బాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే
అనంతపురం: చంద్రబాబు సీఎంగా ఉండగా.. రాయలసీమకు ప్రతిసారీ అన్యాయమే జరిగిందని మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తన సన్నిహితుడు తెలంగాణ సీఎం రేవంత్ తో చీకటి ఒప్పందంలో భాగంగా 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు నిలిపివేసారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ప్రకటనతో చంద్రబాబు కుట్ర బయటపడగా.. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో బాబు డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే 190 రోజుల్లో 40 టీఎంసీలు లిఫ్ట్ చేశామంటూ హంద్రీ నీవా పై సీఎం సహా మంత్రులంతా దుష్ప్రచారం చేయడాన్ని ఆక్షేపించారు. కాలువ వెడల్పు పేరుతో దోపిడీ చేసిన రూ. 3 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయని నిలదీశారు. ఇది ముమ్మాటికీ రాయలసీమ ప్రజలను మోసం చేయడమేనని.. చరిత్ర హీనుడుగా మిగలొద్దని చంద్రబాబును హెచ్చరించారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఘనత దివంగత సీఎం వైయస్ఆర్ దేనని.. 4 దఫాలు సీఎంగా ఉన్నా చంద్రబాబుకి సీమ ప్రయోజనాలు పట్టలేదని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
● చంద్రబాబు హయాంలో సీమకు ద్రోహం.
తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారీ ప్రచార ఆర్భాటమే తప్ప... ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబుకు ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అబద్దాలు వల్లె వేయడంతో చంద్రబాబుకు దేశంలో ఎవరూ సాటిరారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. తాను రాయలసీమ వాసినని చెప్పుకుంటూ.... అభివృద్దితో పాటు సాగు, తాగు నీటి విషయంలోనూ పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నాడు. గతంలో మాజీ సీఎం ఎన్టీఆర్ హయాంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కేవలం పునాది రాళ్లకు మాత్రమే పరిమితం అయింది. ఆ తర్వాత వచ్చిన చెన్నారెడ్డి సహా ముఖ్యమంత్రులందరూ రాయలసీమకు న్యాయం చేయలేదు. అనంతరం 1996లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు 40 టీఎంసీల సామర్ధ్యంతో నాలుగు జిల్లాలకు సాగు, తాగు నీరు అందేలా హంద్రీనీవా ప్రాజెక్టు తీసుకొస్తామని హామీ ఇచ్చినా.... 1999 ఎన్నికల వరకూ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు. 1999 ఎన్నికల్లో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ 40 టీఎంసీలు కాకుండా కేవలం 5 టీఎంసీలతో కేవలం తాగునీటి పధకం కింద తీసుకొస్తామని చెప్పాడు. ఆ తర్వాత సాగునీటి గురించి ఆలోచన చేస్తామని గతంలో సింగనమల నియోజకవర్గంలో ఉన్న ఆత్మకూరులో పునాది రాయి వేశాడు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు హయాంలో 2004 వరకు ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా మందుకు కదల్లేదు.
● హంద్రీ నీవా ఘనత దివంగత వైయస్ఆర్ దే..
2004లో దివంగత నాయకుడు వైయస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో ఉరవకొండ పోలీస్ స్టేషన్ పక్కనే హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 40 టీఎంసీలతో నిర్మిస్తామని జీవో ఇచ్చి, పనులు ప్రారంభించారు. చాలా ముందు చూపుతో కేవలం 848 అడుగుల వద్ద మాత్రమే మాల్యాల దగ్గర లిఫ్ట్ చేసే అవకాశం ఉండడంతో అక్కడ నుంచి 800 అడుగులు వరకూ కూడా హంద్రీనీవాకు నీళ్లందించాలన్న సదుద్దేశ్యంతో ముచ్చుమర్రి వద్ద కూడా లిఫ్ట్ చేయాడనికి జీవో ఇచ్చారు.
