వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు సిగ్గుచేటు
తిరుపతి: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలు, అవకతవకలు, అక్రమాలను వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా నిరంతరం ప్రజల ముందుకు తీసుకువస్తోందని తిరుపతి వైయస్ఆర్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో వైయస్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా పేజీ భారత్‌లో కనిపించకుండా చేయడం అత్యంత దురదృష్టకరమని, సిగ్గుచేటు చర్య అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి భూవ్యవహారాల నుంచి డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాల వరకు అనేక అంశాలపై వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే కూటమి ప్రభుత్వం అసహనానికి గురవుతోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడం బాధ్యత అని అన్నారు. అయితే ఆ స్వరాన్ని అణచివేయడానికి సోషల్ మీడియా వేదికలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా పేజీని భారత్‌లో కనిపించకుండా చేయడం వెనుక రాజకీయ కక్షసాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మద్దిల గురుమూర్తి విమర్శించారు. ప్రజలకు నిజాలు తెలియకుండా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆంక్షలు విధించినా ప్రజా సమస్యలపై వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే వైయస్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా వేదికలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు.