చంద్రబాబు స్కిల్ కేసు మూసివేత రాజ్యాంగ విరుద్ధం
అనంతపురం: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు అధికారం అండతో సొంత కేసుల మూసివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్‌నెట్ కేసు, లిక్కర్ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, ఇప్పుడు అత్యంత హేయంగా స్కిల్ కేసు కూడా క్లోజ్ చేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు. డొల్ల కంపెనీలకు రూ.371 కోట్ల ప్రభుత్వ నిధులు మళ్లించి, అక్కణ్నుంచి వాటిని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు, అన్ని ఆధారాలతో సహా దొరికి, జ్యుడీషియల్ రిమాండ్‌లో జైలుకి కూడా వెళ్లారని చెప్పారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబు దోషిత్వంపై అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపిన సీఐడీ.. ఇప్పుడు ఆ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్) తుది నివేదిక ఇవ్వడం, వెంటనే ఆ నివేదికను ఆమోదించి ఏసీబీ కోర్టు కేసు మూసివేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని శైలజానాథ్ అన్నారు. ఇది చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని స్పష్టం చేశారు. నాడు తీవ్ర అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందిన చంద్రబాబు, తిరిగి అధికారంలోకి రాగానే, తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్నారని గుర్తు చేశారు.
స్కిల్ స్కామ్ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పిన సీఐడీ.. మరి అప్పుడు సేకరించిన ఆధారాలు, నాటి ఈడీ ఛార్జిషీట్ అన్నీ అబద్ధాలేనా? అని అనంతపురంలోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన శైలజానాథ్ ప్రశ్నించారు.
ప్రెస్ మీట్‌లో సాకే శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
చంద్రబాబు కేసుల మాఫీ రాజ్యాంగ విరుద్ధం:
సీఎం చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్ని నేరాలు, దందాలు చేసినా తమ కార్యకర్తల్ని కాపాడుకుంటున్నారు. అనంతపురంలో వారానికో భూకుంభకోణం బయటపడుతోంది. ఎవరో ఒక ప్రజాప్రతినిధి బెదిరించారని చెప్తుంటారు. అధికారులు మాత్రం మౌనంగా ఉండిపోతుంటారు.
ఇదే క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు తన సొంత కేసుల్ని ఎత్తేసుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. తనకు తానే కితాబిచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్‌నెట్ కేసు, లిక్కర్ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, తాజాగా స్కిల్ కేసు కూడా క్లోజ్ చేయించుకున్నారు. నిజానికి స్కిల్ కేసులో సీమెన్స్ కంపెనీ తమకు ఏ మాత్రం సంబంధం లేదని కూడా చెప్పింది. దీంతో చంద్రబాబు దోషిత్వం పూర్తి ఆధారాలతో సహా బయటపడింది, అయినా అలా వరసగా కేసులు మూసివేయించుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్‌తో పాటు, హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కేసుల ఎత్తివేతపై న్యాయపోరాటం కొనసాగిస్తాం:
చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న సీఐడీ విభాగమే గతంలో అన్ని ఆధారాలు సేకరించి కేసు పెడితే.. ఈడీ కూడా కేసు పెడితే.. ఇవన్నీ కేసుల మాఫీకి అడ్డు రాలేదంటే ఈ వ్యవస్థల్ని ఎలా ధ్వంసం చేస్తున్నారో అర్దమవుతోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి, సాక్ష్యాలు మార్పించి నేరాల్ని మాఫీ చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు ఓ చెడ్డ ఒరవడిని సృష్టిస్తున్నారు. మీ పార్టీ ఆఫీసు ఖాతాల్లో రూ.77 కోట్లు రాలేదా?. మీరు అంత కడిగిన ముత్యమైతే కోర్టుల్లో పోరాడి ఎందుకు గెలవలేకపోయారు? చివరికి ఈడీ కూడా బోగస్ ఇన్‌వాయిస్‌లు ఇచ్చారని కేసు పెట్టింది కదా? మరి ఆ రిపోర్ట్ కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారా?.
ఈ ధోరణి అస్సలు మంచిది కాదు. ఎవరూ ఎవర్నీ కాపాడలేరు. నిజానికి, సత్యానికి దూరంగా ఓ మనిషి కోసం అధికారులు సాగిస్తున్న హననం ఎంతో కాలం సాగదు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది. చంద్రబాబు కేసుల మాఫీపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుంది.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలి:
ఓ ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనుచరులు, గన్‌మెన్ చివరకు అతడిపై దాడి కూడా చేశారు. గత ఏడాదికి సంబంధించి రూ.10 లక్షలు, ఈ ఏడాదికి సంబంధించి మరో రూ.10 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్‌ను, అతడి కుమారుణ్ని లేపేస్తామని హెచ్చరించారు. తనపై దాడికి సంబంధించి, ఎమ్మెల్యే అనుచరుడైన కోనంకి గంగారామ్‌కు ఫకృద్దీన్ చేస్తే, ఆయనా అంత కంటే ఎక్కువగా బెదిరించారు. లక్షల కప్పం కట్టాల్సిందే అని హుకుం జారీ చేశారు.
సాక్షాత్తూ ఎమ్మెల్యే ప్రమేయం లేకండా, ఆయనకు తెలియకుండా, తన అనుచరులు, చివరకు గన్‌మెన్ కూడా అలా వ్యవహరించే అవకాశం ఉండదు. అందుకే ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై దాడి, బెదిరింపు.. అన్నీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగాయన్నది సుస్పష్టం. బాధితుడు స్వయంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటే.. పోలీసులు వారు నిద్ర పోతున్నారా? లేక నిద్ర నటిస్తున్నారా?
ఈ స్థాయిలో ఒక ఎమ్మెల్యే, అతడి అనుచరులు అరాచకాలు చేస్తుంటే, పోలీసులు చూసీ చూడనట్లు ఉండడం క్షమార్హం కాదు. సొంత పార్టీకి చెందినా ఫకృద్దీన్‌ను ఎమ్మెల్యే, అతడి అనుచరులు వేధించడం చూస్తుంటే, ఇంత జరుగుతున్నా పోలీసులు అలక్ష్యం చూపుతున్నారంటే.. అసలు రాష్ట్రంలో ఒక చట్టం, రాజ్యాంగం, వ్యవస్థ ఉన్నదా? అన్న సందేహం కలుగుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించాలి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలి. జరిగిన దానికి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.