చేతిలో అధికారం ఉంది, నీ మద్ధతుతో కేంద్రప్రభుత్వం నడుస్తోంది, నీకు దమ్ముంటే వాస్తవాలు బయటపెట్టు? సుప్రీం కోర్టు కూడా మీరు ఈ కేసును ట్రాక్ చేస్తున్నారని చెప్పింది. అయినా ఇంకా దాన్ని పెంచుకుంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమం చేయడం దురదృష్టకరం. 

చేసిన మంచి కూడా వైయస్.జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీ చెప్పుకోలేకపోయింది. కానీ చంద్రబాబు మాత్రం పదే, పదే తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేయడం సమంజసం కాదు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రూ.9 లక్షల కోట్లు, రూ.10 లక్షల కోట్లు అంటూ అప్పులపైనా అదే తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి చంద్రబాబు 2014-19 మధ్య అప్పులతో కలిసి వైయస్ఆర్‌సీపీ హయాంలో అధికారికంగా రూ.3.31 లక్షల కోట్లు అని తేలిన తర్వాత అదే తప్పుడు ప్రచారం చేయడం అలవాటుగా మారింది. తాజాగా ఈ రెండేళ్లలోనే రూ.3.31 లక్షల కోట్లు చేసిన అప్పుపై ఏం సమాధానం చెప్తావు చంద్రబాబూ? వైయస్.జగన్ హయాంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమం కోసం  రూ.2.81 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తూ.. రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే... చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండానే రెండేళ్లలో గత ఐదేళ్ల కంటే ఎక్కువ అప్పులు చేశారు. ఆర్దిక మంత్రి మరలా సిగ్గు లేకుండా కేవలం రూ.1 లక్ష కోట్లు మాత్రమే అప్పు చేశామని చెబుతున్నారు. అదే నిజమైతే మీ ఆర్దికశాఖ కార్యదర్శితో లెటర్ విడుదల చేయండి అని అడిగితే సమాధానం లేకుండా పోయింది. 

● హామీల అమల్లో పచ్చి మోసం...

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశాడు. ఉద్యోగ కల్పన మోసం, రూ.3వేల నిరుద్యోగభృతి మోసం, 50 ఏళ్లు దాటిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తానన్న పెన్షన్ మోసం, 18-60 సంవత్సరాల లోపు అక్కచెల్లెళ్లకు రూ.1500 నెలకి ఇస్తానన్న హామీ కూడా మోసంగా మిగిలింది. బడ్జెట్ లో వీటి పై ప్రస్తావన కూడా లేదు. ప్రజలు వీటిపై ఎక్కడ నిలదీస్తారేమోనన్న భయంతో పదే, పదే తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరకు కేబినెట్ మీద కూడా చంద్రబాబుకి పట్టు లేకుండా పోయింది. ఇక డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ అయితే కేబినెట్ మీటింగ్ కి కూడా హాజరు కాకుండా తన సినిమా ప్రమోషన్ లో మునిగిపోయాడు. తన సినిమా టిక్కెట్లు ధరల పెంపు గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్. రైతుల ఇబ్బందులు గురించి మాత్రం నోరు విప్పడం లేదు. రెండేళ్లలో కేబినెట్ మీటింగ్ కే మంత్రులు రావడం లేదంటే ప్రభుత్వం మీద చంద్రబాబుకి ఏమాత్రం పట్టు ఉందో అర్ధం అవుతుంది.

● రైతులను నిలువునా ముంచిన కూటమి...

కేంద్రంతో సంబంధం లేకుండా వాళ్లిస్తున్న రూ.6 వేలు కాకుండా ప్రతి రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తానని తొలి ఏడాదే ఎగరగొట్టిన చరిత్ర చంద్రబాబుది. అదే వైయస్.జగన్ హయాంలో పెట్టుబడి సాయం కింది రూ.50వేలు రైతులకు ఇస్తానని చెప్పి... ఎన్నికల అనంతరం రూ.50 వేలకు బదులు రూ.67,500 ఐదేళ్లూ ఇచ్చిన చరిత్ర్ వైయస్.జగన్ ది. అదే రైతులకు హామీ ఇచ్చి తొలిఏడాది ఏమీ ఇవ్వకుండా ఎగరగొట్టిన చంద్రబాబు.. రెండో ఏడు రూ.20వేలకు బదులు కేవలం రూ.14 వేలు మాత్రమే ఇచ్చి అంతా ఇచ్చానని ప్రచారం చేసుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. మామిడి, టమోట తో సహా ప్రతి రైతుకూ గిట్టుబాటు కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. ఇవాళ రైతులను ఉద్దరించానని, హార్టికల్చర్ నా వల్లే వచ్చిందని సిగ్గులేకుండా అబద్దాలు చెబుతున్నాడు.

● సాగునీటి ప్రాజెక్టులూ నా వల్లే అంటూ భజన...

