దావోస్ ఖ‌ర్చుల్లో చంద్ర‌బాబు రికార్డు

24 Jan, 2026 17:16 IST

అనంత‌పురం: పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ పేరుతో 15 సార్లు దావోస్ ప‌ర్య‌ట‌న‌లకు వెళ్లిన చంద్ర‌బాబు.. తెచ్చిన‌ పెట్టుబ‌డులు క‌న్నా ఎక్కువ ఖ‌ర్చులు పెట్టిన ముఖ్య‌మంత్రిగా రికార్డులకు ఎక్కుతాడ‌ని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ విమ‌ర్శించారు. శ‌నివారం అనంత‌పురం లోని వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దావోస్ ప‌ర్య‌ట‌న‌ల ద్వారా చేసుకున్న ఒప్పందాలు, అందులో కార్య‌రూపం దాల్చిన కంపెనీల వివ‌రాలు, త‌ద్వారా క‌ల్పించిన ఉద్యోగాల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు. దీంతోపాటు చంద్ర‌బాబు దావోస్ ఖ‌ర్చుల లెక్క‌ల‌ను మీడియా ముందుంచాల‌ని కూడా ప్ర‌భుత్వాన్ని కోరారు. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా చేస్తున్న చంద్ర‌బాబు సాధించ‌లేని పారిశ్రామిక ప్ర‌గ‌తిని ఐదేళ్ల త‌న పాల‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ గారు సాధించి చూపార‌ని కేంద్ర గ‌ణాంకాలే రుజువు చేస్తున్నాయ‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని, నిందితుల‌ను వ‌దిలేసి బాధితుల‌పై కేసులు న‌మోదు చేసి వేధిస్తున్న దుస్థితి నెల‌కొంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర హోంశాఖ హెచ్చ‌రించినా, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ప్ర‌భుత్వం, పోలీసుల తీరులో మార్పు రావ‌డం లేద‌ని మండిప‌డ్డారు. చ‌ట్టాల‌ను ఉల్లంఘించి మాన‌వ హ‌క్కుల‌ను కాల‌రాస్తూ అమాయ‌కుల‌ను వేధిస్తున్న భ‌విష్య‌త్తులో త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ హెచ్చరించారు.  
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.. 

● పెట్టుబ‌డులు శూన్యం.. ఖ‌ర్చులు ఘ‌నం

ఎక్కువ సార్లు దావోస్‌కి వెళ్లి రూపాయి పెట్టుబ‌డి కూడా తీసుకురాకుండా కోట్లల్లో ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేసిన ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబుకి అవార్డ్ ఇవ్వాలి. మంత్రుల‌ను వెంట‌బెట్టుకుని పిక్నిక్ కి వెళ్లినట్టు వెళ్లి వంద‌ల కోట్లు వృథా చేస్తున్నాడు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మ‌రింత అప్పుల్లో ముంచేస్తున్నాడు. తాను ముఖ్య‌మంత్రిగా 15 సార్లు దావోస్ వెళ్లాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు ఎన్ని సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకున్న‌దీ, ఎన్ని పెట్టుబడులు తెచ్చిందీ, అవి కార్య‌రూపం దాల్చ‌డం ద్వారా ఎంత‌మందికి ఉద్యోగాలు వ‌చ్చిందీ.. వంటి వివ‌రాల‌ను ద‌మ్ముంటే చంద్ర‌బాబు వెల్ల‌డించాలి. దావోస్ ఖ‌ర్చుల లెక్క‌ల‌ను మీడియాకు విడుద‌ల చేయాలి. జపాన్ నుంచి హైస్పీడ్ రైళ్ల క‌ర్మాగారం, ఎయిర్ బ‌స్‌లు, అరాంకో, హైబ్రిడ్ క్లౌడ్ వ‌చ్చేస్తున్నాయ‌ని న‌మ్మ‌బ‌లికి ఇక్క‌డే హైద‌రాబాద్‌లో ఉన్న గ్రీన్ కోతో, విశాఖకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌తో మాట్లాడి వ‌చ్చాడు. వాస్త‌వ లెక్క‌లు చూస్తే చంద్ర‌బాబు 15 ఏళ్ల‌లో సాధించ‌లేని పారిశ్రామిక ప్ర‌గ‌తిని వైయ‌స్ జ‌గ‌న్ గారు ముఖ్య‌మంత్రిగా సాధించార‌ని కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వేలు చెబుతున్నాయి. అంద‌మైన విశాఖ న‌గ‌రంలోని విలువైన భూముల‌ను కేకు ముక్కలు మాదిరిగా చేసి బినామీలుగా పంచేస్తున్నాడు. 99 పైస‌ల‌కు ఎలా ఇస్తార‌ని జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్నిస్తే నా ఇష్టం.. నేనిస్తాన‌ని అధికారమ‌దం త‌ల‌కెక్కి లోకేష్ పెడ‌స‌రంగా మాట్లాడుతున్నాడు. వైయ‌స్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చాక ఈ భూదోపిడీ వెనుకున్న బాగోతాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాం. 

