“చలో పోతిరెడ్డిపాడు” విజయవంతం చేద్దాం
నెల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ తీరుకు నిరసనగా ఈ నెల 5వ తేదీ నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకుడు ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో “చలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి రాయలసీమ రైతులు, ప్రజలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి నీటి హక్కులు సాధించేందుకు వైఎస్ఆర్‌సీపీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. రాయలసీమ రైతులు, ప్రజల భవిష్యత్తు కోసం చేపట్టిన “చలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.