కాకినాడ జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీపై టీడీపీ కక్షసాధింపు

2 Jan, 2026 16:02 IST

కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తుని రూరల్ పోలీసుల అత్యుత్సాహం హద్దులు దాటిందని, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మరియు కార్యకర్తలపై అన్యాయంగా లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి.పోలవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శాంతియుతంగా పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ లాఠీఛార్జ్‌లో కనీసం పది మందికి గాయాలు అయినట్లు సమాచారం.

గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో పోలీసులు అవసరం లేని బలప్రయోగానికి పాల్పడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా వేడుకలు జరుపుకునే హక్కును కూడా హరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ, టీడీపీ నేతల ఆదేశాలతోనే పోలీసులు తమపై “రెడ్ బుక్ రాజ్యాంగాన్ని” అమలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టపాలన పూర్తిగా పక్కకు వెళ్లి, ప్రతిపక్షాలపై అణచివేతే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు. ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని, లాఠీఛార్జ్‌కు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.