వైయస్ఆర్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ ది ప్రభుత్వ హత్యే
తాడేపల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్య వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు భావజాలమే ఉందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, స్థానిక సీఐ బెదిరింపులకు భయపడి వందలాది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఇవాళ్టికీ గ్రామం బయటే ఉన్నారని, ఇలాంటి సమయంలో ఆనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన కార్యకర్త మందా సాల్మన్ ను కొందరు రాడ్లతో కొట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారన్నారు. సాల్మన్ హత్యకు నిరసనగా దళిత సంఘాలతో కలిసి జిల్లా కేంద్రాల్లో నిరసనలకు సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. ప్రెస్ మీట్ లో సుధాకర్ బాబు ఇంకా ఏమన్నారంటే..
● మందాసాల్మన్ హత్య వెనుక చంద్రబాబు భావజాలం
చంద్రబాబు స్వతహాగా దళిత వ్యతిరేక భావజాలం కలిగిన రాజకీయ నాయకుడు, కొన్ని వర్గాల కోసమే పుట్టిన నాయకుడు. ఆ వర్గాలు పెత్తందారీ వ్యవస్థతో, కార్పోరేట్ శక్తుల ఆర్ధిక బలంతో గ్రామాల్లో పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీ వర్గాలపై పెత్తనం చేయాలని తహతహలాడే శక్తులకు చంద్రబాబు నాయకుడు. మందా సాల్మన్ హత్య కూడా ఆ భావజాలంతో జరిగిందే. పిన్నెల్లి గ్రామంలో ఏ ఆధిపత్యం చెలాయించడానికి ఇది సందర్భం కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగట్లేదు. రాజకీయ గొడవలు కూడా అక్కడ లేవు. ఎందుకంటే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు గ్రామాన్ని వీడి చాలా కాలమైంది. అయినా తృప్తి చెందని తెలుగుదేశం పార్టీ నాయకులు, వారికి మద్దతు పలికే స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు వారి అధికార మదం, దళిత వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించి మాదిగ వర్గానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు తన దళిత వ్యతిరేక భావజాలాన్ని ఎప్పటికప్పుడు బయటపెట్టుకుంటూనే వచ్చాడు. 2024లో తాను అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళితుల మీద దాడులు పెరిగిపోయాయి. గ్రామ బహిష్కరణలు విధించారు. ఎప్పుడో మా తాతల రోజుల్లో ఉంటే అంటరానితనాన్ని, రెండు గ్లాసుల సిద్దాంతాన్ని ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ద్వారా అమలు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
● బాబు పాలనలో అటకెక్కిన దళితుల పథకాలు
సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ వెళ్లిపోయినా దళితులకు చంద్రబాబు బహుమతులుగా ఇస్తోంది హత్యలు, మారణ కాండలు, గ్రామ బహిష్కరణలే. రాష్ట్రంలో మాల, రెల్లి కులస్తులు చంద్రబాబు భావజాలానికి వ్యతిరేక భావజాలంతో సామ్యవాదం, సామాజిక న్యాయాన్ని నమ్మిన వాళ్లం. మిమ్మల్ని మనుషులుగా చూశారు కాబట్టే ఇందిరాగాంధీ, వైఎస్సార్, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మేం ప్రేమిస్తూ వచ్చాం. చంద్రబాబు దళితుల్ని దళితులుగానే ఉంచి, వారికి విద్యాఉపాధి లేకుండా చేస్తూ, చిన్న, సన్నకారు రైతుల్ని కుదేలు చేశాడు కాబట్టి మేం వ్యతిరేకిస్తున్నాం. దళితులతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి విడదీయలేని అనుబంధం ఏర్పడిందంటే మమ్నల్ని ఆయన రాజకీయ, ఆర్ధిక, సామాజిక కోణంలో అభివృద్ధి చేశాడు. మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రులు, కార్పోరేషన్, మేయర్, జడ్పీ ఛైర్ పర్సన్లు, ఎంపీపీలుగా చేసి ఆయన గౌరవించారు. కేవలం ఐదేళ్లలో 38 పథకాల ద్వారా మాల, మాదిగ, రెల్లి కులస్తులకు 70 వేల కోట్లు ఇచ్చిన మహానుభావుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. మా ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువులో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి భావం, ఔదార్యం, బాట ఉన్నాయి. అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి పథకాల్లో సింహభాగం మాకు లభించింది. కానీ చంద్రబాబు పాలనలో విజయవాడలో ఉన్న అత్యంత ఎత్తయిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ఇప్పటివరకూ తాకలేదు. వీధుల్లో ఉన్న విగ్రహాలకు మాత్రమే పూల మాలలు వేస్తున్నారు. మా గౌరవానికి ప్రతీక, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ను చంద్రబాబు దళిత నాయకుడిగా మాత్రమే చూస్తున్నారు.
