రాష్ట్రంలో బీహార్ తరహా ఆటవిక పాలన

1 Feb, 2026 19:29 IST

తాడేపల్లి: రాష్ట్రంలో బీహార్ తరహా పాలనకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అభివృద్ది పూర్తిగా కుంటుపడగా... శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆయన మండిపడ్డారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వరుసగా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి విడదల రజని దేవాలయం నుంచి తిరిగివస్తున్నండగా కర్రలు, రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు, నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పై హత్యాయత్నం చేయగా.. ఇవాళ మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి ఆటవికంగా దాడికి దిగడాన్ని ఆక్షేపించారు. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణలు.. సీబీఐ సిట్ నివేదిక సాక్షిగా పచ్చి అబద్ధం అని తేలడంతో.. మరోసారి ఫ్లెక్సీలు, హోర్డింగులతో దుష్ప్రచారానికి పాల్పడ్డాన్ని తప్పుపట్టారు.  ఇంకా ఆయన ఏమన్నారంటే...

- చంద్రబాబు, లోకేష్ అండదండలతోనే దాడులు..

తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై  పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి నిదర్శనం ఇది. ఇలాంటి ఆటవిక చర్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను బెదిరించలేరు. లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్న వారిని అదుపుచేయాల్సిన బాధ్యత పోలీసులదే. చంద్రబాబు, లోకేష్ అండదండలతో రాష్ట్రంలో టీడీపీ గూండాలు రౌడీయిజంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని.. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపించాలి. వైయ‌స్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా టీడీపీ గూండాలు చేస్తున్న పాశవిక దాడుల నుంచి రక్షణ కల్పించాలి. గవర్నర్ గారు కూడా రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలను, కేంద్రానికి నివేదించాల్సిన అవసరం ఉంది.  పోలీసులకు కూడా వైయ‌స్ఆర్‌సీపీతరపున స్పష్టం చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యత మీదే. టీడీపీ నేతలు ఈ తరహా దాడులు ఆపకపోతే భవిష్యత్తులో తగిన పరిణామాలు తప్పవని,  ఎంత భయపెట్టినా ప్రభుత్వం తప్పిదాలపై వైయస్.జగన్ నేతృత్వంలో పోరాటం ఆగదని  వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.