ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాజన్న దొర ఆగ్రహం 

23 Mar, 2026 15:02 IST

పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అధికారుల తీరుపై, ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అరకు ఎంపీ తనూజ రాణిని ఆహ్వానించకపోవడం తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘన అని రాజన్న దొర పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వకపోవడం సరికాదని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు.
మంత్రి సంధ్యారాణి రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించి, అదే సమయంలో వైయ‌స్ఆర్‌సీపీపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

సాలూరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వైయ‌స్ఆర్‌సీపీ పాలనలోనే జరిగిందని రాజన్న దొర స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం చేపట్టిన పనులను ఇప్పుడు తమవిగా చూపించుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.