ఇక సాగునీటి ప్రాజెక్టులనూ నేనే నిర్మించానంటూ చంద్రబాబు అబద్దాలు చెబుతున్నాడు. ఒక్క ప్రాజెక్టుకైనా డీపీఆర్ కూడా సిద్ధం చేయని చరిత్ర చంద్రబాబుది. ఎన్టీఆర్ హయాంలో రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రాజెక్టు కట్టిన తర్వాత...  వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.3,800 కోట్లు ఖర్చు పెట్టి పూర్తిస్థాయికి తీసుకొచ్చారు. పోతిరెడ్డిపాటు ఎత్తు పెంచితే అందుకు వ్యతిరేకంగా మాట్లాడావు బాబూ. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణం వైయస్.జగన్ ప్రారంభిస్తే.. దాన్ని నిలుపుదల చేసిన వ్యక్తివి నువ్వే బాబూ. నువ్వా రాయలసీమను ఉద్దరించేది. రాయలసీమ లో ఉండాల్సిన హైకోర్టును లేకుండా సీమకు అన్యాయం చేసింది నువ్వు కాదా? లా యూనివర్సిటీని తరలించిందీ నువ్వే. ఇన్ని రకాల రాయలసీమ ప్రజల కడుపు కొడుతూ.. పదే,పదే తప్పుడు ప్రచారంతో నువ్వు చేస్తున్న మోసాలకు ప్రజలతో పాటు దేవుడు కూడా మొట్టి కాయలు వేయడం ఖాయం.

● ప్రచార పిచ్చితో ప్రజల ప్రాణాలు బలిగొన్న బాబు..

నీ ప్రచార పిచ్చితో గతంలో గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో నిర్దాక్షిణ్యంగా 19 మందిని పొట్టన పెట్టుకున్నావు. దాని గురించి ప్రశ్నిస్తే ప్రమాదాల్లోనూ, పూరి జగన్నాధ రధయాత్రలో చనిపోరా? అంటూ హేళనగా మాట్లాడావు. కందుకూరు మీటింగ్ లో 7 మంది, గుంటూరులో చీరల పంపిణీలో 5 మంది, తిరుపతిలో వైకుంఠదర్శన టిక్కెట్ల కోసం తొక్కిసలాటలో 6మంది, కాశీబుగ్గ తొక్కిసలాటలో 9 మంది..  పదే పదే నీ హయాంలో ప్రజల ప్రాణాలను హరిస్తూనే ఉన్నావు. తాజాగా కదిరి నర్సింహస్వామి రధయాత్రలో తొక్కిసలాట పాపం నీదే బాబూ? ఇప్పటికైనా ప్రజల మేలు కోసం పనిచేయు బాబూ? ప్రజల్లో చిరస్ధాయిగా నిల్చిపోయే పనులు చేపట్టు. 

● ఇది కల్తీ కూటమి పాలన...

ఇవాళ తన రెండేళ్ల పాలనలో అంతా తానే చేశానని చంద్రబాబు అవే అబద్దాలను పదే, పదే చెబుతున్నాడు. పాలమూరు కరువును పారదోలింది వైయస్సార్ అయితే.. ఉత్తారాంధ్రాలో  ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ , ఆ ప్రాంత ప్రజల ప్రతి ఇంటికి తాగునీరందించిన ఘటన వైయస్.జగన్ కు దక్కుతుంది. ఇవాళ పాలల్లోనూ, నెయ్యిలోనూ ప్రతిదీ కల్తీ. కల్తీ పాల వల్ల ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 20 మందికి పైగా చనిపోయారు. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలే.తిరుమలకు సరఫరా చేసే నెయ్యి విషయంలోనూ మోసమే. రూ.322 ఉన్న నెయ్యిని రూ.750 పైగా పెంచి  ఇందాపూర్ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. స్వయంగా కేబినెట్ మీటింగ్ లో హెరిటేజ్ కంపెనీ రూ.200 కోట్లు పెట్టుబడి పెడుతుందని నీ కంపెనీకి నువ్వే రూ.100 కోట్లు రాయితీలు ప్రకటించుకోవడానికి సిగ్గుగా లేదా చంద్రబాబూ? ఇన్ని రకాలగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నీ తీరు మారకపోతే కచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. 

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... 

వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలేంటో చెబుతున్నా.. మరోపక్క తమకున్న వ్యవస్థల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. మేం ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నాం.. అధికారం మీ చేతుల్లో ఉంది, తప్పు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
మెడికల్ కాలేజీలతో పాటు మా హయాంలో జరిగిన అభివృద్ధిపై  మేం ప్రజలకు వాస్తవాలు చెబుతుంటే.. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో పరిశీలనకు రమ్మంటే మాత్రం ముందుకు రావడం లేదని మండిపడ్డారు.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పై టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసి.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.