పెట్రో ధరలు పెంచింది కేంద్రమే...  తగ్గించాల్సింది కూడా వాళ్లే

8 Nov, 2021 21:41 IST

తాడేప‌ల్లి: పెట్రో ధరలు పెంచింది కేంద్రమే...  తగ్గించాల్సిన బాధ్య‌త కూడా కేంద్రానిదేన‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గత రెండు మూడు రోజులుగా ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు అంకెలనో, అవాస్తవాలు మూటకట్టి ప్రచారంకు దిగాయని ప్రత్యేకించి.. పెట్రో ధరలపై ప్రతిపక్ష పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేయటంపై ఆయ‌న మండిపడ్డారు. గత ప్రభుత్వాల్లా కాకుండా, కారుచీకటి పాలనలో నుంచి వెలుతురులోకి తీసుకువచ్చే ప్రయత్నం సీఎం శ్రీ వైయ‌స్ జగన్ చేస్తున్నారని సజ్జల వివరించారు. సమస్యను జఠిలం చేసి అందులోంచి స్వార్థ ప్రయోజనాలు పొందే వ్యవహారాలు కాకుండా.. సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలా అనే ఆలోచనతో శ్రీ జగన్ ముందుకెళ్తున్నారని సజ్జల అన్నారు. పెట్రో ధరల్లో వాస్తవాలపై వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పత్రికా ప్రకటన కూడా ఇచ్చిందన్నారు. పెట్రో ధరలను కేంద్రం పెంచి.. రాష్ట్రాన్ని తగ్గించమని అడగటం ఏంటని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్‌పై కేంద్రం రూ. 3.35 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. అందులో ఎక్సైజ్‌ డ్యూటీ కేవలం రూ.47 వేల కోట్లు అని, అందులో అన్ని రాష్ట్రాలకు వచ్చింది రూ. 19.475 కోట్లు అని తెలిపారు. మిగిలిన రూ.3,15,525 కోట్లు నేరుగా కేంద్ర ఖజానాకే జమ అయ్యాయని సజ్జల వివరించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎందుకు చేయలేదు?
గతంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా సవరిస్తామని చెప్పారు. కానీ కేంద్రం వరుసగా పెంచుకుంటూ పోయిందే తప్ప తగ్గించిన దాఖలాలే లేవు. ఇది ప్రజలను వంచించటమే అవుతుందని సజ్జల మండిపడ్డారు. అంతర్జాతీయంగా బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధరలు రూ.20-22 డాలర్లకు పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. రూ.40 డాలర్లకు క్రూడ్‌ ఆయిల్ లభించి గరిష్టంగా 105 డాలర్లకు చేరింది. ఇప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ 80 డాలర్లు మాత్రమే ఉందని సజ్జల వివరించారు. ట్యాక్స్‌లు కూడా దానికి తగ్గించినట్లు చేసినట్లైతే రూ.60-70లు మించి పెరిగేది కాదని సజ్జల అన్నారు.  

రూ.100 పెంచి డిస్కౌంట్ సేల్‌లా రూ.5-10లు తగ్గించి రాష్ట్రాలను తగ్గించమనటం ఏంటి?

రూపాయిని వంద రూపాయిలు చేసి అక్కడ నుంచి పది రూపాయిలు డిస్కౌంట్ ఇచ్చినట్లు.. అక్కడ నుంచి మీరు కూడా తగ్గించండి అంటే ఏమనాలి. అంతకంటే ఛండాలమైన రాజకీయం ఇంకొకటి ఉండదు. ఇందులో ప్రజాసంక్షేమం ఏమైనా ఉందంటే.. కేంద్రమే తగ్గించాలి. ఎందుకుంటే కోవిడ్‌ దెబ్బకు రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. బీజేపీ రాష్ట్రాలు ఇందుకు మినహాయింపు కాదు. పెట్రోల్‌ ధరలు పెంచింది కేంద్రమే కాబట్టి తగ్గించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనన్నారు.
 రాష్ట్రాలకు వాటా రాకుండా రకరకాల పన్నుల పేరుతో పెట్రోల్‌, డీజీల్‌పై కేంద్రం ఆదాయం పొందడం వంచనేనన్నారు. పెట్రో ధరలు భారీగా పెంచి మార్కెట్లలో డిస్కౌంట్‌ సేల్‌ పెట్టినట్లు రూ.5, రూ.10 తగ్గించారు. కేంద్రం తగ్గించింది. రాష్ట్రాలు కూడా తగ్గించండనటం సరికాదని సజ్జల అన్నారు. దీన్ని తప్పుదారి పట్టించి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై నెపం నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నిరూపించే అవకాశం మాకు వచ్చిందని తద్వారా వారి అసలు రంగు ఏమిటో చెప్పే అవకాశం లభించిందని సజ్జల తెలిపారు. 

