లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం
తాడేపల్లి: ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్‌లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ ప్రభుత్వాధికారులు కృష్ణమెహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల బెయిల్ పిటీషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తెట్టతెల్లమవుతోందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్ళిన చంద్రబాబు దానికి ప్రతిగా కక్షతోనే ఈ తప్పుడు కేసును సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు కేసులతో వైయస్ జగన్‌ను భయపెట్టాలని అనుకోవడం వారి అవివేకమని అన్నారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
తాజాగా కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల బెయిల్‌ను సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆర్డర్‌లో ఈ కేసు రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వ వాదనలు కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నదని పదేపదే చెబుతున్నారు కాబట్టి, న్యాయస్థానాలు పోలీస్ విచారణలో తలదూర్చకూడదనే కారణంతో బెయిల్ ఇవ్వడం లేదని చెప్పారు. అంటే సుదూరంలోని సుప్రీంకోర్ట్ న్యాయస్థానానికి కూడా ఇది రాజకీయ ప్రేరేపిత, కక్షసాధింపు కేసు అని అర్థమయ్యింది. కానీ ఇక్కడ ఉన్న మీడియాకు మాత్రం పొరపాటున ఇది కక్షసాధింపు అని కనిపించదు. ఎందుకంటే రాష్ట్రంలో సర్వం చంద్రబాబు మయం అయిపోయింది. సాధారణంగా ఎక్కడైనా ఒక పిటీషన్ వస్తే దానిపై ఏ విచారణా సంస్థ అయినా ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ, దానిని బట్టి ఎవరి పాత్ర దానిలో ఉందో నిర్ధారించుకుంటూ ముందుకు సాగుతారు. కానీ లిక్కర్ కేసులో వైయస్ జగన్ లక్ష్యంగా కేసును మొదలుపెట్టారు. ఎక్కడా ఒక్క సాక్ష్యం, ఒక్క ఆధారం లేకుండానే ఎవరినో పట్టుకోవడం, వారిని బెదిరించడం వారి వాగ్మూలంతో మరొకరిపై కేసు నమోదు చేయడం చేస్తున్నారు. స్కీల్ స్కామ్‌లో రూ. 370 కోట్ల ప్రజాధనంను లూటీ చేసిన ఘటనలో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయారు. నాడు ఏలేరు స్కామ్ నుంచి నేడు స్కిల్ స్కామ్ వరకు దేనిపైనా విచారణ ముందుకు సాగనివ్వకుండా ఆయన తన పరపతిని, డబ్బును వినియోగించి స్టేలు తెచ్చుకుని కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ జీవితం అంతా స్టేల మీదనే కొనసాగుతోంది. స్కిల్ స్కామ్‌లో దొరికి పోయి చంద్రబాబు యాబై రోజులకు పైగా జైలులో ఉన్నారు. దానికి ప్రతీకారంగా వైయస్ జగన్‌ను అంతకు మించి ఒక్కరోజు అయినా జైలుకు పంపాలనే కక్షతో వ్యవహరిస్తున్నారు. స్కీల్ డెవలప్‌మెంట్‌లో ఎంతమంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్పించారో దాని ప్రకారమే బిల్లులు చెల్లించారని అధికారులు ఫైళ్ళలో రాశారు. అయినా కూడా సీఎంగా చంద్రబాబు అయిదుసార్లు ప్రత్యేక మీటింగ్‌లు పెట్టి, కొన్ని సంస్థలకే డబ్బు విడుదల చేయాలంటూ ఫైళ్ళపై స్వయంగా సంతకాలు పెట్టి, సిఫారస్ చేశారు. ఎక్కడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ఎంత మందికి శిక్షణ ఇచ్చారో లెక్కలు కూడా లేవని ఫైళ్ళపై అధికారులు రాసినా, లెక్కచేయకుండా సీఎంగా చంద్రబాబు చేసిన ఒత్తిళ్ళతో డబ్బు విడుదల చేశారు. ఈ స్కామ్‌లో చంద్రబాబు దొరికిపోయాడు. గతంలో ఓటుకు కోట్లు కేసులోనూ ఇలాగే కెమేరాలకు దొరికిపోయారు. అవర్ పీపుల్ బ్రీఫ్డ్‌మీ అంటూ ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్‌లో మాట్లాడింది నేను కాదు అని ఒక్కరోజు అయినా చంద్రబాబు చెప్పారా? నేను డబ్బు పంపలేదని చెప్పారా? ఇటువంటి తప్పులు చేసిన చంద్రబాబు కేసుల్లో ఇరుకున్నారు.
