శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీకి షాక్
నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గంలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13న వెలుగోడు మండలంలో 25 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇవాళ ఆత్మకూరు మండలంలో మరో 25 కుటుంబాలు ప్రతిపక్ష పార్టీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాయి. సిద్దేపల్లి, డెయిరీ కాంప్లెక్స్ గ్రామాల నుంచి 25 కుటుంబాలు అధికార పార్టీలో చేరాయి. సిద్దేపల్లి గ్రామ సర్పంచ్ రేనాటి ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ మార్త భాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి రెడ్డి సమక్షంలో టీడీపీ నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారంతా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వర్గానికి చెందిన వారు. వీరితోపాటు సిద్దేపల్లి ఎస్సీ కాలనీ టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. మంగళవారం పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని సిద్దేపల్లి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం రెండు గ్రామాల టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకపోవడం, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరిష్కరిస్తుండటం, సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వైయస్ఆర్‌సీపీలో చేరినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటామని వారు పేర్కొన్నారు.