● రాజ‌కీయ వేధింపుల్లో కొత్త విధానాలు

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రాజ‌కీయ వేధింపుల్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. ల‌క్కిరెడ్డిప‌ల్లె గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ  నాయ‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ప‌టాసులు కాల్చితే లోకేష్ అనే వ్య‌క్తి కంటి వ‌ద్ద గాయ‌మైంది. దీంతో అత‌డికి వైయ‌స్సార్సీపీ రూ. 3ల‌క్ష‌ల‌ ఆర్థిక‌సాయం కూడా చేసింది. ఎన్నిక‌ల అనంత‌రం ఆ వ్య‌క్తిని తెలుగుదేశం పార్టీలో చేర్పించుకుని ఘ‌ట‌న జ‌రిగిన 14 నెల‌ల త‌ర్వాత అత‌డితో వైయస్సార్సీపీ నాయ‌కుల మీద త‌ప్పుడు కేసులు న‌మోదు చేయించారు. ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో కామెంట్ చేసినా ఈ ప్ర‌భుత్వం ఓర్వ‌లేక‌పోతోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో న‌డుస్తున్న ఈ ప్ర‌భుత్వానికి రాబోయే స‌రైన స‌మాధానం ఖ‌చ్చితంగా చెబుతాం. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో కూట‌మి ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  చెబితే ప‌ట్టించుకోలేదు.. చివ‌రికి ఇదే విష‌యాన్ని కేంద్ర హోంశాఖ నుంచి అమిత్‌షా కూడా లేఖ రాసి హెచ్చరించారు. అయినా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఏమార్పూ రాలేదు. పోలీసులు ఇప్ప‌టికీ తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల మాదిరిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌రికి కోర్టుల ఆదేశాల‌ను కూడా పోలీసులు, ప్ర‌భుత్వం లెక్క చేయడం లేదు. 

● ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే అక్ర‌మ కేసు

అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఒక్క కొత్త పింఛ‌న్ ఇచ్చింది లేక‌పోయినా సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేశాన‌ని ప్ర‌చారం చేసుకోవ‌డం సిగ్గుచేటు. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి వ‌చ్చిన ప్ర‌తిసారీ దాన్ని డైవ‌ర్ట్ చేయ‌డానికి వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద త‌ప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఈ రెండేళ్ల‌లో అక్ర‌మ అరెస్టులు చేయ‌డం త‌ప్ప‌.. ప్రభుత్వం చేసింది శూన్యం. 70 ఏళ్లు పైబ‌డిన వ‌య‌సులో ఉన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివాస‌రావును సైతం అక్ర‌మంగా అరెస్ట్ చేసి వేధించ‌డంతో ఈ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. కూట‌మి నాయకులు ఏది చెబితే అది చెయ్య‌డ‌మే పోలీసుల కార్య‌క్ర‌మంగా మారిపోయింది. నిందితుల‌ను వ‌దిలేసి బాధితుల మీద కేసులు పెట్టి వేధిస్తున్న దౌర్భాగ్య‌క‌ర ప‌రిస్ధితుల‌ను రాష్ట్రంలోకి తీసుకొచ్చారు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక భూదురాక్ర‌మ‌ణ‌, ఆస్తుల విధ్వంసం, అక్ర‌మ నిర్బంధాలు ఎక్కువైపోయాయి. మేం ఏం చేసినా పోలీసులు మాకు ర‌క్ష‌ణగా ఉన్నార‌న్న ధైర్యంతో కూటమి నాయ‌కులు వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. అనంత‌పురం జిల్లాలో చ‌ట్టాల‌ను కాపాడాల్సిన పోలీసులే చ‌ట్ట వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసుల నుంచే మాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకునే ప‌రిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయంటే శాంతిభద్ర‌త‌లు ఎంత‌లా దిగ‌జారాయో అర్థం చేసుకోవ‌చ్చని శైలజానాథ్ స్పష్టంచేశారు.