● మందా సాల్మన్ ది ప్రభుత్వ హత్యే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. టిఫిన్ సెంటర్లో టీ కూడా ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకని ప్రశ్నిస్తే మీకు టీ ఇస్తే మిమ్మల్ని కూడా వెలేస్తారని చెప్పారట. ఈ గ్లోబలైజైషన్ కాలంలో బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన మాట్లాడే, జీవించే హక్కు పూర్తిగా తొక్కేసిన పవన్ కళ్యాణ్.. నన్ను మాల, మాదిగ, రెల్లి కులస్తుడిగా చూసే పవన్ భావజాలం ఈ కొత్త ఏడాదిలో అయినా మారుతుందేమోనని ఆశించాం. కానీ మందా సాల్మన్ ను చంపేస్తే చంద్రబాబు నారావారిపల్లెలో కూర్చుని సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ చంపిన వ్యక్తుల్లో ఒక్కరైనా అరెస్టు అయ్యారా అని అడుగుతున్నాం. మీ మద్దతుదారులైన పోలీసుల్ని కాపలాగా పెట్టి చేయించిన ప్రభుత్వ హత్య ఇది. మందాసాల్మన్ ను చంపడం అంటే టీజేఆర్ సుధాకర్ బాబును చంపడమే, రాష్ట్రంలో దళితుల్ని చంపడమే.
● మందాసాల్మన్ హత్యపై వైయస్ఆర్‌సీపీ పోరాటం
గతంలో కారంచేడు, నీరుకొండ వంటి ఘటనల నుంచి పిఠాపురం, పత్తికొండలో అసెంబ్లీ ఫలితాలు రాగానే మాదిగ పల్లెమీద పడి మహిళల్ని చెరిచి గ్రామ బహిష్కరణ చేసిన చరిత్ర మీది. ఇప్పుడు మందా సాల్మన్ హత్య దీనికి కొనసాగింపే. ఇలాంటి చర్యలకు కొందరు పోలీసులు అండగా నిలుస్తున్నారు. వీల్లు రేపు ఎక్కడికీ వెళ్లరు, ఇక్కడే ఉంటారు కాబట్టి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటాం. మీరు పెంచి పోషిస్తున్న భావజాలం రేపు మిమ్మల్నే కబళిస్తుంది. చంద్రబాబు ఓవైపు దళితుల్ని చంపేసి మరోవైపు కనుమ ముగ్గులేస్తున్నారంటే ఆయన భావజాలం అర్దం చేసుకోవచ్చు. ఎస్సీలంటే కేవలం ఓట్లు వేసే మిషన్లుగా మాత్రమే చంద్రబాబు చూస్తున్నారు. గతంలో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పిన చరిత్ర చంద్రబాబుది. మందా సాల్మన్ హత్యకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ప్రతీ జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేపడుతున్నాం. దళిత సమాజాన్ని ప్రేమించే వారు, దళిత సంఘాలు ఇందులో పాల్గొనాలని కోరుతున్నాం.