డివిజబుల్‌ పూల్‌లో రాకుండా కేంద్రమే పెద్ద మొత్తం వసూలు చేస్తోంది
రాష్ట్రం ఒక్క రూపాయి సెస్ ని రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తోంది
స్పెషల్ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూ.74,350 కోట్లు, (సర్‌చార్జి)  అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ  (రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్‌) రూ.1.98 లక్షల కోట్లు, ఇతర సెస్సులు రూ.15,150 కోట్లు కేంద్రం వేశారు. డివిజబుల్ ఇన్‌కం కింద రాష్ట్రాలకు ఇచ్చేసింది పోగా మిగిలిన మొత్తం కేంద్రమే తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వమూ లక్ష ఖర్చులు చెప్పవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాల సమాహారమే కేంద్ర ప్రభుత్వం. కేంద్రానికి రెవిన్యూ రాష్ట్రాల నుంచి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆర్‌బీఐ నుంచి నోట్లు ముద్రించవచ్చు తప్ప కేంద్రానికి వచ్చే ఆదాయం అంతా రాష్ట్రాల నుంచే వస్తుందని సజ్జల తెలిపారు. ఈ విషయంలో ఒక రాష్ట్రం మీద జాలి చూపి ఎక్కువ ఇవ్వటమో, ఒకరిపై కోపంతో ఆపటానికో అవకాశం లేని ఒక వ్యవస్థ కేంద్రం. అక్కడ వ్యవస్థల్లో ప్రయార్టీ ప్రకారం మార్పులు తేవటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమో, పాలసీల్లో ప్రొగ్రెసివ్ మార్పులు చేయటం సాధ్యమౌతుంది. దీన్ని అందరూ స్వాగతిస్తారు. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన ఆదాయం ఇవ్వకుండా, దాన్ని తప్పించుకోవటానికి అది పూర్తిగా వేరే రూపంలో వసూలు చేసి ఇక్కడ భాగం ఇవ్వాల్సిన దాంట్లో మాత్రం పచ్చడి మెతుకులో, ఒక ముద్ద కూడా ఇవ్వకుండా కేంద్రం తీసుకోవడమే ఒక వంచన. 
కేంద్రం సింహభాగం రెవిన్యూ రాష్ట్రాలకు ఇచ్చి ఖర్చు పెట్టించవచ్చు. కానీ ఇప్పుడు కేంద్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పులు చూసినా గణనీయంగా పెరిగాయని.. 2014-2015లో రూ.57,94,538 కోట్లు అప్పు ఉంటే 2020-21 రూ.1,16,21,780 కోట్లకు చేరిందని సజ్జల వివరించారు. ఇది జీడీపీలో 60% సమానంగా ఉందని సజ్జల అన్నారు. వీటిపై ఆర్థిక వేత్తలు చెప్పాల్సినవి కొన్ని ఉంటాయని సజ్జల అన్నారు. ఈ ఆరేళ్లలో 58 లక్షల కోట్లు అప్పులు చేశారు. 

భారీగా పన్నులు పెంచిన కేంద్రం తగ్గింపు భారం రాష్ట్రాలపై వేయటం ఏంటి?
ఓవైపు పన్నులూ బాదుతున్నారు. రాష్ట్రాలకు వాటాలు ఇవ్వరు. ఇందులో ఏది బాధ్యతాయుతంగా ఉంది. బాధ్యతారహితంగా ఉందా అన్న దాంట్లోకి పోవటం రాష్ట్రస్థాయిలో ఉంటుందని అనుకోవటం లేదు. పీత బాధలు పీతవి, సీత బాధలు సీతవి ఉంటాయి. కానీ కేంద్ర స్థాయిలో సమస్యలు, బాధలు వారికి ఉంటాయి. పెట్రోల్‌, డీజిల్‌పైన పన్నులు వసూలు చేసి ఆ పాపం రాష్ట్రం మీద తోయాలని చూడటం ఏంటని సజ్జల ప్రశ్నించారు. ఏమీ ఇవ్వకపోగా మీకు వస్తున్న సెస్‌ మొత్తం ఎక్కువైంది. అసలు డ్యూటీ తక్కువగా ఉంది. దీనికి కారణం అసలు డ్యూటీ నుంచి రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే కేంద్రం తప్పించిందని అనుకోవాల్సి వస్తోందని సజ్జల అన్నారు. బీజేపీ వాళ్లు  ఇలా రాష్ట్రాల మీద పడే అర్హతా లేదు, హక్కూ లేదు. తప్పు చేసిన, పెంచిన వారే సరిచేసుకోవాలి. అది కేంద్రం చేతిలో ఉంటుంది. నిజంగా తగ్గించాలి. తగ్గిస్తే ప్రజలకు కొంచెం ఊపిరి ఆడుతుంది. దాన్ని అందరూ స్వాగతిస్తారు. అలా రాష్ట్రాలను తగ్గించాలిన కోరటం అన్యాయమని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు ప్రజల ముందు ప్రకటన ద్వారా వివరించిందన్నారు. 

