గెలుపే లక్ష్యంగా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయండి

17 May, 2025 15:41 IST

తాడేప‌ల్లి:  పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపే ల‌క్ష్యంగా  పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్య‌క్షులు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు ప‌ని చేయాల‌ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి పార్టీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిశీల‌కుల‌తో ఆయ‌న జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. 

`పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ మోహ‌న్ రెడ్డి ఇప్పటికే మీతో నేరుగా సమావేశం అయ్యారు. పార్లమెంటు పరిశీలకులుగా మీ బాధ్యతలేంటో విపులంగా చెప్పారు. పార్లమెంటు పరిశీలకులు అందరూ తక్షణమే మీ ప్రాంతాల్లో క్షేత్ర స్ధాయిలో కార్యకలాపాలు మొదలుపెట్టాలి. ఆయా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కీలకంగా వ్యవహరించాలి.  మీరు ఆ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి నిష్పాక్షిపాతంగా పనిచేస్తారన్న నమ్మకంతో మీకు ఈ బాధ్యతలు అప్పగించిన నేపధ్యంలో ఆ దిశగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు జిల్లా అధ్యక్షులతో ఎలాంటి అపోహలకు తావు లేకుండా పనిచేయాలి.

ప్రాంతీయ సమన్వయకర్తలు విస్తృతమైన ఏరియా బాధ్యతలు చూడాల్సి ఉంది. కాబట్టి వాళ్లు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం కష్టతరమవుతుంది. పార్లమెంటు పరిశీలకులుగా మీరు ఆ బాధ్యతలను చేపట్టాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గం అంతా పూర్తిగా పర్యటించి... అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను బలోపేతం చేయాల్సి ఉంది. 
నెలలో గరిష్టంగా మీ పార్లమెంటు నియోజకవర్గంలో అందుబాటులో ఉండి పనిచేయాలి. మీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా మీరు పనిచేయాలి. అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించాలి.
ఈ క్రమంలో మీరు ఏమైనా సందేహాలుంటే... నేరుగా పార్టీ సెంట్రల్ ఆఫీసుతో ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఎక్కడైనా పార్టీపరమైన ఇబ్బందులుంటే రీజనల్ కోఆర్డినేటర్ తో చర్చించాలి. ఇంకా పరిష్కారం రాకపోతే నా దృష్టికి తీసుకురావచ్చు. అవసరమైతే నేరుగా పార్టీ అధ్యక్షుడి దృష్టికి కూడా తీసుకొచ్చే సౌలభ్యం మీకు ఉంటుంది.  
మీ మీద పార్టీ గట్టి నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించింది. ఆ మేరకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. మే నెలాఖరు నాటికి మండల పార్టీ కమిటీలు, జూలై నెలాఖరు నాటికి గ్రామ కమిటీలు, అక్టోబరు నెలాఖరు నాటికి బూత్ కమిటీలు పూర్తి చేయాలి. అప్పటికి దాదాపు 18 లక్షల మంది వస్తారు. వారందరికీ డిసెంబరు నాటికి ఐడీ కార్డులు అందించే లక్ష్యంతో పనిచేయాలి. వచ్చే ఏడాది ప్లీనరీ నిర్వహించాలనుకుంటున్న నేపధ్యంలో... ఈ కమిటీల నియామకాలను మనం నిర్దేశించుకున్న గడువులోపల పూర్తి చేసే దిశగా అందరూ పనిచేయాలి` అంటూ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు  సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.