ఏపీని టీడీపీ మ‌రో మ‌ణిపూర్‌లా మారుస్తుంది

24 Jul, 2024 15:12 IST

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతున్నా.. కేంద్రం ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, ఏపీ మరో మణిపూర్‌ అవుతుందని, ఇది ఏ మాత్రం సరికాదని, వెంటనే జోక్యం చేసుకోవాల‌ని శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ లోక్‌స‌భ ప‌క్ష నేత అర‌వింద్ సావంత్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో వైయ‌స్ఆర్ సీపీ చేప‌ట్టిన నిరసన కార్యక్రమానికి హాజ‌రై సంఘీభావం తెలిపారు. ఏపీలో టీడీపీ గూండాలు చేసిన దాష్టీకాల‌పై ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు అర‌వింద్ సావంత్ ప్ర‌క‌టించారు. 

ఈ సందర్భంగా అరవింద్‌ సావంత్‌ ఏమన్నారంటే..
నేను శివసేన లోక్‌సభ పక్ష నేతను. మా ఆత్మకు క్షోభ కలిగించే ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి.  మేము గతంలో చంద్రబాబుతో కలిసి, కూటమిలో ఉన్నాము. ఎన్డీఏలో కూడా కొనసాగాం. శివసేన పార్టీలో చీలిక వచ్చినప్పుడు, చాలా మంది పార్టీని వీడారు. కానీ ఉద్ధవ్‌ ఠాక్రే గట్టిగా నిలబడ్డారు. సరిగ్గా అలాగే వైయ‌స్ జగన్  కూడా రాజకీయాల్లో అలా నిలబడ్డారు. అందుకే మేము మా పార్టీలో వైయ‌స్‌ జగన్ గురించి మాట్లాడుకుంటాము.  ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, అన్నీ తట్టుకుని వైయ‌స్ జ‌గ‌న్‌ నిలబడ్డారు. ప్రజల మద్దతుతో సీఎం అయ్యారు. 

నేను ఈరోజు ధ‌ర్నాలో కొన్ని చిత్రాలు, వీడియోలు చూశాను. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి. కానీ, ఈ తరహాలో ప్రతీకార దాడులు, కక్ష సాధింపు సరికాదు. ఈరోజు అధికారంలో ఉండొచ్చు. రేపు దాన్ని కోల్పోవచ్చు. కానీ, ఈ విధంగా గెలిచిన‌ తరవాత, ఓడిన పార్టీపై దాడులు చేయడం, ఆ పార్టీ నాయకులను ఎంచుకుని మరీ చంపడం, వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఏపీలో సీఎం కొడుకు ఏకంగా రెడ్‌ బుక్‌ పట్టుకుని తిరుగుతున్నాడు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. రాజకీయాల్లో ఈ తరహా చర్యలు ఏ మాత్రం సరికాదు.

ఏపీలో జరుగుతోందే.. మహారాష్ట్రలో కూడా కొనసాగుతోంది. ఈడీ దాడులు. సీబీఐ కేసులు. వేధింపులు. నువ్వు ఈరోజు అధికారంలోకి రావొచ్చు. రాకపోవచ్చు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం. దేన్ని అయినా స్వీకరించాలి. అంతేకానీ, ఈ తరహాలో విపక్షంపై దాడులు, వేధింపులు సరికాదు. అందుకే వైయ‌స్ జగన్‌కి, ఆయన పార్టీకి అండగా నిలవడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. మా ముంబైలో తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరు తెలంగాణ, ఆంధ్ర వారెవరో కూడా తెలియదు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏపీలో ఇంత జరుగుతున్నా, మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, అది మరో మణిపూర్‌ అవుతుంది. ఇది ఏ మాత్రం సరికాదు. కాబట్టి, వెంటనే జోక్యం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఈ పోరాటంలో మేము వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి అండగా నిలుస్తాము. పార్లమెంటులో కూడా వారితో కలిసి పని చేస్తాం` అని ప్ర‌క‌టించారు అర‌వింద్ సావంత్‌.