అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవు 

6 Oct, 2022 16:30 IST

అమ‌రావ‌తి:  అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవని పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సర్వే ద్వారా కబ్జాదారులను గుర్తిస్తామని.. ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీ శాఖకు బదలాయిస్తామని అన్నారు. కబ్జాదారులు ఎవరైనా సరే.. విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అటవీభూముల సంరక్షణపై ప్రత్యేక్ష దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న 10 వేల ఎకరాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని చెప్పారు. అటవీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే కొనసాగుతోందని.. కబ్జాకు గురైన అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.