సెస్‌ పెంచి రాష్ట్రాల వ్యాట్‌ ఆదాయంపై బీజేపీ నాయకులు విచిత్రమైన వాదన ఏంటి?
ఇవాళ బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహరావు విచిత్రమైన వాదన చేశారు. అసత్యాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తోందని పెట్రోల్ ద్వారా రాష్ట్రాల ప్రభుత్వాల కి మొత్తం ఆదాయం రూ.2.21,056 కోట్లు అని..  రూ.19,471 కోట్లు కాదని రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యుర్తమని చెప్పారు. అది ఏమిటని చూస్తే.. స్టేట్ కంట్రిబ్యూషన్ సెంట్రల్ ఎక్సైజ్ చూస్తే.. 2019-20 రూ.3.34 లక్షల కోట్లు కేంద్రానికి వచ్చింది. 2020-21లో రూ.4.53 లక్షల కోట్లు వచ్చింది. కంట్రిబ్యూషన్ రాష్ట్రాలకు రూ.2.21 లక్షల కోట్లు.  అంటే.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చింది కాదు.  అన్ని రాష్ట్రాలకు వ్యాట్ ద్వారా వచ్చిన ఆదాయం అది. మరి, దాన్ని తీసుకొచ్చి ఇలా జీవీఎల్ నరసింహరావు అనటం ఏంటి? 41% ఎక్సైజ్ డ్యూటీలో నుంచి ఇచ్చి మిగిలిన సెస్‌ల రూపంలో కేంద్రం తీసుకొని రాష్ట్రాలకు వ్యాట్‌ ద్వారా ఇంత మొత్తం ఆదాయం అని చెప్పటం తప్పుదోవపట్టించడమే అని సజ్జల స్పష్టం చేశారు. ఇలా బీజేపీ వాళ్లు ప్రచారం చేయటం సరికాదు. మిగిలిన 90%పైగా సెస్‌ల రూపంలో తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వక పోగా రాష్ట్రాల వ్యాట్‌ ఆదాయాలను చూపించటం ఏమిటి? తప్పు చేసింది కేంద్రం. సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. అదంతా తెచ్చి రాష్ట్రాలపై వేసి తగ్గించటం అనేది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. 

గతంలో చంద్రబాబు రూ.4లు వేసి ఎన్నికల వేళ కొంత తగ్గించారు
చంద్రబాబు కూడా తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు రూ.4లు వ్యాట్‌ వేసి ఎన్నికలు వస్తున్నాయని కొంత పక్కకు తీసేయటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కోవిడ్ సమయంలో రూ.30 వేల కోట్ల రెవిన్యూ నష్ట పోయి.. ఖర్చులు పెరిగాయి. ఆదాయం పూర్తిగా పోయింది. దీంతో తప్పనిసరై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల రిపేర్ల కోసం రూపాయి మాత్రమే సెస్ పెట్టడం జరిగింది. చంద్రబాబు హయాంలో రోడ్లను పూర్తిగా గాలికి వదిలేశారు. ఆ నిధులనూ పసుపు-కుంకుమ కింద వాడేశారు. ఇప్పుడు ఆ రూపాయిని రోడ్ల రిపేరుకు కేటాయించటం జరిగిందని సజ్జల వివరించారు. ఇప్పుడు రోడ్లు బాగు అవుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉంటారు. కానీ ఆరోజున చంద్రబాబు అవసరం లేకపోయినా అనవసరంగా పన్నులు బాదారు. కానీ ఇప్పుడు నిర్మాణాత్మకంగా అవసరమై రోడ్ల బాగు కోసం పన్ను పెడితే.. కేంద్రం రూ.10లు తగ్గించారని రాష్ట్రం కూడా తగ్గించాలని చంద్రబాబు ధర్నాలు చేయటం ఏంటని సజ్జల మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. ఇది ఏంటని భిన్నంగా మేం చేశామని బీజేపీ, టీడీపీలు తగిన గణాంకాలతో ముందుకు రావాలి. అన్నీ తగ్గించాలని ప్రభుత్వానికీ ఉంటుంది. కానీ ప్రభుత్వం నడవాలి. పేదవర్గాలకు అవసరమైనవి అందించాలి. అందరికీ అవసరమైన సంక్షేమ, అభివృద్ధి చర్యలూ చేపట్టాలి. కానీ టీడీపీ, బీజేపీ చేసిన తప్పులు దాచేసి.. ఏదో మసిపూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నించటమనేది సహించరానిది. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఈ గణాంకాలు తెలియజేస్తున్నామని సజ్జల అన్నారు. 