తిరిగి 2014లో అధికారంలో వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత వైయస్.హయాంలో చేపట్టిన పనులు ఎక్కడికక్కడే ఎదుగూ బొదుగూ లేకుండా నిల్చిపోయాయి. తిరిగి 2019లో వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రిని స్పూర్తిగా తీసుకుని రాయలసీమ కరువును పారద్రోలాలని సంకల్పించారు. అందులో భాగంగా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో పుంగనూరు, కుప్పం వరకు 500 కిలోమీటర్లు వరకు నీళ్లు పోవాలంటే .. గాలేరు నగరి ప్రాజెక్టుకు హంద్రీనీవాను అనుసంధానం చేసి జీవో ఇచ్చారు. తద్వారా కడప, చిత్తూరుకు నీళ్లు వచ్చే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. వాస్తవానికి వైయస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 3850 క్యూసెక్కుల సామర్ధ్యంతో తలపెట్టిన హంద్రీనీవా ప్రాజెక్టును.. ఏకంగా 11, 12వేల క్యూసెక్కుల సామర్ధ్యం వరకు పెంచారు. శ్రీశైలం ప్రాజక్టుకు వరద కేవలం 40 రోజుల మాత్రమే ఉంటుంది కాబట్టి.. ఆ 40 రోజుల్లో 40 టీఎంసీలు ఎత్తిపోసి రాయలసీమ జిల్లాలకు అందించాలని సంకల్పించారు. అదే విషయాన్ని వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటి వెలుగు పథకంలో భాగంగా అనంతపురం వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే ఆయన రూ.6,480 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు కు టెండర్లు పిలిచారు. కరోనాతో పనులు ఆలస్యం అయ్యాయి. ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
● 190 రోజుల్లో 40 టీఎంసీలంటూ పచ్చి అబద్దాలు...
మరలా 2024లో సీఎం అయిన చంద్రబాబు రాయలసీమ మీద ద్వేషంతో తన సన్నిహితుడు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసేలా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును రద్దు చేసారు. ఇది రాజకీయంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం లేదు... బహిరంగంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. దీంతో రాయలసీమ ప్రాంత ప్రజల వ్యతిరేకతను చూసి... దాన్నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. మసిపూసి మారేడుకాయ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. హంద్రీనీవాకు 2012 నుంచి దాదాపు 14 ఏళ్లుగా నీళ్లు వస్తున్నాయి. చరిత్రలో 190 రోజుల్లో 40 టీఎంసీలు డైవర్ట్ చేయలేరు.. కానీ హాంద్రీనీవా ద్వారా ఈ నీళ్లు అందిస్తామని ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, ఆర్దిక శాఖ మంత్రి కేశవ్ ప్రజలను మభ్యపెట్టే ప్రచారం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, కూటమి నేతలతో పాటు మంత్రులను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు రాయలసీమ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉందా? మీ అబద్దాలకు, ద్రోహానికి హద్దు లేకుండా పోతుంది. మీరు నొట్టికొచ్చింది చెబితే దాన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని ఈ ద్రోహులకు స్పష్టం చేస్తున్నాను. మీరు రాయలసీమలో చరిత్ర హీనులుగా మారడం ఖాయం. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు మేమే మేలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి వైయస్ఆర్ హయాంలోనే హంద్రీనీవా చేపట్టారు. 2012 నాటికే ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెచ్చారు. గతంలో 83-84లో ఎన్టీఆర్ హయాంలో కాని, 1996 ప్రాంతంలో చంద్రబాబు పునాదిరాయి వేసినప్పుడు.. 2004లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే... రాయలసీమకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా ఈ ప్రాంతానికి 40 టీఎంసీల నికర జలాలు వచ్చే అవకాశం ఉండేది. మీ నిర్లక్ష్యం వల్లే రాయలసీమకు హంద్రీనీవా ద్వారా మిగులు జలాలు పోయి కేవలం వరద జలాలు మీద ఆధారపడే దుస్థితి వచ్చింది. అది చంద్రబాబు రాయలసీమకు చేసిన ద్రోహం.
● హంద్రీ నీవా లిఫ్ట్ వాస్తవాలివే...
