దళిత యువకుడి హత్యపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ ఆగ్రహం

17 Jan, 2026 12:52 IST

శ్రీకాకుళం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మండా సాల్మన్‌ను పాశవికంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఘన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వారి రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు. మండా సాల్మన్ హత్య అత్యంత అమానుషమని, ఇది రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, ఈ దారుణానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, అందవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం తదితర నాయకులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దళితుల హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్య విలువలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని వారు తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.