చిత్తశుద్ధి ఉంటే ఇందాపూర్‌ డెయిరీపై చర్చకు రావాలి

21 Feb, 2026 19:03 IST

తాడేపల్లి: ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే, ఇందాపూర్‌ కోసం టీటీడీ టెండర్‌ నిబంధనలు మార్చింది అబద్ధమైతే, సభలో ప్రభుత్వం చర్చకు రావాలని వైయ‌స్ఆర్‌సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్‌ చేశారు. అసలు హెరిటేజ్‌ కోసం అవినీతి చేయకపోయి ఉంటే, ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సోమవారమైనా చర్చకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఇందాపూర్, హెరిటేజ్‌ సంబంధంపై సభలో చర్చ జరపడానికి మండలి ఛైర్మన్‌ వద్ద అంగీకరించి, మళ్లీ ఎందుకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
    తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగంపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా చంద్రబాబే స్వయంగా ఎన్డీఏ సమావేశంలో మాట్లాడి రాజకీయ లబ్దికి ప్రయత్నించారని గుర్తు చేశారు. కట్టుకథలు, అబద్ధాలతో ఎంతోకాలం నిజాన్ని దాచలేరని, డైవర్షన్‌ కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఇకనైనా ఆపాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబు నీచ రాజకీయాలు:
    హెరిటేజ్‌ లాభాల కోసం దేవుడితో, భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకున్నారు. అందుకే దేవుడి పేరుతో ఆయన చేసిన కుట్రలు ప్రజల్లో ఎండగడతాం. అత్యంత బా«ధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న వ్యక్తి, కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న పవిత్రమైన శ్రీవారి ఆలయ ప్రతిష్టను కాపాడాల్సింది పోయి, లడ్డూ ప్రసాదాన్ని జంతుకొవ్వు కలిపిన కల్తీ నెయ్యితో తయారు చేశారన్న ఆరోపణలు చేసింది మొదలు, ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా తిరుమలను రాజకీయాల్లోకి లాగుతూనే ఉన్నారు. ఏ ఆధారాలు లేకపోయినా, తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసం కలిసిందని ఆరోపించిన చంద్రబాబు, అప్పటి నుంచి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని నిందిస్తూనే ఉన్నారు. కానీ, సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌తో అన్నీ తేటతెల్లం కావడంతో, మాటమార్చిన చంద్రబాబు ఆ నెయ్యిలో బాత్రూమ్‌ క్లీనింగ్‌కి వాడే కెమికల్స్‌ కలిపారంటూ మరింత దిగజారి వ్యాఖ్యలు చేశాడు పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి దేవుడి పేరుతో చంద్రబాబు అడుగడుగునా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. 

నెయ్యి ధర పెంచి దోచుకోవడానికి కుట్ర:
    చంద్రబాబు హయాంలో నాడు, ఇప్పుడు తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్‌ల్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై జగన్‌గారు మీడియా మీట్‌లో స్పష్టంగా వివరించారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ సొమ్మును హెరిటేజ్‌కి మళ్లించడానికి తెర వెనుక చంద్రబాబు సాగించిన అవినీతి వ్యవహారాన్ని ఆధారాలతో సహా చూపారు. ఇందాపూర్‌ డెయిరీకి లబ్ధి చేకూర్చడానికి టెండర్‌ నిబంధనలు మార్చడం, డిస్‌క్వాలిఫై అయిన డెయిరీ మీద నిషేధం ఎత్తివేయడం.. మళ్లీ వెంటనే నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడం.. వంటి అన్ని తప్పులను ఆయన ఎత్తి చూపించారు. కేజీ నెయ్యి రూ.658కి సరఫరా చేసేలా అదే ఇందాపూర్‌ డెయిరీకి గత ఏడాది చివర్లో టీటీడీ కాంట్రాక్ట్‌ ఇచ్చిన వైనాన్ని కూడా జగన్‌గారు వివరించారు. ఫలితంగా ఇందాపూర్‌ డెయిరీతో హెరిటేజ్‌కి ఉన్న సంబంధం ఆధారాలతో సహా ప్రపంచానికి తెలిసిపోయింది.
    మరోవైపు తమ గుట్టు రట్టు కావడంతో అప్రమత్తమైన హెరిటేజ్‌ తమ వెబ్‌సైట్‌నే మార్చేసింది. హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లో ఇందాపూర్‌ డెయిరీని గతంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా చూపగా, దాన్ని మార్చి కో–మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా చూపారు. 
    ఏదేమైనా అడ్డగోలుగా నెయ్యి ధర పెంచి, ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌కు టీటీడీ నిధులు దోచిపెట్టేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బహిర్గతమైంది. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని ఆధారాలతో ప్రజల ముందుంచితే ఇప్పటి వరకు కూటమి నుంచి స్పందన లేదు. 