2012-13లో 1.11 టీఎంసీలు వస్తే... రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2016-17లో 38.5 టీఎంసీలు నీళ్లు వచ్చాయి. 2017-18లో 34 టీఎంసీలు, 2018-19లో 39.36 టీఎంసీలు నీళ్లు వచ్చాయి. ఇక్కడ నుంచి 12 పంపులు పనిచేస్తున్నాయి. వైయస్.జగన్ సీఎం అయిన తర్వాత 2019-20లో 47.34 టీఎంసీలు మాల్యాల, ముచ్చుమర్రికి లిఫ్ట్ ద్వారా నీళ్లు వచ్చాయి. 2020-21లో 45.65 టీఎంసీలు నీళ్లు వచ్చాయి. కానీ ఇవన్నీ 240 రోజులు పట్టాయి. కారణం 12 పంపుల లిఫ్ట్ సామర్ధ్యమున్న హంద్రీనీవాకు సాంకేతిక డిజైన్ లోపం వల్ల... 3850 క్యూసెక్కులు రావాల్సిన కాలువ సామర్ధ్యం 2100 క్యూసెక్కులకు మాత్రమే వచ్చింది కాబట్టి.. 250 రోజుల వరకు పట్టింది. కానీ ఇవాళ 40 టీఎంసీలు 190 రోజుల్లో తెచ్చామని చెబుతున్నారు. కూటమి నేతలు, రాయలసీమకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు రాయలసీమ ప్రజాప్రతినిధులు అడిగినట్లుగా 11వేల క్యూసెక్కులు కాకుండా, వైయస్.జగన్ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం 6300 క్యూసెక్కులు కూడా కాకుండా, హంద్రీనీవాను కేవలం 3850 క్యూసెక్కులకు పరిమితం చేస్తూ.. తొలిదశ వెడల్పు చేయడానికి రూ.695.70 కోట్లు, రెండో ధశలో జీడిపల్ల నుంచి కుప్పం వరకూ రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ 1200 క్యూసెక్కులు సామర్ధ్యమున్న కాలువపనులు లైనింగ్ కు నిర్ణయించారు. మొత్తం 100 రోజుల్లోనే రూ.3వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 6 నెలల్లో 40 టీఎంసీలు తీసుకొచ్చామని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేవలం 3850 క్యూసెక్కుల సామర్ధ్యంతో నీటిని పంప్ చేస్తే... 190 రోజుల్లో 63 టీఎంసీలకు పైగా నీటిని డ్రా చేసి ఉండాలి. కానీ 191 రోజుల్లో మీరు కేవలం 40టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారంటే.. రోజుకి 2440 క్యూసెక్కులు తప్ప 3850 క్యూసెక్కులు లిఫ్ట్ చేయలేదని మీ మాటలను బట్టే తెలుస్తుంది. మీరు ఎవరికి ద్రోహం చేస్తున్నారు, మీకు ఓట్లేసి గెలిపించిన రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తారా? 1996లో పయ్యావుల కేశవ్ ఆర్బాటంగా లక్షల మంది ముందు హంద్రీనీవా 40 టీఎంసీలతో చేస్తామని పునాది వేశారు. 1996 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న మీరు ఈ ప్రాజెక్టుకు ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేదు. తిరిగి ఇప్పుడు కూడా వైయస్.జగన్ ఇచ్చిన జీవో ప్రకారం 6300 క్యూసెక్కులు కూడా లిఫ్ట్ చేయకుండా.. అదే కాంట్రాక్టరుకు 3800 క్యూసెక్కులకు నిర్ణయించడం ప్రజా ద్రోహం కాదా? మూడు, నాలుగు దఫాలు ఈ జిల్లా ప్రజలు మిమ్నల్ని ఎన్నుకుంటే ఆ ప్రజలకు ద్రోహం చేస్తారా? పైగా రాయలసీమకు మేలు చేసిన వైయస్.జగన్ ను తిరిగి వ్యక్తిగతంగా విమర్శిస్తారా? 19నెలల పాలనలో ఈ ప్రాంతానికి మీరు ఏం చేశారు?
● చంద్రబాబూ చరిత్ర హీనుడుగా మిగలొద్దు...