- ఒక ప్రణాళిక ప్రకారం లిక్కర్ స్కామ్ సృష్టి
ఈ లిక్కర్ కేసులో వైయస్ జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి ఎక్కడైనా సంతకాలు చేశారా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలని ఫైళ్లలో సిఫారస్ చేశారా? వారు ఇలా చేశారని ఏ ఒక్క అధికారి అయినా ఫిర్యాదు చేశారా? అపట్లో పనిచేసిన ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీనీ సిట్ పేరుతో ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఎలా విచారణ పేరుతో వేధించిందో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చిన అధికారికి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన పిటీషన్‌ను అడ్డం పెట్టుకుని ఈ కథ ప్రారంభించారు. తనకు ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. వారు తొమ్మిది రోజుల్లో విచారణ జరిపి సదరు అధికారికి నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై విచారణ జరపాలని ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పుడు సీఐడీకి నేతృత్వం వహిస్తున్న వినీత్ బిజ్రాల్ ఈ మొత్తం కేసును పూర్తిగా పరిశీలించి, ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, ఈ కేసును ముందుకు తీసుకువెళ్ళలేనని తెగేసి చెప్పారు. దీనిపై కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పోలీస్ ఉన్నతాధికారి, సదరు సీఐడీ చీఫ్ వినీత్ బిజ్రాల్‌ను బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడని వినీత్ బిజ్రాల్ తప్పు చేయడానికి నిరాకరించడంతో పాటు తన రాజీనామాను సైతం సదరు అధికారి ముఖాన కొట్టారు. మళ్లీ సదరు పోలీస్ ఉన్నతాధికారి వినీత్ బిజ్రాల్‌ను బతిమిలాడి, ఆయనను ఆ స్థానం నుంచి పక్కకు తప్పించి, ఆయన స్థానంలో తాము చెప్పినట్లు వినే పోలీస్ అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. వైయస్ జగన్ ను లక్ష్యంగా పెట్టుకుని ఈ కేసును నడిపిస్తున్నారు.
- చంద్రబాబు హయాంలో బార్ ప్రివిలైజ్డ్ ఫీజుల పేరుతో భారీగా దండుకున్నారు
2014లో చంద్రబాబు సీఎం అయిన ఏడాదిలోనే అప్పట్లోని ఎక్సైజ్ కమిషనర్ బార్‌లపై ఉన్న ప్రివిలైజ్ ఫీజ్‌ను పదిరెట్లు పెంచాలని ప్రతిపాదనలు సీఎంకు పంపారు. కేబినెట్‌లో దాని గురించి ఎటువంటి చర్చ జరగలేదు, ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఈ లోగా ఈ విషయాన్ని లీక్ చేసి బార్‌షాప్‌ల యజమానుల నుంచి భారీగా వసూళ్లు దండుతున్నారు. వెంటనే ఆ సాయంత్రం అదే కమిషనర్ ప్రివిలైజ్ ఫీజు రద్దు చేస్తూ మరో ప్రతిపాదన ప్రభుత్వానికి పంపడంతో పాటు సర్క్యులర్ కూడా ఇచ్చేశారు. ఈ మొత్తం ప్రక్రియ నిబంధనలకు విరుద్దమని ఐఎఎస్ అధికారులు చెప్పడంతో సర్క్యులర్ ఇచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ప్రివిలైజ్ ఫీజు తగ్గించాలంటూ బార్ యజమానుల నుంచి విజ్క్షాపన పత్రాలు రాయించుకున్నారు. దానిని పరిగణలోకి తీసుకుంటూ ప్రివిలైజ్డ్ ఫీజును రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దానికి సంబంధించిన ఫైళ్ళపై అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 3.12.2015న సంతకం పెడితే ఆ మరుసటి రోజైన 4.12.2015న ర్యాటిఫికేషన్ ఫైల్ పై చంద్రబాబు సంతకం పెట్టారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు చూపుతున్నాం. లిక్కర్ విషయంలో చంద్రబాబు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడ్డాడనేందుకు ఇవీ ఆధారాలు. ఇటువంటి తప్పుడు ఆదేశం కూటమి ప్రభుత్వం చెబుతున్న ఈ లిక్కర్ స్కామ్‌లో ఉందా?
- సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారు
లిక్కర్ స్కామ్ పేరుతో పోలీసులు అరెస్ట్ చేసిన బాలాజీ గోవిందప్పకు, వైయస్ జగన్‌కు ఏం సంబంధం? భారతీ సిమెంట్స్ ను వికాట్ అనే సంస్థకు అమ్మేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దానిలో పనిచేస్తున్న అధికారితో వైయస్ జగన్‌కు ఏం సంబంధం? వైయస్ జగన్‌ను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో ఇటువంటి దొంగ సాక్ష్యాలను, బెదిరించి, బలవంతంగా సంతకాలు చేయించుకుని కేసులు నమోదు చేస్తున్నారు. బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ తనను బెదిరిస్తున్నారంటూ మూడుసార్లు హైకోర్ట్‌కు కూడా ఫిర్యాదు చేశారు. చివరికి ఆయనను బెదిరించి, ఈ కేసులో నుంచి తప్పిస్తామని ప్రలోభపెట్టి, సాక్షిగా మాత్రమే తీసుకుంటామని చెప్పి అతడి నుంచి కో-ఎక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా ఎక్కడ సంతకం పెట్టమంటే, అక్కడ సంతకం పెడతారో అలాంటి వారిని సురక్షితంగా రాష్ట్రం బయటకు పంపిస్తున్నారు.