చర్చకు ప్రభుత్వం భయపడిపోతోంది:
    హెరిటేజ్, ఇందాపూర్‌ డెయిరీల మధ్య సంబంధంపై శాసనమండలిలో చర్చించాలని నాలుగు రోజులుగా వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తుంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నారు. ఈ అంశంపై చర్చకు అంతకు ముందు మండలి ఛైర్మన్‌ వద్ద జరిగిన సమావేశంలో అంగీకరించి, సభలో మాత్రం చర్చకు రాకుండా పారిపోతున్నారు. మరో కుట్ర చేసి, మా పార్టీ నుంచి ఫిరాయించిన ఇద్దరు సభ్యులతో మరో వాయిదా తీర్మానాన్ని కోరి, లడ్డూపై చర్చ కోరారు. దానికీ మేము సిద్ధమని చెప్పడంతో ప్రభుత్వం భయపడిపోతోంది.
    ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ అవినీతికి పాల్పడ లేదన్నది నిజమే అయితే చర్చకు రావడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? హెరిటేజ్‌ మీద ఆరోపణలు వస్తుంటే టీటీడీ ఛైర్మన్‌ స్పందించడం ఏమిటి?.

మళ్లీ డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, గొడ్డు మాంసం, చేపనూనె లేదని సీబీఐ సిట్‌ తన ఛార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పడంతో మరో అంశాన్ని ప్రస్తావించి దివంగత వైయస్సార్‌పై నిందలు వేశారు. వైయస్సార్‌గారు తన హయాంలో తిరుమల పరిధిని రెండు కొండలకు పరిమితం చేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ విధంగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ మొదలుపెట్టారు. 
    అయితే అది పూర్తిగా అవాస్తవమని, నాడు వైయస్సార్‌గారే తిరుమల పరిధి ఏడు కొండలని, అక్కడ అన్యమత ప్రచారం చేయరాదని తీసుకొచ్చిన జీఓలు.. తాము అధికారంలోకి వస్తే ఆ జీఓలు రద్దు చేస్తామని చంద్రబాబు క్రిస్టియన్ల సమావేశంలో చేసిన ప్రకటనను వీడియోతో సహా, జగన్‌గారు చూపారు. దీంతో చంద్రబాబు నీచ రాజకీయం మరోసారి బట్టబయలైంది.

అలా చిత్రీకరించేందుకు ఏకసభ్య కమిటీ:
    దేవుడంటే భయం, భక్తి లేకుండా తిరుమల పేరుతో చంద్రబాబు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బట్టబయలు కావడంతో కూటమి ప్రభుత్వం మరింత వికృతంగా వ్యవహరిస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్‌ రిపోర్టు తర్వాత అయినా, తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరకుండా, ఎలాగైనా వైయ‌స్ఆర్‌సీపీనాయకులను దోషులుగా చిత్రీకరించేందుకు వన్‌ మ్యాన్‌ కమిటీ ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం.  

మా నిరసనపైనా తప్పుడు ప్రచారం:
    దేవుడి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న కూటమి వైఖరి నిరసిస్తూ, సభలో మేము శ్రీ వెంకటేశ్వరస్వామి వారి చిత్రపటాలతో నిరసన వ్యక్తం చేస్తే, దానిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము షూస్‌ వేసుకుని దేవుడి చిత్రపటాలు పట్టుకున్నామని ఆరోపించి, నిందిస్తున్నారు. మాకు దేవుడంటే ఎంతో భయం, భక్తి. నిజానికి చంద్రబాబుకే అవేమీ లేవు. ఎందుకంటే ఆయన ఏనాడూ తన షూస్‌ విప్పలేదు. ఏ పూజలో పాల్గొన్నా, స్వామి వారి ఫోటోలు పట్టుకున్నా, ప్రసాదాలు తీసుకున్నా, నదిలో నీళ్లు నెత్తిన చల్లుకున్నా, చివరకు శంకుస్థాపనలు, భూమి పూజ సందర్భంగా కూడా చంద్రబాబు ఏనాడూ తన బూట్లు విప్పలేదు. అదే నిజం. అందుకే ఇకనైనా కూటమి పెద్దలు నీచ రాజకీయాలు మానాలి. చిత్తశుద్ధి ఉంటే ఇందాపూర్‌ డెయిరీపై సభలో చర్చకు ముందుకు రావాలని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.