చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌లో పెట్టుబ‌డులు నిల్‌..ప్ర‌చారం ఫుల్‌

21 Jan, 2026 18:20 IST

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనల‌తో పెట్టుబ‌డులు నిల్‌, ప్ర‌చారం ఫుల్‌గా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  దావోస్‌కు వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఊదరగొట్టడం తప్ప, వాటిలో ఏ ఒక్కటీ రాష్ట్రంలో కనిపించడం లేదని ఆక్షేపించారు. బుధ‌వారం తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌, చంద్రబాబు, లోకేష్‌లు పెట్టుబడుల కోసం కాకుండా తమ వ్యక్తిగత బ్రాండ్ ప్రచారం కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ముతో విదేశాలకు వెళ్లి అబద్ధపు ఒప్పందాలు, అసాధ్యమైన ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని  హెచ్చరించారు. నిజంగా పెట్టుబడులు వచ్చాయంటే వాటి వివరాలు, ఉద్యోగాల గణాంకాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డాక్టర్ సాకె శైలజనాథ్ డిమాండ్ చేశారు.

ప్రెస్‌మీట్‌లో డాక్ట‌ర్ సాకె శైల‌జ‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..

రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది
చంద్రబాబు, లోకేష్‌లు ఎన్నిసార్లు దావోస్‌కు వెళ్లారో లెక్కే లేదు. వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2016లో 377 ఎంవోయూలు, రూ.5.59 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2017లో మళ్లీ రూ.10.19 లక్షల కోట్ల పెట్టుబడులు, 15 లక్షల ఉద్యోగాలన్నారు. 2018లో భాగస్వామ్య సదస్సులో 687 ఎంవోయూలు చేసి రూ.3.06 లక్షల కోట్ల పెట్టుబడులు, 5.49 లక్షల ఉద్యోగాలన్నారు. మొత్తంగా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా రాష్ట్రంలో కనిపించలేదు. భాగస్వామ్య సదస్సుల పేరుతో ఖర్చులు పెడుతున్నారు కానీ లెక్కలు లేవు. ఎంవోయూలకు వాడిన పెన్నుల ఇంకు ఖర్చైనా తిరిగొచ్చిందో లేదో తెలియదు. గ‌తంలో లోకేష్ స్వయంగా ‘పెట్టుబడుల కోసం కాదు, బ్రాండ్ డెవలప్‌మెంట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాం’ అన్నారు. అంటే విదేశీ పర్యటనలు రాష్ట్రం కోసం కాదు, చంద్రబాబు–లోకేష్ కుటుంబ బ్రాండ్ పెంచుకోవడానికేనా?. ఇలా ప్రజల సొమ్ముతో విదేశాలు తిరుగుతూ ఏపీ బ్రాండ్ విలువను తగ్గిస్తున్నారు. 

అబ‌ద్ధాలు చెప్ప‌డం చంద్ర‌బాబుకు అల‌వాటైంది
దావోస్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా  ఆర్‌ఎంజెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందమంటూ లక్ష కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలంటూ ఊదరగొడుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ లక్ష మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. దావోస్ వెళ్లి అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటైపోయింది. విశాఖను అమ్ముకునే వస్తువులా మార్చి, భూములను కేక్ ముక్కలలా చేసి ఎకరా రూ.70–100కే, అవసరమైతే ఉచితంగా ఇస్తున్నారు. గుజరాత్‌లో ఓపెన్ యాక్షన్‌లో కోట్లకు భూములు పొందిన లులు సంస్థ‌కు ఏపీలో ఎక‌రం 99 పైసల చొప్పున విలువైన భూములు ఇస్తున్నారు. అదానీ డేటా సెంటర్ అంటే వ్యతిరేకత వస్తుందని గూగుల్ పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. తీరా అక్కడ వందల ఉద్యోగాలే ఉంటాయని గూగుల్ సంస్థ చెప్పింది. అయినా లక్షల ఉద్యోగాలంటూ ప్రచారం చేశారు. పైగా ఆ సంస్థకు రూ.22 వేల కోట్ల రాయితీలు ఇచ్చారన్న సమాచారం ఉంది. ఆ ఒప్పందాలన్నీ బయటపెట్టాలి. వైయస్ జగన్ హయాంలో పాతిక వేల ఉద్యోగాలకు ఆదానీ డేటా సెంట‌ర్‌తో స్పష్టమైన ఒప్పందాలు జరిగాయి. కానీ ఇప్పుడు యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. 

