చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే
తాడేపల్లి: అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని, అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఏకంగా రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతి కట్టే బదులు, మావిగాన్ పేరుతో ప్లాన్–బీ గురించి జగన్‌గారు చెబితే, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో తాము మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే, దాన్ని ఇప్పటికీ మూడు ముక్కలాట పేరుతో విమర్శిస్తూ.. ఆయా ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. గతంలో మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజన్ చేసేందుకు వీలుగా పోర్టు నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు మావిగాన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపే అని చెప్పారు. దీన్ని తట్టుకోలేకే చంద్రబాబు అవాకులూ, చవాకులు పేలుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
అప్పుల అమరావతిపై రాష్ట్రమంతా సంబరాలా!:
చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయమని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు. మట్టి, నీళ్లు ఇచ్చిన ప్రధాని మోదీ, తమ నెత్తి మీద చేయి పెట్టారని నాడు చంద్రబాబు విమర్శించారు. ఇంకా అమరావతికి కులం రంగు పులిమింది చంద్రబాబే. రేణుకాచౌదరి పార్లమెంటులో కమ్మరావతి అని అన్నారు. దీన్ని టీడీపీ నుంచి ఎవరైనా ఖండించారా? పైగా ఆమె ఆ మాట అన్నందుకు రాజ్యసభలో గ్యాలరీ నుంచి లోకేష్.. ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. అమరావతిలో అవినీతిని మేం ప్రశ్నిస్తున్నాం. అలాగే వాస్తవాలు గుర్తించి, నేల మీద నిలబడి ఆలోచించాలని జగన్‌గారు సలహా ఇచ్చారు. ఆ పని చేయకుండా ఎదురుదాడి చేస్తున్నారు.
జగన్‌గారు స్పష్టమైన విధానంతో ఉన్నారు:
ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని జగన్‌గారు స్పష్టంగా చెప్పారు. రాజధాని గురించి తొలుత ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఉండాలన్నారు. సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారికి అందుబాటులో ఉండాలన్నది అప్పుడు ఆయన ఆలోచన. దీని కోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం మీద ఆర్థిక భారం కాకూడదన్నది ఆయన ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని పెట్టమన్నారు.
రాజధాని ఇప్పట్లో కాదని చంద్రబాబే అంగీకరించారు:
ఏ అవకాశం వచ్చినా దోపిడీ చంద్రబాబు నైజం. అందులో ఆయన ఆరితేరారు. అమరావతి పనుల్లో కూడా అవసరం లేని, ఎక్కడా లేని రేట్లు పెట్టి, అందమైన పేర్లతో కాంట్రాక్టులు ఇచ్చి, దోపిడీ చేస్తున్నారు. మోటారు పెట్టి నీటిని తోడినట్టు, ప్రజల సొమ్మును రాజధాని పేరు మీద లాగేస్తున్నారు. తన దోపిడీ కోసమే, అవినీతి కోసమే అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబుగా రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. అమరావతి బాండ్లను తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. అప్పట్లో 8 శాతం వడ్డీకి రుణాలు వస్తుంటే, చంద్రబాబు 10.3 శాతం వడ్డీతో అప్పు చేశారు. అయినా ఏదో సాధించినట్లు సిగ్గుచేటు. మరోవైపు అమరావతి ఇప్పట్లో కాదని చంద్రబాబే చెప్తున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్.
నిజానిజాలు ప్రజలు ఆలోచించాలి:
చంద్రబాబు చెబుతున్న దానికి, జగన్‌గారి వాస్తవాల విషదీకరణ మధ్య వ్యత్యాసాన్ని, నిజానిజాలపై ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు ప్రణాళికతో అసలు రాజధాని వస్తుందా? ఉద్యోగాలు ఇచ్చే నగరం, సజీవ నగరంగా, అప్పుల భారం లేని విధంగా, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి ఎప్పుడు మారుతుంది? ఈ తరహా నగరం ఇప్పుడు పూర్తి కాదని చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు.
