పోలీసులకు సహకరించిన తోపుదుర్తిపై అక్రమ కేసు
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నుంచి కిందిస్థాయి వైయస్ఆర్‌సీపీ కార్యకర్త వరకు ఎవర్నీ వదలకుండా కూటమి నాయకులు ప్రతీకార రాజకీయాలకు దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భద్రత విషయంలోనూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సార్సీ కమిటీ రివ్యూ కూడా చేయకుండా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కనీసం ఏసీ కూడా సరిగ్గా పనిచేయని వాహనాన్ని ప్రతిపక్ష నాయకుడికి కేటాయించి అవమానించారు. ఈ వాహనం ఇప్పటికే ఒకసారి రోడ్డు మీద సడెన్‌గా ఆగిపోయిన పరిస్థితి రాష్ట్ర ప్రజలంతా చూశారు. జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ కేటాయించడం లేదు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లినప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న హై ప్రొఫైల్ పర్సన్‌కి ఒక్క పోలీస్ అధికారి భద్రతను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం. వైయస్ జగన్ రామగిరి మండలం పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలిప్యాడ్ దగ్గర సరైన భద్రత కల్పించకపోవడంతో విండ్ షీల్డ్ దెబ్బతిని బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 1100 మందిని మోహరించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 1100 మంది ఉన్నా కంట్రోల్ చేయలేని అధికారులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధనల ప్రకారం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 8 ఆర్మ్‌డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒకవేళ జనాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది వంద మీటర్ల వెలుపల సివిల్ ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా జనాల తాకిడి ఎక్కువైతే ఆ ప్రాంతాన్ని బట్టి పోలీసులను రౌండ్స్‌గా ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలన్నీ ప్రభుత్వం పాటించి ఉంటే హెలిప్యాడ్ వరకు జనాలు రాగలిగేవారా?
పోలీసులకు సహకరించిన తోపుదుర్తి
ప్రభుత్వ వైఫల్యాలను, పోలీసుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆరోజు కార్యక్రమానికి హాజరైన వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకుల మీద ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరుల మీద అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. జనం నవ్వుతారనే కనీస విచక్షణ కూడా లేకుండా తోపుదుర్తి సోదరులే ప్రజలను రెచ్చగొట్టి హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లారని నమ్మశక్యం కాని అక్రమ కేసులు పెట్టారు. ఆరోజు జనాన్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన డీఎస్పీ, తన హ్యాండ్ మైకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతికిచ్చారు. అభిమానులను కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన చేతుల్లోనే పెట్టారు. ఇదంతా చూసి కూడా జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులను మోహరించామని ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం అనిపించుకోదా? పైగా పోలీసులకు సహకరించి అభిమానులను కంట్రోల్ చేసిన తోపుదుర్తి మీద అభిమానులను రెచ్చగొట్టి పంపారని పోలీసులతోనే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ అక్రమ కేసుల మీద ఆయన న్యాయస్థానాల్లో పోరాడుతుంటే ఆయన తప్పించుకుని తిరుగుతున్నారంటూ ఆయన కోసం నియోజకవర్గంలోని వైయస్ఆర్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. వేకువజామున వారి ఇళ్లకు పోయి ఇబ్బందులు పెడుతున్నారు.
అవినీతి అధికారుల భరతం పడతాం
2019-24 మధ్య వైయస్ఆర్‌సీపీ పాలనలో నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పది నెలల్లో మళ్లీ పగలు ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. అమాయకులైన వైయస్ఆర్‌సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. కొంతమంది పొలీసులను అడ్డంపెట్టుకుని అంతరించిపోయిన రౌడీయిజాన్ని మళ్లీ తట్టిలేపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కూటమి నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వారి ప్రతీకార రాజకీయాలకు సహకరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో శిక్షను అనుభవించకతప్పదని గుర్తుంచుకోవాలి. ఏడాది పాలన పూర్తికాకుండానే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 2029లో వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రావడం ఖాయం. ఇలాంటి అవినీతి అధికారుల భరతం పట్టడం ఖాయం.