మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి హేయం

31 Jan, 2026 20:15 IST

విశాఖ‌: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ గూండాలు చేసిన దాడి రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.

ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమ‌ర్నాథ్ ఏమ‌న్నారంటే..:
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు, కార్యకర్తలు దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆయన నివాసం ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, ఈ రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజ్ నడుస్తోందని స్పష్టంగా చూపించారు.

మొన్న వంగ‌వీటి..ఇవాళ అంబ‌టి రాంబాబు..
వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి అంబటి రాంబాబు పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో ఆయన్ను హతమార్చాలని కుట్రలు చేస్తున్నారు. 1988లో ప్రతిపక్షంలో ఉన్న వంగవీటి మోహన్‌రంగా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్య చేశారు. 2016లో తునిలో ముద్రగడ పద్మనాభం టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టి వేధించారు. ఆయన భార్య, పిల్లలను బూతులు తిట్టి, ఆయన్ను చంపేందుకు ప్రయత్నించారు. ఇవాళ అదే తరహాలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్ర‌శ్నిస్తున్నార‌ని అంబటి రాంబాబును హత్య చేయాలని ప్రయత్నించారు. 

హ‌త్య చేసేందుకే ఇంట్లోకి వ‌చ్చారు
తిరుమల లడ్డూ అంశంపై ప్రశ్నించినందుకు లేనిపోని తప్పుడు కేసులు పెట్టారు. వాటిని డైవర్ట్ చేయడానికి ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలపై ప్రశ్నలు లేవనెత్తితే, చివరికి అంబటి రాంబాబును హ‌త్య చేసేందుకు టీడీపీ మూక‌లు ఇంట్లోకి  వ‌చ్చి దాడికి దిగారు. ఇంటిలోపలికి పచ్చమూకలు చొరబడి అంబటి భార్య, పిల్లలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. పోలీసులు అక్కడికి బందోబస్తు కోసం వచ్చారా? లేక హత్య జరుగుతుంటే టీడీపీ శ్రేణులకు సహకరించేందుకే వచ్చారా? ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. జనసేన స్టాండ్ ఏంటో చెప్పాలి.

సామాన్యుల ప‌రిస్థితి ఏంటి?
గుంటూరు నగరంలో, రాజధానికి కూతవేటు దూరంలో, డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి?. ప్రతి దానికి ఖర్మఫ‌లం ఉంటుంది. అది తిరిగి మీవైపే వస్తే ఎలా ఉంటుందో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక రుచి చూపిస్తాం. అంబటి రాంబాబుపై దాడిని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.

అంబటి రాంబాబు ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఆయన మాటల్లో వ్యంగ్యం ఉంటుంది తప్ప ఎవరినీ కించపరచరు. ఇటీవల సంక్రాంతి రోజున ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే కార్యక్రమం చేపట్టారు. ఆయన విడుదల చేసిన పాటపై ఈ ప్రభుత్వానికి కోపం వచ్చి, ప్రశ్నించే కంఠాన్ని మూయాలనే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారు. సద్దాం హుస్సేన్‌కు, గడ్డాఫీకి పట్టిన గతే చంద్రబాబుకు కూడా తప్పదు అని గుడివాడ అమ‌ర్నాథ్ హెచ్చ‌రించారు.