వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామ నవమి పర్వదిన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైయస్సార్ సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, మల్లాది విష్ణు, జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. శ్రీ సీతారాముల కళ్యాణం, పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నేతలు పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. పానకం, వడపప్పు వంటి ప్రసాదాలను పార్టీ నేతలు భక్తులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొని ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.