రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.
సిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.
ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.