చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ఉన్న నన్ను రౌడీషీటర్‌గా చిత్రీకరిస్తారా?  

24 Sep, 2026 19:03 IST

తాడేప‌ల్లి: డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై అక్రమంగా రౌడీషీట్‌ నమోదు చేసి, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నందిగామకు చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సాయిబాబా మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పదేళ్లుగా చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తి కొనసాగిస్తున్న తనను రౌడీషీటర్‌గా చిత్రీకరించడం వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు ఉందని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా కేసులు, రౌడీషీట్లతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో సాయిబాబా ఏమ‌న్నారంటే.. 

- డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులా?

“విజయవాడ బందర్‌రోడ్‌లోని శాప్ కార్యాల‌యం వ‌ద్ద ఈ నెల 21న‌ డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన సందర్భంగా టీడీపీ నేతలతో వచ్చిన కొందరు రాళ్ల దాడికి పాల్పడినా వారిపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మరోవైపు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. నాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంతో పాటు మరో 1,719 మందిని కేసులో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎస్సీపై విచారణ జరపాలని అడిగినందుకు కేసులు పెట్టడం ఏమిటి? డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెబుతున్నప్పుడు విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోంది?”  

- పదేళ్లుగా చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ఉన్న నన్ను రౌడీషీటర్‌గా చిత్రీకరిస్తారా?

“నేను నందిగామలో పదేళ్లుగా చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తి కొనసాగిస్తున్నాను. అలాంటి నన్ను రౌడీషీటర్‌గా, నేరచరిత్ర ఉన్న వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఈనాడు ప‌త్రిక‌లో ప్రచారం చేయడం కక్షసాధింపులో భాగమే. టీడీపీలో ఉంటే మంచివారు.. వైయ‌స్ఆర్‌సీపీలోకి వస్తే దొంగలు, కబ్జాకోరులుగా ముద్ర వేస్తారా? రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలవుతోందా? లేక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందా? పోలీసులు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా.. టీడీపీ నాయకుల కోసం పనిచేస్తున్నారా? అక్రమ కేసులకు భయపడేది లేదు. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం.”