శ్రీకాకుళంలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ విజయవంతం
శ్రీకాకుళం: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతం అయినట్లు వైయస్ఆర్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..`చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మిన ప్రజలు.. కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మోసపోయారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ, ఇదే సమయంలో వైయస్.జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు జరిగిన మేలును ఇంటింటా వివరించాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు రూ.2.85 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించాం. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి నేతలు ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారు. హామీలు అమలు చేయకపోగా.. వైయస్ఆర్‌సీపీ నేత లు, కార్యకర్తలను హతమార్చడం, దాడు లు చేయడం, విధ్వంసాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి బాధ్యతలను గుర్తుచేసినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్‌తో బాబు తప్పించుకుంటున్నారు. తల్లికి వందనం కింద 80 లక్షల మంది లబ్ధిదారులకు నిధులు ఎగ్గొట్టారు, 5 లక్షల మంది రేషన్‌కార్డులు తొలగించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు, ఉచిత బస్సు రాలేదు. నిరుద్యోగ భృతి లాంటి పథకాల ఊసే లేదు. వీటన్నింటినీ ఇంటింటికీ నయవంచన పేరిట వివరించాం` అని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.