మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు
నెల్లూరు జిల్లా: వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 14వ తేదీన కోవూరు పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం 14వ తేదీ రావాల్సిన అవసరం లేదని, 19వ తేదీన ఇంటి వద్దే విచారణ చేపడతామని పోలీసులు రెండోసారి నోటీసులు అందజేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాకాణి ఇంటి వద్దే ఎదురుచూశారు. కానీ పోలీసులు రాకపోవడంతో ఆయన తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే మళ్లీ నెల్లూరు రూరల్ సబ్‌డివిజన్ కార్యాలయానికి విచారణకు రావాలంటూ మరో నోటీసు అందించారు. నోటీసులో ఫిబ్రవరి 24న హాజరుకాలేకపోతే, ప్రత్యామ్నాయ తేదీ సూచించవచ్చని పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, తాను పోలీసు కేసులకు భయపడే వ్యక్తి కాదని, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.