భోగి సంబరాల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీపీపీ జీఓల దగ్ధం

14 Jan, 2026 14:45 IST

తాడేపల్లి : ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన పీపీపీ జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద భోగి సంబరాల సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీపీపీ జీఓ ప్రతులను భోగి మంటల్లో వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే కుట్రలో భాగంగానే ఈ వైయ‌స్ఆర్‌సీపీ పీపీపీ జీఓలను తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ నిర్ణయంతో వైద్య విద్య సామాన్య ప్రజలకు అందని దూరంగా మారుతుందని, పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రజల ఆరోగ్యం, వైద్య విద్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవర్ చేశారు.