‘తప్పును ఒప్పు’ అని చెప్పేందుకే క్యాబినెట్ భేటీ
తాడేపల్లి: తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించుకునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని ఇన్నాళ్లూ సీఎం, డిప్యూటీ సీఎం చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రతిష్టాత్మక ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ తేల్చి చెప్పడం, అదే విషయాన్ని సుప్రీంకోర్డు నియమించిన సిట్ కూడా తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడంతో, దిక్కు తోచని ప్రభుత్వం.. మళ్లీ విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తప్పు అని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో వెలంపల్లి శ్రీనివాస్ ఏమన్నారంటే..:
లడ్డూపై చేసిన ఆరోపణలను సమర్థించే ప్రయత్నం:
క్యాబినెట్ భేటీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తారని, నిరుద్యోగ భృతి చెల్లిస్తారని, రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తారని, పంట నష్టం పరిహారం ప్రకటిస్తారని ఎదురు చూశారు. కానీ కేబినెట్ సమావేశం మొత్తం తిరుమల లడ్డూ అంశాన్ని సమర్థించుకోవడానికే ఉపయోగించినట్టు కనిపిస్తోంది. అందుకే నలుగురు మంత్రులను మీడియా ముందుకు పంపి లడ్డూపై చేసిన ఆరోపణలను సమర్థించే ప్రయత్నం చేశారు.
సుప్రీంకోర్డు ఏర్పాటు చేసిన సిట్ ఉండగానే..:
గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కల్తీ జరిగిందని ఏకంగా సీఎం చంద్రబాబు ఆరోపించడంతో, అందులో వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ వైయస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిగారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏ నిర్ధారణ లేకుండా మాట్డాడొద్దని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, ఈ విషయమై సమగ్ర విచారణకు సీబీఐ ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. తిరుమలలో వాడిన నెయ్యిని పరీక్షించిన దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (ఎన్‌డీఆర్‌ఐ), ‘నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు’ (ఎన్‌డీడీబీ), అందులో ఎలాంటి జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె అవశేషాలు లేవని నివేదికలు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది.
అయినా చేసిన తప్పు ఒప్పుకోకుండా, ఎదురుదాడి చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశ్నించిన మా పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. ఈరోజు మరో అడుగు ముందుకేసి, మంత్రివర్గం సమావేశమై.. మొత్తం ఇదే అంశం చర్చించింది. సీబీఐ సిట్ నివేదిక కాకుండా, నెయ్యిపై విచారణకు మరో కమిటీ (సిట్) వేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఉండగా, తమకు అనుకూలంగా ఉండేవారితో మరో సిట్ ఏర్పాటుకు నిర్ణయం తప్పు. ఒక విధంగా రాజ్యాంగవిరుద్ధం.
చిత్తశుద్ధి ఉంటే, అప్పట్నుంచి విచారణ చేయండి:
వైయస్సార్‌సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుడి పేరుతో అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం లడ్డూ అంశంపై ఎన్ని కమిటీలు వేసినా మాకు భయం లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 2014 నుంచి అన్ని అంశాలపై విచారణ జరపండి. అప్పుడు సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయండి.
నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన లారీల గురించి టీటీడీ ఈవోనే వివరించారు. అయితే ఆ విషయాల్లో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అనిల్ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈఓగా నియమించమని ఎవరు ఒత్తిడి చేశారు?.
వైవీ సుబ్బారెడ్డి పేరు ఎక్కడా లేదు:
ఇప్పటి మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆనాడు టీటీడీ కొనుగోలు కమిటీలో ఉన్నారు. పార్టీ మారిన తరువాత ఇవాళ తమకు సంబంధం లేదని చెబుతున్నారు. పార్టీ మారితే బాధ్యత తప్పుతుందా? సిబీఐ రిపోర్టులో వైవీ సుబ్బారెడ్డి పేరు ఎక్కడా లేదు. అయినా ఆయనపై ఆరోపణలు చేయడం రాజకీయ కుట్రే.
సీఎం చంద్రబాబు నిత్యం తిరుమల లడ్డూ అంశాన్ని లేవనెత్తుతూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. నెయ్యిలో జంతుకొవ్వు లేదని ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా చెప్పినా, ఇంకా గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ దుశ్చర్యలను గట్టిగా ఎదుర్కొంటామని, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.