- తప్పుడు కేసులతో భయపెట్టలేరు
ఇటువంటి తప్పుడు కేసులకు వైయస్ జగన్ భయపడరు. జెండా మోసే కార్యకర్త నుంచి వైయస్ జగన్ వరకు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వాటిపై పోరాడేందుకు సిద్దంగా ఉన్నాం. ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తప్పులు, పాపాలు, లోబర్చుకోవడం, ఏమార్చడం, తప్పుడు పనులు చేయించడంలో చంద్రబాబు పేరు మాత్రమే కనిపిస్తుంది. వైయస్ జగన్‌పై విషం చిమ్మడం కోసం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజల్లో అపోహలు సృష్టించారు. మంత్రి అచ్చెన్నాయుడు 22.3.2022న జగన్‌కు అయిదేళ్ళలో పదివేల కోట్ల ఆదాయం వచ్చిందని ఆరోపించిన వార్త ఈనాడు పత్రికలో కథనంగా వచ్చింది. పురందేశ్వరీ ఏటా రూ.25వేల కోట్లు వైయస జగన్ ఆర్జించారని ఆరోపించారు. వైయస్ జగన్ జేబుల్లోకి రూ.లక్ష కోట్లు మద్యం ద్వారా ఆదాయం అంటూ మరో కూటమి పార్టీ నాయకుడు ఆరోపించారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ వైయస్ జగన్ రూ.30 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మరో నాయకుడు మాట్లాడుతూ రూ.4వేల కోట్లు దేశం దాటించేశారంటూ మాట్లాడారు. వైకాపా హయాంలో రూ.30 వేల కోట్లు దోచుకున్నారని మరో నాయకుడు ఆరోపించారు. ఇక సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మద్యం విషయంలో ప్రభుత్వ ఖజానాకు రూ.18,860 కోట్లు నష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిదని వెల్లడించారు. అసెంబ్లీలో ఇంత దోపిడీ జరిగిందని మాట్లాడినప్పుడు ఎందుకు కేసు నమోదు చేయలేదు? సుమోటోగా ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు? ఎందుకంటే లేని స్కామ్‌ను సృష్టించాలంటే ఎవరో ఒకరు కావాలి. ఈ తప్పులు భరించలేక ఐపీఎస్ అధికారి వినీత్ బిజ్రాల్ రాష్ట్రం వదిలి ఢిల్లీకి వెళ్ళిపోయారు.
- ఒక్క ఆధారం అయినా చూపించగలరా?
లిక్కర్ కేసులో ఒక్క ఆధారం అయినా చూపించగలిగారా? అసెంబ్లీలో చంద్రబాబు ఏ ఆధారాలతో మాట్లాడారు? ఇప్పుడు డిస్టలరీల దగ్గర డబ్బు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. సేల్స్ పెంచితే డిస్టిలరీల నుంచి డబ్బు తీసుకుంటారు, కానీ అలా జరగలేదే? చంద్రబాబు హయాంలో నలబై శాతం ఒక్క డిస్టిలరీకే ఆర్డర్లు ఇచ్చారు. వైయస్ జగన్ హయాంలో అలా చేయలేదే? చంద్రబాబు దొరికిపోయిన దొంగ. చేసిన తప్పుకు జైలుకు వెళ్ళి, ఆ కక్షతో ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్‌లు వేసుకుని హైదరాబాద్‌కు వెడుతుంటారు. హైదరాబాద్‌కు వ్యాపారులను రమ్మని పిలుస్తుంటారు. ఇంటి నుంచి సెక్రటేరియట్‌కు హెలికాఫ్టర్. చివరికి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కూడా ఒక హెలికాఫ్టర్ వాడుతున్నారు. ఇప్పుడు ముగ్గురికి మూడు హెలికాఫ్టర్‌లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు హామీల అమలుకు మాత్రం డబ్బు లేదని అంటున్నారు. జనం సొమ్ముతో జల్పాలు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్‌షాప్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆయన ఒక డమ్మీ మంత్రి. లోకేష్ అనుచరుడు కిలారు రాజేష్ ఫోన్ చేస్తే తప్ప ఫైళ్ళపై సంతకాలు చేయలేని పరిస్థితి. ఆయన సొంతగా నిర్ణయించి సంతకం పెట్టే పరిస్థితిలో ఉన్నారా? గతంలో బార్ ప్రివిలైజ్డ్ ఫైళ్ళలపై ఆయన పెట్టిన సంతకాలే దీనికి నిదర్శనం.