ఓటమి భయంతోనే దాడులు
విజయవాడ: ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్‌ఆర్ సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రెండు గంటల పోలింగ్ సమయంలోనే చంద్రబాబు మళ్లీ రీపోలింగ్ అనడం ఓటమి భయానికి నిదర్శనమన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దుష్ప్రచారాలు నమ్మొద్దని, ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటమి భయంతో ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైయస్‌ఆర్ సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, టీడీపీ నేతల దాడులను ఖండిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు పచ్చ చొక్కాలు వేసుకొని ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.