ప్రభుత్వ అప్పుల ద్వారా రాజధాని కడితే, ఆ తర్వాత పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నది చంద్రబాబు అసంబద్ధమైన వాదన. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు జీఎస్టీ రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వానికి వచ్చే భూములు ఎప్పుడు అమ్ముతాడు?. హైదరాబాద్‌లోని రేటు రావడానికి ఎంత సమయం పడుతుంది?. చంద్రబాబువి మభ్యపెట్టే మాటలు.
ఇదీ నయాపూర్ వాస్తవ పరిస్థితి:
(చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయపూర్ నిర్మాణం జరిగి దాదాపు 20 ఏళ్లయినా, ఇప్పుడు కూడా వాస్తవ పరిస్థితి ఏమిటన్నది ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో ద్వారా చూపారు).
అక్కడ ఇప్పటికీ ఉద్యోగులు, సిబ్బంది రాయ్‌పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. కాకపోతే రాయ్‌పూర్ కోసం ఆ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేయలేదు. రాజధాని కోసం చత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1500 కోట్లు మాత్రమే. అవి కూడా తీర్చేశారు. కాగా, అక్కడ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.7 వేల కోట్లు కాగా, అదే సమయంలో ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు బలంగా ఉన్న చోట రాజధాని ఏర్పడితే అలా అన్ని రకాల ఉపయోగం. అదే ఇక్కడ అమరావతిలో పనుల కోసం విచ్చలవిడిగా వేల కోట్ల అప్పు చేస్తున్నారు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కూడా వికేంద్రీకరణ దిశలో ఆ రాష్ట్ర హైకోర్టును బిలాస్‌పూర్‌లో పెట్టారు. అలాంటిదే ఇక్కడ ప్రతిపాదిస్తే వికేంద్రీకరణ అంటే ఆదో పెద్ద తప్పుడు పనిగా కలరింగ్ ఇచ్చి దుష్ప్రచారం చేశారు.
ఆ కమిటీ నివేదిక అసంబద్ధమా?:
అసలు అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదని నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ మీ దృష్టిలో పిచ్చి కమిటీనా? దేశంలోని ప్రఖ్యాత నిపుణులు చెప్పిన మాటలు మీకు అవహేళనగా కనిపించాయా? ఆచరాణాత్మక ఆలోచనను వాళ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అయినా శివరామకృష్ణన్ నివేదికను పక్కకు తోసేసి చంద్రబాబు సొంత నిర్ణయాలు తీసుకున్నారు.
వీటికి చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలి:
మరి అవన్నీ వద్దన్న చంద్రబాబు ఏం చేశాడు? అమరావతి రైతులకు అన్యాయం చేయలేదా? కౌలు, పెన్షన్లు ద్వారా ఇప్పటికి రూ.3,800 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ చంద్రబాబు తన జేబులో నుంచి ఇవ్వటం లేదు కదా? ఇప్పటికీ రైతుల సమస్యలు కొలిక్కి రాలేదు. దీనికి చంద్రబాబు బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాలి. ప్రపంచంలో లేని కొత్త అవినీతి మార్గాన్ని చంద్రబాబు సృష్టించాడు. అమరావతి ద్వారా ఆయన రాష్ట్రానికి గుదిబండ తయారు చేశాడు.
కాగా, రాజధానిలో రేట్లు, భవనాల సైజు, అందులో జరుగుతున్న అవినీతి చూస్తే భయం వేస్తోంది. అవి ఎప్పటికి పూర్తి అవ్వాలి? ఆ భవనాల నిర్వహణ మరొక గుదిబండ. రైతులకు ఇచ్చిన కౌలు డబ్బులతోనే ప్రభుత్వానికి సొంతంగా వేలాది ఎకరాలు సమకూరేవి. అక్కడి రైతుల పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. నీళ్లు ఎత్తిపోయడానికే రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
జగన్‌గారి ప్లాన్–బి ప్రతిపాదనకు తాటాకులు కట్టడం ఎందుకు?:
జగన్ రాయలసీమలో రాజధాని పెట్టమన్నాడా? మచిలీపట్నం– విజయవాడ – గుంటూరులో పెట్టమంటే చంద్రబాబుకు మంట ఎందుకు? జగన్ గారు సూచించిన గ్రోత్ ఇంజిన్‌కు జగన్‌గారు మొదలుపెట్టిన మచిలీపట్నం పోర్టు దోహద పడుతుంది. ఒక మంచి గ్రోత్ కారిడర్‌ను చంద్రబాబు తన అవినీతి కోసం విస్మరిస్తున్నాడు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును రాజధాని ప్రాంతంగా జగన్‌గారు ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన కొన్ని నెలల్లో అనేకమార్లు దీన్ని ప్రతిపాదించారు. అయితే అది పెద్దగా అది చర్చలోకి రాలేదు. ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ కారిడార్‌కు మావిగాన్ అని పేరు పెట్టారనుకుంటున్నా. ఇలాంటి పేర్లు దేశంలో అనేక గ్రోత్ కారిడార్లకు కూడా ఉన్నాయి.
