సాల్మన్‌ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ

21 Jan, 2026 18:12 IST

తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణహత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అనంతరం, వారితో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి.

ఈ సందర్భంగా కాసు మహేష్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
న్యాయ పోరాటం చేస్తాం:

    మంద సాల్మన్‌ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది. వచ్చే ఆదివారం పిన్నెల్లిలో పార్టీ ఆధ్వర్యంలో సాల్మన్‌ సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు హాజరై నివాళులు అర్పిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించాల్సింది పోయి టీడీపీ నాయకుల అరాచకాలకు వంత పాడుతున్నారు. సాల్మన్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ పోరాడుతుంది. అందుకోసం న్యాయస్థానాలతో పాటు, జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), జాతీయ ఎస్సీ కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తాం. 
    సాల్మన్‌పై దాడి కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చూపిన పోలీసులపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రేపు మా ప్రభుత్వం వచ్చాక, వారిని కచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తాం.

పిన్నెల్లిలో టీడీపీ అరాచకం:
    రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతోనే, ఆ పార్టీ నాయకుల అరాచకాలకు భయపడి పిన్నెల్లిలో దాదాపు 300 కుటుంబాలకు చెందిన వెయ్యి మందికి పైగా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 9 వేల మంది జనాభాతో ప్రశాంతంగా ఉన్న పిన్నెల్లి గ్రామాన్ని శ్మశానంగా మార్చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మంద సాల్మన్‌ మీద ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. దారుణంగా చంíపడమే కాకుండా స్వగ్రామంలో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవాలని చూశారు. 
    టీడీపీ చేస్తున్న అరాచకాల కారణంగా గ్రామాల్లో పనులు లేక వలసలు పెరిగిపోతున్నా, దీన్ని అడ్డుకుని శాంతి నెలకొల్పాలన్న ఆలోచన సీఎం చంద్రబాబు చేయడం లేదు. వ్యాపారులు కూడా గ్రామంలో ఉండటానికి భయపడిపోతున్న భయంకరమైన పరిస్థితులు పిన్నెల్లిలో నెలకొన్నాయని కాసు మహేష్‌రెడ్డి వివరించారు.

గ్రామంలో శాంతి నెలకొనాలి: మంద అన్నోజిరావు. హతుడు మంద సాల్మన్‌ తమ్ముడు. 
 కక్షలు, దాడులతో గ్రామం అభివృద్ధి చెందదు. మంద సాల్మన్‌ హత్య మా గ్రామంలో చివరి హత్యగా మిగిలిపోవాలి. పగలు ప్రతీకారాలతో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునే సంస్కృతికి ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. ఇకనైనా హత్యా రాజకీయాలు విడనాడాలని అధికార పార్టీని వేడుకుంటున్నా. శాంతి చర్చల ద్వారా గ్రామంలో తిరిగి ప్రశాంత వాతావరణం రావాలనేది మా ఆకాంక్ష. అందుకే ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు కలగ జేసుకుని గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ చూపాలి. మా అన్న సాల్మన్‌ హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలి.