జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబుల దాడిని ఖండిస్తున్నాం

1 Feb, 2026 20:16 IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర బలగాలను ఏపీకి పంపించాలని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన వెంకటమహేష్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా పోతిన వెంకటమహేష్ ఇంకా ఏమ‌న్నారంటే..:

మీ కుర్చీపై మీరే నిప్పు పెట్టుకుంటున్నారు 
రాష్ట్రంలో కాపు, బీసీ నాయకులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. బీసీ, కాపు నాయకుల ఇళ్లపై నిప్పు పెట్టారనుకుంటున్నారు కానీ, వాస్తవానికి మీరు మీ కుర్చీపై మీరే నిప్పు పెట్టుకుంటున్నారు.
భస్మాసురుడు తన నెత్తిపై చేయి పెట్టుకొని ఎలా భస్మం అయ్యాడో, అదే విధంగా అంబటి రాంబాబు, విడదల రజినీ, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయించి నిప్పు పెట్టించడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తునే తగలబెట్టుకుంటున్నారు.

రాష్ట్రం జంగిల్ రాజ్‌గా మారింది
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం పెట్రేగిపోయింది. పాలన పూర్తిగా జంగిల్ రాజ్‌గా మారింది. చంద్రబాబు, లోకేష్ కలిసి రాష్ట్రంలో పత్తార్ గ్యాంగ్‌ను తయారు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్రోల్ బాంబులు, రాళ్లు వేయడం అంటే అసాంఘీక శక్తులను తయారు చేయడమే. ఇది యాదృచ్ఛికం కాదు. పథకం ప్రకారమే వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై వరుసగా దాడులు చేస్తున్నారు.

మీకు ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని వల్లకాడు చేయమనా? దోచుకోవడానికా? మీ తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేయించాలా?. వారం రోజులుగా వరుసగా దాడులు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏమి చేస్తోంది? రౌడీలను, గూండాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? హోం మంత్రి, డీజీపీ ఎందుకు స్పందించడం లేదు? 

రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదు 
జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడమే కాకుండా నిప్పు పెట్టారు. నిన్న అంబటి రాంబాబు ఇంటిని తగులబెట్టారు. గంటలకొద్దీ విధ్వంసం కొనసాగుతున్నా పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. కాబట్టి వెంటనే గ‌వ‌ర్న‌ర్ స్పందించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, కేంద్ర బలగాలను ఏపీకి పంపించాల‌ని కేంద్రాన్ని కోరాలి, కేంద్ర హోం శాఖ కూడా ఏపీలో జ‌రుగుతున్న విధ్వంసాలు, అరాచ‌కాల‌పై స్పందించాల‌ని పోతిన వెంకటమహేష్ విజ్ఞ‌ప్తి చేశారు.