పోలీసుల వేధింపులు.. మనస్తాపంతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త మృతి
వైయస్ఆర్ జిల్లా: జిల్లాలో అధికార పార్టీ నాయకుల మాటలు విని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో జరిగిన ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.
స్థానికంగా కొనసాగుతున్న భూమి సంబంధిత సివిల్ వివాదం కోర్టులో విచారణలో ఉండగానే, టిడిపి నాయకుల సూచనలతో పోలీసులు జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త షరీఫ్ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, పోలీసుల జోక్యం అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టంగా విన్నవించినప్పటికీ, పోలీసులు బూతులు తిడుతూ షరీఫ్ కుటుంబాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన షరీఫ్ తండ్రి దస్తగిరి (70) ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పోలీసుల వేధింపులు, అవమానకర ప్రవర్తనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడానికి కారణమని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సివిల్ వివాదాల్లో అధికార పార్టీ నాయకుల మాటలు విని పోలీసులు జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులు, టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.