చంద్ర‌బాబూ..దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు 

7 Dec, 2025 16:04 IST

 తాడేపల్లి : సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్‌ విమర్శించారు. శ్రీవారి ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు ఉందని చెప్పి  ఆయన అభాసుపాలు చేశారని దుయ్యబట్టారు. ప‌ర‌కామ‌ణి వ్య‌వ‌హారాన్ని వైయ‌స్ఆర్‌సీపీపై నెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చంద్ర‌బాబు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని మండిప‌డ్డారు.  చంద్రబాబు పాలనలో దేవాలయాలపై జరిగిన దాడులు, నిధుల దుర్వినియోగాలు, భక్తులు ఎదుర్కొన్న నష్టాలను లెక్కపెట్టుకుంటే పేజీలు సరిపోవని  పుత్తా శివశంకర్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివ‌శంక‌ర్ ఏమ‌న్నారంటే..

 వెంక‌టేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగుతున్నారు 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, కాకపోయినా దేవుడంటే ఆయ‌న‌కు భ‌యం ,భ‌క్తి ఉండదు. పరిపాలనను పట్టించుకోకుండా ఈవెంట్లతో ప్రజలను మభ్యపెడుతున్నాడు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం వాడి అక్రమ కేసులు పెడుతున్నారు.  పరకామణి కేసులో నిజాలు బయటపడ్డాయి… రోబోటిక్ టెక్నాలజీ ద్వారా పట్టుబడిన రవికుమార్‌ చేసిన తప్పును అంగీకరించారు. ప్రాయశ్చిత్తంగా వారి ఆస్తుల్లో 90 శాతం శ్రీవారికి రాసిచ్చారు. అయినా కూడా ఆ కేసును వైయస్‌ఆర్‌సీపీపై నెపం నెట్టడం దారుణం. నిన్న‌నే రవికుమార్‌ సోషల్‌మీడియాలో ‘మా కుటుంబాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూట‌మి ప్ర‌భుత్వం వ‌దిలిపెట్ట‌కుండా ట్రోల్ చేస్తోంది. 

దేవాలయాల కూల్చివేత, హుండీ దోపిడీలు—అన్నీ చంద్రబాబు హయాంలోనే.. 
విజయవాడలో 40 దేవాలయాలు కూల్చింది టీడీపీ ప్రభుత్వమే. కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు జరిగినవి కూడా అదే పాలనలో. పుష్కరాల్లో డాక్యుమెంటరీ షూటింగ్ వల్ల 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాముడి విగ్రహం త‌ల న‌రికిన కేసులో సూరిబాబు ఏ2. అలాంటి వ్య‌క్తికి చంద్ర‌బాబు  సీఎం రిలీఫ్‌ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు.  తిరుమ‌ల‌లో వెయ్యికాళ్ల మండపాన్ని 2003లో కూల్చినది చంద్రబాబే, ఆ రోజు సాధువుల అభ్యంతరాల్ని కూడా ఆయ‌న‌ పట్టించుకోలేదు. తిరుమల ఆస్తులను ఇతర పనులకు వినియోగించేందుకు జీవో తీసుకురాగానే, ఐఏఎస్ అధికారి అజయ్‌కల్లాం అడ్డుకున్నారు. సదావర్తి  స‌త్రం భూములను కారుచౌకకు తన అనుయాయులకు అప్పగించాడు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింద‌ని టీడీపీ  నేత‌లు అసత్య ఆరోపణలు చేసి అభాసుపాల‌య్యారు. 

చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలి
2014–19 మధ్య సింహాచలం భూముల రికార్డుల్లో నుంచి మాయమయ్యాయి. కనకదుర్గమ్మ ఆలయంలో కిరీటాలు చోరీకి గురైనప్పుడు వాటి స్థానంలో ఇత్తడి, రోల్‌ గోల్డ్ పెట్టారు. తిరుమల లడ్డూ క‌ల్తీ అంటూ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారు.  మీ హయాంలో మీరు తీసుకున్న నెయ్యి రేటు మాకు కంటే తక్కువే కదా? హిందూ విశ్వాసాన్ని ఇలా అవమానించడంస‌రికాదు కాదు. హిందూ మతంపై ఆయ‌న‌కు ప్రేమ ఉంటే వీటన్నింటికి ముందుగా క్షమాపణ చెప్పాలి. 

 
స్వామి వారి ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు
“రవికుమార్‌ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం పడ్డాడు. వేద బ్రహ్మణుడు తన ఆస్తులు గుడికి ఇచ్చినా, ఇంకా దొంగ అంటూ అవమానిస్తున్నారు. చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళ్లినా బాబాయ్, గొడ్డలి అంటూ హేళ‌న‌గా మాట్లాడుతున్నారు. ఇది ఎల్లో బ్యాచ్‌ సంస్కృతి. వెంక‌టేశ్వరస్వామిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోవాలి. లేకపోతే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు” అని శివశంకర్‌రెడ్డి హెచ్చరించారు.