వైయ‌స్‌ జగన్ ప‌ల్నాడు పర్యటనపై ఆంక్షలు..  

18 Jun, 2025 10:55 IST

 

పల్నాడు: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ ప్రజాదరణ చూసి కూటమి సర్కార్‌ కొత్త కుట్రలకు తెర లేపింది. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. వైయ‌స్‌ జగన్‌ నేడు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైయ‌స్‌ జగన్‌ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్‌ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.

వైయ‌స్‌ జగన్‌ నేడు పల్నాడు జిల్లా రెంటళ్లపాడు పర్యటన సందర్బంగా పోలీసులు ఆంక్షలు విధించారు. వైయ‌స్‌ జగన్‌ పర్యటనకు కేవలం వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, నిరసన, ధర్నా కాకపోయినా ఇలా.. పోలీసుల ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ క​ూడా లేదా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ద్వారా వైయ‌స్‌ జగన్‌ పర్యటనను కూటమి సర్కార్‌ నియంత్రించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

 

ఇక, వైయ‌స్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఇలా ఆంక్షలు విధించడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ ఆదేశాల మేరకే వైయ‌స్‌ జగన్‌ పర్యటనలను నియంత్రించేందుకు పోలీసులు ఇలా ఆదేశాలు జారీ చేశారని అటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. 

మరోవైపు.. వైయ‌స్‌ జగన్‌ పర్యటనలో పాల్గొన వద్దంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు పంపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పల్నాడు జిల్లా నేతలందరికీ నోటీసులు అందించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు.  నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇక, ఇప్పటికే రెంటపాళ్లకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. 

 

YSRCP Naga Malleswara Rao Father Sad Comments

మా బంధువులనైనా అనుమతించండి.. నాగమల్లేశ్వరరావు తండ్రి ఆవేదన 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ పల్నాడు పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు విధించారు. రెంటపాళ్లలో పోలీసుల చెక్‌పోస్టులు, అడ్డకుంలపై వైయ‌స్ఆర్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎవరనీ అడ్డుకోవద్దు. మీ కాళ్లు పట్టుకుంటా.. మా బంధువులనైనా అనుమతించండి అని అన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు తండ్రి తాజాగా మాట్లాడుతూ..‘పల్నాడు పోలీసుల వైఖరి సరికాదు. మా బంధువులను కూడా అడ్డుకుంటున్నారు. దయచేసి ఎవరనీ అడ్డుకోవద్దు. పరామర్శకు అనుమతి తీసుకున్నారు. మీ కాళ్లు పట్టుకుంటా.. మా బంధువులనైనా అనుమతించండి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.