శ్రీశైలం ప్రాజెక్టులో ఇవాల్టికి కూడా 875 అడుగులు నీళ్లు అంటే 167.4 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా... 10 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి మార్చి వరకు ఎందుకు గడువు పెడుతున్నారు చంద్రబాబూ? మూడు దఫాలు శ్రీశైలానికి వరద వల్లే ఇంత నీరు నిల్వ ఉంది. ఇవాల మార్చి వరకు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది .. 40 టీఎంసీలకే పరిమితం కాకుండా మరో 20-30 టీఎంసీలు 3850 క్యూసెక్కుల చొప్పున లిఫ్ట్ చేసే అవకాశానికి కూటమి నేతలు గండికొడుతున్నారు. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు. తెలంగాణా ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు 798 అడుగులు వస్తే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 800 అడుగులుకి వస్తే పంటకాల్వలకు నీళ్లిస్తారు. అంటే రాబోయే నెలలోపు ప్రాజెక్టు ఖాళీ అవుతుంది. వాళ్లు 8 కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ ఇచ్చారు. అందుకే రాయలసీమకు ద్రోహం చేయవచ్చు అని చంద్రబాబుకు సూచిస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు హంద్రీనీవా లిఫ్ట్ సామర్ధ్యాన్ని 11వేల క్యూసెక్కులకు పెంచాలని కోరుతున్నాం. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఈ ప్రాజెక్టు చేపట్టకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడు కావడం ఖాయం.
● రూ.3 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయింది?
రాయలసీమలో కృష్ణా జలాలు పారించి, పంటపొలాలకు నీళ్లివ్వడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందించడమే హంద్రీనీవా ప్రాజెక్టు లక్ష్యం. భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు 6.03 లక్షల ఎకరాలకు సాగునీళ్లందించడమే ప్రాజెక్టు లక్ష్యం. 80వేల నుంచి 1 లక్ష కర్నూలు జిల్లాలోనూ, 1.15 లక్షల ఎకరాలు తొలిదశ, రెండో దశలో జీడిపల్లి నుంచి మరో 2.70 లక్షల ఎకరాలు అనంతపురంలోనూ, మరో 1 లక్ష ఎకరాలు కడప, చిత్తూరు జిల్లాలో సాగునీరిచ్చి భూగర్భజలాలు పెంచడమే ప్రాజెక్టు లక్ష్యం. కానీ ఇంతవరకు అదేమీ జరగలేదు. 2014లో కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు చేసిందేమీ లేదు. 3850 క్యూసెక్కులు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో... రాయలసీమ వాసిగా చంద్రబాబు సమాధానం చెప్పాలి. కాలువ వెడల్పు చేశామని అందుకోసం 100 రోజుల్లో రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. పనులు ఎక్కడ జరిగాయి? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయింది? ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? ఒకవైపు ఈ పనులు చేయకుండా.. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ పథకానికి సమాధి చేయడం ద్వారా ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. ఇవాల్టికి కూడా హంద్రీనీవాలో 2443 క్యూసెక్కులు నీరు లిఫ్ట్ చేస్తున్నారంటే.... 8 పంపులు మాత్రమే లిఫ్ట్ చేస్తున్నాయి. అంటే మీకు ఓట్లేసిన ప్రజలను కూడా మోసం చేస్తున్నారా చంద్రబాబూ?
విశాఖలో పరిశ్రమలు పేరుతో భూములు కేవలం రూ.1కే అమ్ముకుంటూ.. మరోవైపు లక్షల కోట్లు అప్పు చేసి రాజధానిలో ఖర్చుపెడుతూ.. రాయలసీమకు ద్రోహం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే... మాపై వ్యక్తిగతంగా దాడి చేయడం అలవాటుగా మారింది. రాష్ట్రంలో ఎవ్వరూ చేయనంత కాలం సీఎంగా చేసిన చంద్రబాబు.. ఐదేళ్లు పాటు వైయస్.జగన్, గతంలో వైయస్ఆర్ చేసిన అభివృద్ది కూడా రాయలసీమలో చేయలేదని అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజల హక్కులకు సమాధి కట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఎందుకు బదులివ్వలేదని నిలదీశారు. దాన్నుంచి డైవర్ట్ చేయడానికి 190 రోజుల్లోనే హంద్రీనీవాకు 40 టీఎంసీలు ఎత్తిపోశాం, ఆ ఘనత మాదే అంటూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డాన్ని ఆక్షేపించారు.