రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
గుంటూరు: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వర రావును పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య పాలన బదులు రాష్ట్రంలో పోలీస్ రాజ్యం సాగుతోందన్నారు. తమ సమక్షంలోనే వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తే... వాటిని బుట్టదాఖలు చేసి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్న దుస్థిది ఈ రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, పొగాకు, మిర్చి, మామిడి ఏ రైతుకూ గిట్టుబాటుధర లేక ఆందోళనలో ఉన్న అన్నదాతలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తే... అప్పుడు హడావుడిగా ఢిల్లీకి లేఖలు రాస్తున్న ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను మీరు తీరిస్తే... వారిని వైయస్ఆర్‌సీపీ, వైయస్ జగన్ పరామర్శించే అవసరం రాదు కదా ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది.
పదిరోజుల క్రితం టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావు దేవుడి దయతో కోలుకుంటారని ఆశిస్తున్నాను. నాగమల్లేశ్వరరావుది సంస్కారవంతమైన, రాజకీయ చైతన్యం కలిగిన విద్యావంతుల కుటుంబం. వాళ్ల మీద దాడి జరగడం రెండోసారి. ఈ కుటుంబం అట్టడుగు వర్గం నుంచి వచ్చినా ప్రజల పక్షాన నిలబడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఆయనపై దుర్మార్గంగా జరిగిన దాడిపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ కూడా తీవ్ర ఆందోళనకు గురైంది. దేవుడి దయతో ఆయన మృత్యుంజయుడై కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఆయనపై జరిగిన దాడి రాజకీయ పరంగా జరిగిన హత్యాయత్నం. ఆయనపై దాడి జరిగినప్పటి వీడియో చూస్తే ఎవరికైనా స్పష్టంగా అర్ధం అవుతుంది. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే అది తీసుకోకుండా... అధికార పార్టీ వాళ్లు ఇచ్చిన ప్యాబ్రికెటెడ్ కంప్లైంట్ తో వైయస్ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి అంబటి మురళీపై కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసుల్లో స్పష్టంగా వీడియో సాక్ష్యం ఉన్న నేపథ్యంలో నెల, రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలి. నిందితులకు శిక్ష పడాలి. అది వదిలేసి... నిందితులను ఎలా తప్పించాలని చూస్తున్నారు. కుట్రకు రెచ్చగొట్టిన ఎమ్మెల్యే నరేంద్ర వైపు చూడకుండా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థిది. పోలీస్ రాజ్యంగా ఏ విధంగా మారిందో చూడ్డానికి ఇలాంటి ఉదంతాలే నిదర్శనం.
ప్రేక్షక పాత్రలో పోలీసులు...
పెదకూరపాడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ సాంబిరెడ్డిని ఏడాది క్రితం కాళ్లు, చేతులు నరికితే ఇంత వరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. వైయస్ఆర్‌సీపీపై దాడులు చేయమని ఓపెన్ గా చెప్పడమే కాకుండా... దాడి జరిగిన తర్వాత ఫిర్యాదు చేస్తే కేసులు కూడా పెట్టడం లేదు.
చర్యలు అసలే ఉండడం లేదు. గుంటూరులో లక్ష్మీనారాయణను సాక్షాత్తూ డిఎస్పీ ఈ కులంలో ఎట్టా పుట్టావు అని వేధించడంతో అవి భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆయన కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందుకు కారణమైన డిఎస్పీ హనుమంతరావు మీద కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెనాలిలో బహిరంగంగా రోడ్డు మీద యువకులను చితకబాదిన వ్యవహారంలో కూడా ఎలాంటి చర్యలు లేవు. తాజాగా నెల్లూరులో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై 200 మంది దాడి చేసినా.. వీడియో సాక్ష్యాలున్నా పోలీసులు కనీసం ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేయలేదు. నిన్న కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ , బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై గుడివాడలో పోలీసులు సమక్షంలో కారుపై దాడి చేస్తే.. ప్రేక్షకుల్లా పోలీసులు చూశారు.
బాధితుల పైనే తిరిగి కేసులా...
అధికార టీడీపీ పార్టీ వాళ్లు దాడులు చేయాలనుకుంటే అడ్డుకోకపోగా పోలీసులు వారికి పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. అదే వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు తమకున్న రాజ్యాంగ పరమైన హక్కులను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోగా... మీరు వస్తే గొడవులు జరుగుతాయని నియోజకవర్గం లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. తాడిపత్రిలో కోర్టు ఆదేశాలు ఉన్నా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గం లోకి అనుమతించడం లేదు. స్థానిక సీఐ రివాల్వర్ చూపి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నాడు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ అయితే నా టార్గెట్ పెద్దారెడ్డి అని బహిరంగంగా ప్రకటిస్తున్నా పోలీసులు నుంచి ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్రమంతా పోలీస్ రాజ్యంగా మారిపోయింది. వైయస్ఆర్‌సీపీ నేతలు, వైయస్ జగన్ బయటకు వస్తే రానీయకుండా అడ్డుకోవడమే పోలీసుల పనిగా మారింది. తప్పుడు కేసులు ఎలా పెట్టాలని చూస్తున్నారు. అత్యుత్సాహంతో పనిచేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల తరపున బయటకు వస్తున్నారే తప్ప కారణం లేకుండా ఎప్పుడూ జనంలోకి రాలేదు. ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయలేదు. మిర్చి రైతుల కోసం గుంటూరు మిర్చియార్డుకు, పొగాకు రైతుల కోసం పొదిలి వచ్చారు. వైయస్ఆర్‌సీపీయువనాయకుడు చనిపోతే వాళ్ల కుటుంబాన్ని పరామర్శించడానికి సత్తెనపల్లి వెళ్లారు. కానీ ప్రతిసారి వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు. పొదిలిలో మరీ అన్యాయంగా వేలాది మంది వైయస్ఆర్‌సీపీకార్యకర్తలు వస్తుంటే... ముప్పై మంది టీడీపీ గుండాలుకు పోలీసులు రక్షణనిచ్చి వారితో నిరసన కార్యక్రమంలా చేయిస్తారు. వాళ్లు మాపై రాళ్లేస్తే.. ఇవాళ దాదాపు 50 మంది వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు.
చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసులు..
తిరుపతిలో మామిడి రైతులు పరిస్థితి దయనీయంగా ఉందని ఎల్లో మీడియాలో కూడా కధనాలు వచ్చాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించడానికి వైయస్ జగన్ అక్కడికి వెళ్తే... ఐదు ఆరు రోజుల నుంచి ఒక డీఐజీ, ముగ్గురు ఎస్పీలు వేయి నుంచి రెండు వేల మంది పోలీసులు అక్కడ కూర్చుని యుద్ధంలా కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. యార్డు మూసివేశారు. బస్సులు తిరగకుండా డిపోలు క్లోజ్ చేశారు. ఆటోలు తిరగకుండా నిలిపివేశారు. ఎంత ఒత్తిడి చేసినా వేల మంది రైతులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్డంగా వచ్చిన ఎల్లో మీడియా ఫోటో గ్రాఫర్ పెట్టిన తప్పుడు కేసు మీద మరలా అరెస్టులు చేశారు. రామగిరి పర్యటనకు అన్ని అనుమతులు తీసుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెళితే .. అక్కడ హెలికాప్టర్ కి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆ పనిచేయలేక విఫలమైతే తిరిగి వందల మంది వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు మీద కేసులు నమోదు చేశారు. ఇద్దరి ముగ్గురి పేర్లు పెట్టి ఆపై ఇతరులు అని రాసి వందలాది మందిని అరెస్టు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యం నడుస్తోంది.
ప్రతిపక్ష హక్కులనూ కాలరాస్తూ...
ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను కాపాడుతూ.. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన భద్రత ఇస్తూ... ప్రజల సమస్యలపై మాట్లాడడానికి కావాల్సిన వెసులుబాటును ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార యంత్రాంగం వైపు తిరిగిపోయింది. ప్రతిపక్షం ఎక్కడా గొంతెత్తకుండా అరెస్టుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజలకు చెప్పుకోవడం మినహా మాకు మరో మార్గం లేదు. గుడివాడలో మా కార్యక్రమం పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం పని. మా పార్టీ జడ్పీ చైర్ పర్సన్ మీద దాడి చేస్తుంటే ప్రేక్షకుల్లా చూస్తున్నారు. వాళ్లను ఆపాల్సింది పోయి మా పార్టీ నేతలను ఆపుతున్నారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి.
ప్రతి కార్యకర్తకూ అండగా వైయస్ జగన్...
ఎన్ని వేధింపులకు గురి చేసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారు. చంద్రబాబు నాయుడు అక్రమ పద్దతుల్లో దుర్మార్గంగా అణిచివేచే ప్రయత్నం చేసినా, మానసికంగా కృంగదీయాలని చూసినా పార్టీ మరింత రాటు దేలుతుంది. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. చంద్రబాబు ఈ తరహా పాలన ఎంతో కాలం సాగదు. చంద్రబాబు పర్యటనకు జనాలు రావడం లేదని వైయస్ జగన్ మోహన్ రెడ్డిపర్యటనకు రావద్దంటే ఎలా. ప్రజల సమస్యలను చంద్రబాబు పరిష్కారం చేస్తే వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాళ్ల దగ్గరకి వెళ్లి పరామర్శించాల్సిన అవసరమే రాదు కదా. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచన చేయలేదు. వ్యవస్థలను మేనేజ్ చేయడమే చంద్రబాబుకి తెలిసిన విద్య.
ఎన్ని కేసులు, అరెస్టులైనా ప్రజా పోరాటం ఆగదు...
మిర్చి, పొగాకు, మామిడి, ధాన్యం ఇలా రైతులకు సంబంధించి ఆ రైతులకు వైయస్ జగన్ వెళ్లిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. అప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తుంది. రైతుల సమస్య పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అధికారాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా చేయడానికే వినియోగిస్తున్నాడు. ఈ ఆలోచనలతో చంద్రబాబు చరిత్ర హీనుడుగా మారుతున్నాడు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ప్రజాకోర్టుతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై దాడి చేసిన వాళ్ల విజువల్స్ ఉన్నా కేసు నమోదు చేయలేదు. టీడీపీ నేతలు మరింత బరితెగించి దాడికి పాల్పడినవాళ్లు సన్మానం చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఒక వర్గం పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. రైతులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటున్న జిల్లా ఎస్పీ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా మా పోరాటం అగదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలతో వైయస్ఆర్‌సీపీని, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ మాత్రమే అని స్పష్టం చేశారు.