విశాఖను ఇంకెన్ని ముక్కలు చేస్తారు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విలువైన భూములను చౌకధరకు ఇష్టం వచ్చినట్లు ధారాదత్తం చేసింది. రహేజా వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇచ్చి, నిర్మాణంలో నష్టం వస్తే అది కూడా చంద్రబాబే భరిస్తారట. రాష్ట్ర సంపదను తనకు కావాల్సిన వారికి దోచిపెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. మళ్లీ ఇవాళ‌ లక్ష కోట్ల పెట్టుబడితో రియల్ ఎస్టేట్ సంస్థ విశాఖ వస్తుందట, లక్ష ఉద్యోగాలు ఇస్తుందట. నిజంగా లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఏం చేయాలో ఆయనే చెప్పాలి.

వైయస్ జగన్  హయాంలోనే రాష్ట్రానికి అసలైన బ్రాండ్ వ్యాల్యూ 
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉంటూ చంద్ర‌బాబు మాదిరిగా చీటికి మాటికి భాగస్వామ్య సదస్సుల పేరుతో విదేశాలకు వెళ్లలేదు. ఒకే ఒక్కసారి వెళ్లి పెట్టుబ‌డులు తీసుకొచ్చారు. చంద్ర‌బాబు మాత్రం ఏటేటా విదేశాల‌కు వెళ్లి ఏమీ తీసుకురాలేదు. ఎన్నికల సమయంలో హైపర్ లూప్, డ్రోన్ డిఫెన్స్ ఇనిస్టిట్యూట్, సెమీకండక్టర్ యూనిట్, పెట్రోకెమికల్, టైటాన్ ఏవియేషన్ అంటూ ఊదరగొట్టారు. ఇవన్నీ మీ కంప్యూటర్‌లో ఉన్న గ్రాఫిక్స్ మాత్రమే. ప్రజలకు రంగు రంగుల బొమ్మలు చూపించి మభ్యపెడుతున్నారు. చంద్ర‌బాబు చెప్పిన వాటిలో ఒక్కటి అయినా రాష్ట్రానికి వచ్చిందా? ప్రకటనల ఖర్చు కూడా రాలేదు. మభ్యపెట్ట‌డం, మోసం చేయడం తప్ప మీరు చేసినది ఏమీ లేదు. 

పాల‌న మ‌రిచి, ప్ర‌జ‌ల సొమ్ముతో జ‌ల్సాలు
చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రులు ప్ర‌జ‌ల సొమ్ముతో ప్ర‌త్యేక విమానాల్లో జ‌ల్సాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు ఈ ప్ర‌భుత్వం పట్టించుకోవడం లేదు, ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆకలి కేకలు వేస్తున్నా వినే నాథుడు లేదు.  ముఖ్యమంత్రి ఐదు రోజులపాటు ప్రజలకు కనిపించడం లేదు.  ఆ బాధ్యతలను వేరే మంత్రులకైనా బదలించాలి క‌దా. అప్పులు చేసిన సొమ్మును జల్సాలకు ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు లేవు. వైయస్ జగన్ నాయకత్వంలో పరిశ్రమలు, ఉద్యోగాలు పెరిగాయి, పెద్ద కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి, కానీ ఇప్పటి ప్రభుత్వం ఇలాంటివన్నీ పట్టించుకోవడం లేదు. 

వైయ‌స్ జ‌గ‌నే బెస్ట్ సీఎం
2023 గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో 394 ఒప్పందాలతో రూ.13.15 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో స్ట్రైక్ రేటు 91 శాతం ఉండేది.  అప్పటి ప్రభుత్వం 99 పరిశ్రమల ఒప్పందాలు చేసుకుని, 90కిపైగా యూనిట్లు పని మొదలుపెట్టాయి, 39 కంపెనీలు ఉత్పత్తి కూడా చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు పెరిగాయి. కూట‌మి పాల‌న‌లో కేవలం 12 వేల కోట్లు పెట్టుబడులు మాత్ర‌మే గ్రౌండ్ అయ్యాయి. జిందాల్‌ వంటి కంపెనీలు పరారయ్యాయి. వైయస్‌ జగన్‌ చంద్రబాబు కంటే వంద శాతం బెస్ట్ ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం ప్రతివారం సమీక్షలు నిర్వహించి, ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో పరిశ్రమలకు సహాయం అందించేది. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లు దావోస్ వెళ్లి వైయ‌స్ జ‌గ‌న్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఈ ప్ర‌భుత్వం నిజాలు చెప్పాలి. ప్రజలకు ఏం సాధించారో లెక్కలు చెప్పాలి` అని సాకె శైల‌జ‌నాథ్ డిమాండ్ చేశారు.