జంతువుల కొవ్వు కలిసిందని సిట్ ఛార్జ్‌షీట్ చెప్పలేదు
తాడేపల్లి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీబీఐ సిట్ తుది చార్జిషీట్‌లో ఎక్కడా పేర్కొనకపోయినా, కేసు బ్రీఫ్ నోట్ ని పట్టుకుని నారా లోకేష్ సహా కూటమి నాయకులు ఇంకా తప్పుడు ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ చార్జిషీట్‌లో పొందుపరిచిన ల్యాబ్ రిపోర్టులు కూడా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి ఆధారాలే లేవని స్పష్టం చేసినా తిరుమల లడ్డూని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గీతం యూనివర్సిటీకి అప్పనంగా రూ.5 వేల కోట్ల విలువైన 55 ఎకరాలు కట్టబెట్టడంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసే కుట్రల్లో భాగంగానే సిట్ చార్జిషీట్ ను వక్రీకరిస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న నెయ్యి శాంపిల్స్‌ను పరిశీలించి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చిందని, అయినా కల్తీ జరిగిందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారంటే దానికి సమాధానం కూడా వారే చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కనీసం ఇప్పుడైనా దుష్ప్రచారాలు మాని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు తమ తప్పు అంగీకరించి భక్తులకు క్షమాపణ చెప్పాలని, తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలని సూచించారు. కానీ ఫ్లెక్సీలు వేసి మరీ తిరుమల ప్రతిష్టను మరింత దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం ఇప్పటికైనా బీజేపీ నాయకులు కలగజేసుకుని చంద్రబాబును నియంత్రించి తిరుమల వేదికగా జరుగుతున్న అపచారాలు, పాపాలు ఆపాలని వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
ప్రెస్‌మీట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంకా ఏమన్నారంటే..:
వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే:
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు ఆదేశించి సీబీఐ సిట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, తాము చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇప్పటికీ తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా కూటమి నాయకులు మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా కీలకమైన పదవుల్లో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాన్‌లు తిరుమల ప్రతిష్టను పెంచేలా వ్యవహరించకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. వైయస్ జగన్ గారి మీద విషం చిమ్మి ఆయన వ్యక్తిత్వ హననం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రతో సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు.
జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, వైయస్ఆర్‌సీపీకి ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును దెబ్బతీయాలన్న లక్ష్యంతో దేవుడిని రాజకీయాల్లోకి లాగి చేయరాని పాపాలు చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చార్జిషీట్ ద్వారా స్పష్టమైన తర్వాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను చూసి దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా చీదరించుకుంటున్నారు. ఇలాంటి పార్టీలకు ఓటేసినవారంతా పశ్చాత్తాపం చెందుతున్నారు. దేవుడంటే భయం, భక్తి ఉంటే వారు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడేవారే కాదని మండి పడుతున్నారు.
నెయ్యి శాంపిల్స్ కూటమి హయాంలో తీసినవే:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ 12, 25, జూలై 6, 12 తేదీల్లో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ పరిశీలనకు పంపారు. నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసిన ప్రచారమంతా అబద్ధమని తేల్చారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి నోరు తెరపాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీఏ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ఎవరూ క్షమించరాని ఆరోపణలు చేశాడు. ఒకవేళ వారు చెప్పినట్టుగా అపచారం జరిగిందనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న శాంపిల్స్ కాబట్టి దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబే కదా? దానికి వైయస్ఆర్‌సీపీ మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసం?.
సీబీఐ సిట్ ఛార్జిషీట్ 30వ పేజీలో రాసిన కేసు బ్రీఫ్ నోట్ ను పట్టుకొచ్చి టీడీపీ నాయకులు తాము చెప్పినట్టే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం సిగ్గుచేటు. అదే చార్జిషీట్‌లో 208 నుంచి 211 వరకు పొందుపరిచిన ల్యాబ్ రిపోర్టుల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? సకల శాఖల మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.
గీతం భూములకు సమాధానం చెప్పులేక డైవర్షన్:
శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించాల్సిన పోలీసులను టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కాపాలా పెడుతున్నారు. వీళ్లు తప్పుడు ప్రచారం చేయడం, దాన్ని తప్పని నిర్ధారించేలా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేస్తే దాన్ని కూడా తప్పుబట్టేలా మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేయడం, దాన్ని అడ్డుకోవాలని చూస్తే వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద కర్రలు రాడ్లతో దాడులు చేయడం.. ఇదేనా ప్రభుత్వం చేయాల్సింది? 40 ఏళ్ల అనుభవం ఉందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబుకి పాలన చేయడం చేతకాక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. బీహార్‌ను తలపించేలా కూటమి నాయకులు కర్రలు పట్టుకుని రోడ్డుపై తిరగడం, వారికి పోలీసులు రక్షణ కల్పించడం చూసి రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని చీదరించుకుంటున్నారు.
కూటమి నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఎక్కడా ఆధారాలే లేవు. దమ్ముంటే వారి ఆరోపణలు నిరూపించేలా పంది కొవ్వు కలిసిందని చార్జిషీట్‌లో ఉంటే చూపించాలి. వైయస్ఆర్‌సీపీ మీద బురదజల్లడం కోసం హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఏఐ వీడియోలు సష్టించి ప్రచారం చేయడం మహాపాపం. అమరావతిలో రైతులు తిరగబడటం, విశాఖలో గీతం యూనివర్సిటీకి రూ.5 వేల కోట్లు విలువవైన భూములు అప్పనంగా అప్పగించడం, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారు. సూపర్ సిక్స్ పచ్చి మోసమని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తిరుమల లడ్డూతో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడం దారుణం.
అది ఆ ఛార్జ్‌షీట్‌లో ఉంటే చూపండి:
సీబీఐ సిట్ ఛార్జిషీట్ మీద సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ స్పందించాలి. టీడీపీ హయాంలో తీసుకున్న శాంపిల్స్‌కి, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? దానికి వైయస్ జగన్, వైవీ సుబ్బారెడ్డిలను ఏ విధంగా బాధ్యులను చేస్తారు? వైయస్ జగన్ గారిని ఎదుర్కోలేక తిరుమల లడ్డూను వాడుకోవడం ఒక హిందువుగా చంద్రబాబు చేయాల్సిన పనేనా? ఇప్పటికైనా చేసిన తప్పుకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు పశ్చాత్తాపం ప్రకటించాలి. హిందువులకు క్షమాపణలు చెప్పాలి. వీరు ముగ్గురూ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకుని క్షమించమని దేవుడ్ని వేడుకోవాలి.
చంద్రబాబు పాపాలకు ఇప్పటికే భక్తులు బలైపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో వరుసగా జరుగుతున్న అపచారాలపై బీజేపీ నాయకులు కూడా దృష్టి సారించాలి. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చేస్తున్న తప్పులకు క్షమాపణలు చెప్పించాలి. చంద్రబాబు నాయుడు, బీఆర్ నాయుడు చేస్తున్న దారుణాలకు భక్తులు ఆలయానికి రావడానికి భయపడిపోతున్నారు. ఏఐతో తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, తిరుమల లడ్డూపై ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని కూడా వదలొద్దని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.