తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
నరసరావుపేట: ఆరోగ్యశ్ర నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు రూ.3 వేల కోట్లు తక్షణం విడుదల చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసరావుపేట లోని పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి, అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్తలు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, చింతలపూడి అశోక్ కుమార్ లు మీడియా సమావేశం నిర్వహించారు. రోజూ సగటును రూ.500 కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఆరు రోజుల అప్పును చెల్లిస్తే ఆరోగ్యశ్రీ పథకం తిరిగి అమలవుతుందని, పేదవాడి వైద్యం విషయంలో ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించలేక, ఇన్సూరెన్స్ మోడల్ లోకి వెళ్లలేక ప్రభుత్వం పేదలను, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇన్సూరెన్స్ మోడల్‌లోకి మార్చితే వైయస్ఆర్‌సీపీ హయాంలో మాదిరిగా కుటుంబానికి రూ. 25 లక్షల ఇన్సూరెన్స్ ఉండదని, ఆనాడు ఆరోగ్యశ్రీలో ఉన్న 3257 ప్రోసీజర్లను కొనసాగిస్తారని గ్యారెంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి కేవలం రూ.2.5 లక్షల ఇన్సూరెన్స్ అందిండానికి ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.4 వేల కోట్లు చెల్లించాలని కోరుతున్నాయని, దాని బదులు వైయస్ఆర్‌సీపీ హయాంలో మాదిరిగా ఆరోగ్యశ్రీని కొనసాగించాలని సూచించారు. పేదవాడికి అందాల్సిన వైద్యం విషయంలో రాజకీయాలు మానుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు హితవు పలికారు.
వారు ఇంకా ఏమన్నారంటే....
● ఆరు రోజుల అప్పు ఆస్పత్రులకు ఇస్తే చాలు - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు
ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని దివంగత వైయస్సార్ ప్రారంభించిన మహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పేరు మార్చి హడావుడి చేయడం తప్ప పేదవాడికి వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని మాత్రం విస్మరించింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అద్భుతంగా అమలు చేసి వైయస్ జగన్ గారు పేదవాడికి నేనున్నాననే ధైర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ ప్రోసీజర్ల సంఖ్యను 2 వేల నుంచి 3257కి పెంచి ఆదుకున్నారు. ఈ పథకం ద్వారా 2019- 24 మధ్య దాదాపు రూ.13,455 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కానీ సగటున రోజుకు రూ.500 కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆరోగ్యశ్రీకి మాత్రం రూ.3 వేల కోట్లు చెల్లించలేక బకాయిలు పెట్టింది. ఆరు రోజుల అప్పుని ఆశకి అందజేస్తే పేదవాడికి నాణ్యమైన వైద్యం అందుతుంది. పేదవాడి వైద్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నిరూపించుకుంటోంది. ఆరోగ్యశ్రీని భీమా కంపెనీలకు అందిస్తామని చెబుతున్నారు. వారికి ఒకేసారి రూ.4 వేల కోట్లు చెల్లించాలి. టెండర్లు ఓపెన్ చేయకుండానే చేతులెత్తేశారు. అటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వక, ప్రభుత్వం ట్రస్టు మోడల్‌లో నిర్వహించక ఆరోగ్యశ్రీని అటకెక్కించేసింది. ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు రాక, ఆస్పత్రులు నిర్వహించులేక మూసివేసుకునే పరిస్థితులు కల్పించారు. బీమా కంపెనీల చేతిలో ఆరోగ్యశ్రీని పెడితే వైయస్ఆర్‌సీపీ హయాంలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉండేది. గతంలో మాదిరిగా 3257 ప్రోసీజర్లకు వైద్యం అందుతుందన్న గ్యారెంటీ లేదు. ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల హెల్త్ బీమా ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.4 వేల కోట్లు చెల్లించాలని కండిషన్ పెట్టాయి. ఆస్పత్రులకు వస్తున్న రోగులకు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి.
- వైయస్ఆర్‌సీపీకి మంచి పేరొస్తుందనే కుట్ర
సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. వెయ్యి కోట్లు చెల్లించినట్టు సీఎం చంద్రబాబే చెబుతున్నాడు. ఒక్కో నియోజకవర్గానికి ఇప్పటివరకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం కమీషన్ల కోసం చెక్కులు పంపిణీ చేయడంలేదు. ఈ విషయం కూడా చంద్రబాబే చెబుతున్నాడు. ఒక్కో ఎమ్మెల్యే 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ఆ ఇచ్చే సీఎంఆర్ ఎఫ్ చెక్కులు టీడీపీ నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఎలాంటి అసమానతలు చూపించకుండా అందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా నేరుగా వైద్యం అందించడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా కమీషన్ల పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే కుట్రతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. పేదవాడి ప్రాణాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలి.
● ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్ర - చింతలపూడి అశోక్ కుమార్, అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ప్రైవేటు ఆస్పత్రులు నిరసనకు దిగాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండటం లేదు. పేదవాడి వైద్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం ఇప్పటికే రూ. 3వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. నాడు వైయస్ఆర్‌సీపీహయాంలో వెయ్యి రూపాయలు దాటితే ప్రతిదీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి వైద్యం అందించిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. నెలకు రూ. 90 నుంచి రూ. వంద కోట్లు సీఎంఆర్ఎఫ్ బిల్లులు చెల్లిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో జరుగుతున్న నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి తక్షణం ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. ఆస్పత్రులు కోరిన విధంగా ప్యాకేజీలు పెంచాలి.
● బిల్లులు అడిగితే మాటలతో మభ్య పెడుతున్నారు - గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త
ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెడుతూ ఇటు పేదవాడి ఆరోగ్యంతోపాటు అటు ఆస్పత్రులతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పెండింగ్ బిల్లుల కోసం ఆస్పత్రులు ధర్నాలు ప్రతిసారీ మాటలతో మభ్యపెట్డడం తర్వాత హామీలు గాలికొదిలేయడం ప్రభుత్వానికి అలవాటైపోయింది. పెండింగ్ బిల్లులతో ఆస్పత్రులను నడపలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సొంతంగా డబ్బులు చెల్లించుకునే స్థోమత లేక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ఎత్తేశారు. వైయస్ జగన్ గారికి మంచి పేరొస్తుందనే భయంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. వైయస్ జగన్ గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. రెండేళ్లుగా వైద్యారోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసి మొక్కుబడిగా నడిపిస్తోంది. కేవలం తమ నాయకుల జేబులు నింపడానికి మాత్రం సీఎంఆర్ఎఫ్ కింద బిల్లులు చెల్లిస్తోందని సుధీర్ భార్గవ్ రెడ్డి స్పష్టం చేసారు.