వైయస్ఆర్‌సీపీ గొంతు నొక్కే కుట్ర జరుగుతోంది
అరకు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ గొంతు నొక్కేందుకు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని అరకు వైయస్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజ రాణి ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడడం జరుగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల స్వరాన్ని అణచివేయడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్న వారిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలను సహించలేని పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
ఇప్పుడు వైయస్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా పేజీ భారత్‌లో కనిపించకుండా చేయడం అత్యంత తీవ్రమైన చర్య అని డాక్టర్ గుమ్మ తనూజ రాణి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా పరిగణించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి పౌరుడికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉందని, ఆ హక్కులను కాలరాసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.