ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో మాల్ కబ్జా
తాడేపల్లి: అవసరాల కోసం ఒక ఎన్నారై చేసిన అప్పులను ఆసరాగా చేసుకుని తన మనుషుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్‌ని కాజేయాలనే కుట్రకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెరదీశాడని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధితుడి భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్నారై తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ కార్యకర్త అని తెలిసి కూడా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నారైల ఆస్తులను కాజేస్తుంటే ఏ ధైర్యంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో అప్పు చేస్తే నాలుళ్లపాటు దాని గురించి అడగకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాల్‌ని చేజిక్కించుకోవాలనే కుట్రతో ఆ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారని చెప్పారు. అందులో భాగంగా రైతుల నుంచి రూ.30 కోట్లు డబ్బులు తీసుకుని పారిపోయారంటూ విష ప్రచారం మొదలు పెట్టారని, మాల్ ముందు టెంట్లు వేసి ఎవరూ లోపలికి ప్రవేశించకుండా చేసి మూతపడే వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. దీంతో ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఆమె బాధలను విన్న జగన్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. మాల్‌ని తమకు హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశించినా పోలీసులు ఎమ్మెల్యేతో కుమ్మక్కై తమకు న్యాయం చేయడం లేదని బాధితురాలు కృష్ణప్రియ ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం రూ. 90 లక్షలు అప్పు చేస్తే ఏ లెక్కన ఇప్పుడు ఏడున్నర కోట్లు అవుతుందని ఆమె ప్రశ్నించారు. అయినా ఆ డబ్బును చెల్లించడానికి తాము ముందుకొచ్చినా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం ఒప్పుకోవడం లేదని, ఎలాగైనా ఆ మాల్‌ను దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. వైయస్ జగన్ గారిని కలిసిన తర్వాత ఆయనిచ్చిన హామీతో కొంచెం రిలీఫ్‌గా ఉందని ఆమె మీడియాకు వివరించారు.
వారు ఇంకా ఏమన్నారంటే...
● అరాచక శక్తులకు ముఠా నాయకుడిగా చంద్రబాబు
: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి
కూటమి ప్రభుత్వ అరాచకాలు చూస్తుంటే నీచనికృష్టులతో భూమి మొత్తం నిండిపోయిందన్న శ్రీశ్రీ రచనలు గుర్తుకొస్తున్నాయి. కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు,అవినీతి చేస్తున్న అరాచక శక్తులకు చంద్రబాబు, లోకేష్ ముఠా నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ దగాకోరు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని ప్రజలంతా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కంచే చేను మేసినట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలే స్థలాలు కబ్జా చేసేస్తుంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- సొంత పార్టీ ఎన్నారై మాల్‌ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆక్రమించాడు
టీడీపీ నాయకుల కబ్జాలకు సొంత పార్టీ కార్యకర్తలు కూడా అతీతం కాదనే స్థాయికి వారి అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయి. మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన మురళీమోహన్, కృష్ణప్రియ అనే ఎన్నారై దంపతులు అమెరికాలో ఉద్యోగం చేసి కష్టపడి కూడబెట్టిన డబ్బుతోపాటు అప్పు చేసి చిలకలూరిపేటలో ఒక మాల్ నిర్మించుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మనుషులు దాన్ని ఆక్రమించుకుని అందులోకి వారిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఆ మాల్‌ను మురళీమోహన్ కుటుంబానికే అప్పజెప్పాలని కోర్టు పోలీసులను ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కోట్ల విలువైన ఆస్తిని కాజేయాలని చేస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న కుట్రలకు పోలీసులు వంతపాడటం హేయం. దీంతో ఆ కుటుంబం నుంచి బాధితురాలు కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిసి తన కష్టం చెప్పుకున్నారు. వైయస్ఆర్‌సీపీ తరఫున న్యాయపరంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
● కోర్టు తీర్పు చెప్పినా పోలీసులు అమలు చేయడం లేదు
- కృష్ణప్రియ, ఎన్నారై మురళీమోహన్ భార్య
20 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేసి పైసాపైసా కూడబెట్టి చిలకలూరిపేటలో ఒక మాల్ నిర్మించుకున్నాం. అందులో అత్యాధునిక టెక్నాలజీతో రెండు థియేటర్లు, బాంకెట్ హాల్, ఎలక్ట్రానిక్ స్టోర్ ఏర్పాటు చేశాం. కోవిడ్ సమయంలో బిజినెస్‌లు లేని కారణంగా రూ.90 లక్షలు అప్పులు చేశాం. దాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా మాల్‌ను పూర్తిగా మూతపడేలా చేశారు. రూ.90 లక్షల అప్పులు చేస్తే ఏడున్నర కోట్లు తీసుకుని పారిపోయారంటూ మా మామగారి ఫొటోలతో పాంప్లేట్లు ప్రింట్ చేసి ఊరంతా పంచి పెట్టి మా పరువును రోడ్డున పడేలా చేశారు. అంతేకాకుండా రైతుల సొమ్ము రూ.30 కోట్లు కాజేశామంటూ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. మమ్మల్ని స్వేచ్ఛగా బిజినెస్ చేసుకోనివ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకొచ్చి కూర్చుంటారు. తమ కళ్ల ముందు దౌర్జన్యాలు కనిపిస్తున్నా తమకేం సంబధమే లేనట్టు వ్యవహరిస్తున్నారు. జనం థియేటర్లకు, మాల్ కి రాకుండా రోడ్డుపై టెంట్ ఏర్పాటు చేసి గుంపులుగా రౌడీలను మోహరించి అడ్డుకున్నా, సీసీ కెమెరాలను పగలగొట్టినా పోలీసులు పట్టించుకోలేదు.
- మాల్ కాజేయాలన్నదే ఎమ్మెల్యే ప్రత్తిపాటి దుర్బుద్ధి
కూటమి పాలనలో సొంత ఊరిలో కూడా మా కుటుంబానికి రక్షణ లేదు. ఇన్ని దౌర్జన్యాలు చేస్తుంటే ఎన్నారైలు ఏ ధైర్యంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు? కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మమ్మల్ని అప్పుల గురించి కూడా అడగలేదు. కానీ అడ్డదారిలో మాల్ ని కాజేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మాపై వేధింపులు మొదలయ్యాయి. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అండ చూసుకుని కొంతమంది దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలీసులు కూడా కబ్జా దారులతో కుమ్మక్కై మమ్మల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎంత వడ్డీ వేస్తే రూ. 90 లక్షలు నాలుగేళ్లలో ఏడున్నర కోట్లు అవుతాయి? అయినా ఆ ఏడున్నర కోట్లు చెల్లిస్తామని చెప్పినా వారు ముందుకురావడం లేదు. దీనిపై మాట్లాడటానికి నా భర్త మురళీ మోహన్ చిలకలూరిపేట వస్తే డ్రగ్స్ కేసులు పెడతామని వేధించి వెనక్కి వచ్చేలా చేశారు. బిజినెల్ ఎలా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు.
మాకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిసి న్యాయం చేయాలని కోరడం జరిగింది. వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయ సహాయం అందజేస్తామని వైయస్ జగన్ గారు హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన తర్వాతే మాకు కొంచెం ఉపశమనం కలిగినట్టుగా ఉందని కృష్ణప్రియ స్పష్టం చేశారు.