ఉదాహరణకు నోయిడా కూడా అలాంటిదే. చాలా మందికి అసలు పేరు పూర్తిగా తెలియదు. దాని అసలు పేరు..‘న్యూ ఒఖలా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ – నోయిడా’ .
ఇక్కడ మావిగాన్ కూడా అలాంటిదే. పేర్లు ఏమిటన్నది ముఖ్యం కాదు. వాటి వెనక ఉద్దేశాలు చూడాలి. సారాంశం అర్ధం చేసుకోవాలి. కేవలం ఆ పేరుకు టీడీపీ వాళ్లు తాటాకులు కట్టడం ఎందుకు?
పేరుపై అంత రాద్ధాంతం అవసరమా?:
ప్రజలు కూడా జగన్‌గారి సూచన, ప్రతిపాదన మావిగాన్ మీద చర్చించారు. మేథావులు, నిపుణులు సీరియస్‌గా ఆలోచించారు. మన దగ్గర అనేక అర్బన్ సంస్థలకు.. వుడా, తుడా, ముడా అని పేర్లు పెట్టారు. దేశంలోని అనేక గ్రోత్ కారిడర్లు, ఇండస్ట్రియల్ కారిడర్లు పేర్లు చూస్తే మరింత విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ చర్చ చేయాల్సింది పేరుపై కాదు. చేసిన ప్రతిపాదన ప్రజలకు మంచి చేస్తుందా? లేదా? అన్నది ముఖ్యం.
చంద్రబాబుకు ఈ మూడు నగరాల కలయిక ఇష్టం లేదు:
మచిలీపట్నం–విజయవాడ– గుంటూరు కలవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. గతంలో పశ్చిమ బైపాస్‌ను చంద్రబాబు అడ్డుకున్నాడు. తూర్పు బైపాస్‌ను రానీయకుండా అడ్డుకుంటున్నాడు. అవి వస్తే, చంద్రబాబు అవినీతి ముందుకు సాగదని భయం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు సిటీలు బాగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తే, ఆ ప్రాంతం చాలా తక్కువ ఖర్చుతో మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుడు రాష్ట్రంపై అప్పుల భారం కూడా ఉండదు.
ఒకవేళ ప్రభుత్వానికి మావిగాన్ పేరు ఇష్టం లేకపోతే.. మరో పేరు పెట్టుకోమని జగన్‌గారే స్వయంగా చెప్పారు కదా. అయినా ఇంకా ఏమిటి దానిపై మీ అభ్యంతరం?.
గతి తప్పిన టీడీపీ. మా నాయకులపై దుష్ప్రచారం:
మావిగన్ ప్రతిపాదనను మా పార్టీ నాయకులే వ్యతిరేకించారని ప్రచారం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఈ ఆచరణాత్మక ప్రతిపాదనకు మా పార్టీ నాయకులు అంతా మద్దతు పలుకుతున్నారు. మా పార్టీ నుంచే కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజల నుంచి మద్దతు వస్తోంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయం వారిలో ఉంది. రాష్ట్రంపై భారం లేని ప్రతిపాదన కాబట్టి ఏకీభవిస్తున్నారు. కాగా, తప్పుడు వార్తలు సృష్టించడం, దుష్ప్రచారం చేయడం, బురద చల్లడం, నిందలు వేయడం టీడీపీకి అలవాటే అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.