`కూటమి` అక్రమాలను ధీటుగా ఎదుర్కొందాం
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం స్థానిక సంస్ధల ఉప ఎన్నికల్లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతుంది, వాటిని ధీటుగా ఎదుర్కొందామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 19న(సోమవారం) జరుగనున్న స్థానిక సంస్ధల ఉప ఎన్నికలపై ఆయా ప్రాంతాలకు చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..`సోమవారం ఎన్నికలు జరిగే రోజుకు మీరంతా సిద్దంగా ఉండాలి. ఎన్నికలకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోండి. అవసరమైన పేపర్స్ సిద్దంగా ఉంచుకోవాలి. స్థానిక పరిస్ధితులపై అవసరమైన సూచనలు, సలహాలపై రీజనల్ కో-ఆర్డినేటర్లతో సమన్వయం చేసుకోండి. న్యాయపరమైన అంశాలకు సంబంధించిన అనుమానాలు ఉంటే న్యాయనిపుణుల సలహాలు తీసుకోండి. పార్టీ కేంద్ర కార్యాలయంలో వారంతా సిద్దంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుంది, వాటిని ధీటుగా ఎదుర్కుదాం` అని సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.