‘వెన్నుపోటుకు రెండేళ్లు’.
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైయస్సార్‌సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన, ర్యాలీ కార్యక్రమాల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
తాడిపత్రి, రాజమహేంద్రవరం, విశాఖ నార్త్, విశాఖ సౌత్ ప్రాంతాల్లో పోలీసులు నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడంతో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి బయలుదేరిన కేతిరెడ్డిని ఇంటి వద్దే నిలువరించి హౌస్ అరెస్ట్ చేశారు.
అదే సమయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా, తనకు మాత్రమే అనుమతి నిరాకరించడం రాజకీయ కక్షసాధింపేనని కేతిరెడ్డి ఆరోపించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా హరించారని మండిపడ్డారు.
రాజమహేంద్రవరంలో ర్యాలీ అడ్డగింత
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ వద్ద మాజీ ఎంపీ భరత్ నాయకత్వంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టాయి. అనంతరం కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎంపీ భరత్‌తో పాటు పార్టీ నాయకులు కోటగుమ్మం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
విశాఖ నార్త్‌లో కేకే రాజు ఆందోళన
విశాఖ నార్త్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమానికి వస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతసేపు కొనసాగిన ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
విశాఖ సౌత్‌లో తోపులాట
విశాఖ సౌత్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలను నిలువరించడంతో వాగ్వాదం చోటుచేసుకుని కొంతసేపటికి తోపులాటకు దారితీసింది.
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన నిర్వహించేందుకు వచ్చిన పార్టీ శ్రేణులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ప్రభుత్వం పోలీసులను వినియోగిస్తోందని ఆరోపించారు.
పోలీసుల తీరు చర్చనీయాంశం
పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించడం, ర్యాలీలను అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్య బద్ధమైన నిరసనలను అణచివేయడం సరైంది కాదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొంటుండగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు సమర్థించుకునే ప్రయత్నం చేశారు.