విద్యుత్ విషయంలో మాట్లాడే అర్హత టీడీపీకి, చంద్రబాబుకు లేదు
విద్యుత్ విషయంలో కుయ్‌.. కయ్‌ అనే అర్హత టీడీపీకి లేదని సజ్జల మండిపడ్డారు. ఐదేళ్ల పాటు స్కాంలా పవర్ సెక్టార్‌ను చంద్రబాబు మార్చేశారు. గ్యాస్ బేస్డ్ పవర్‌ నుంచి పీపీఏలు వరకు రాష్ట్రాన్ని చంద్రబాబు ముంచేశారు. అవి నడవకపోయినా గ్యాస్ బేస్డ్‌ పవర్ స్టేషన్స్‌కు పీపీఏలు చేసుకోవటం వల్ల వందల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అందులో కోట్లాది రూపాయలు అవినీతి ఎలా చేసుకున్నారో అందరికీ తెల్సు. 2014-19లో చంద్రబాబు ఎడాపెడా విండ్, సోలార్ ఎనర్జీ అని రూ.7లు సోలార్‌, రూ.5లు విండ్‌కు పీపీఏలు చేసుకున్నారు. విండ్‌కు అయితే నో కాంపిటీటివ్ బిడ్డింగ్ పెట్టారు. రేట్లు ఏమో.. దారుణం. నిన్న పయ్యావుల మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇంకా సోలార్‌ రేట్లు తగ్గుతాయి అంటున్నాడు. మరి తగ్గేటప్పుడు రూ.6-7లకు పీపీఏలు ఆనాడు ఎందుకు చేసుకున్నారని సజ్జల ప్రశ్నించారు. 

క్రైసిస్‌ ఏమైనా వచ్చిందా? లేకపోతే శ్రీ జగన్ చెబుతున్నట్లుగా వ్యవసాయం కోసం ఇది ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారా? రాష్ట్రాన్ని ముంచి, కుదేలు చేసేలా పీపీఏలు చంద్రబాబు, ఆయన పార్టీ చేసుకున్నారు. ఈరోజున రేటు తగ్గించి, తక్కువ రేటుకు రాష్ట్రానికి లాభదాయకంగా ఉండేలా నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. గతంలో రైతుల వల్ల డిస్కంలకు బకాయిలు ఉన్నాయని కొన్ని వర్గాలు ఆరోపణలు రాకుండా రైతు ఆత్మగౌరవంతో నిలబడేలా రైతులకు ఫ్రీ పవర్ హక్కుగా ఉండేలా.. శ్రీ జగన్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ఖజానాపై సంవత్సరానికి రూ.8000 కోట్ల భారం పడకుండా చూస్తున్నారు. తద్వారా మిగులు వచ్చి.. డిస్కంలు అప్పులు బారిన పడకుండా ఉంటాయి. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు వల్ల డిస్కంలు నష్టాలు పాలవ్వవు. దీనికోసం ప్రత్యేకంగా ఎంతో కసరత్తు చేయటం జరిగింది. మోసం చేసే ప్రభుత్వమే అయితే.. వేరేలా వ్యవహరించి నష్టాలు వస్తున్నాయని చెప్పవచ్చు. అలాంటి వ్యవహారాలు ఏమీ లేవు. 

సెకీ ద్వారా కొంటున్న విద్యుత్‌ రూ.2.49 అన్నీ కలుపుకొనే వస్తోంది
సెకీ ద్వారా రూ.2.49 బిడ్డింగ్ ద్వారా వచ్చింది. రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్ కమిటీ ద్వారా వచ్చిన బెంచ్ ప్రైస్‌కు సెకీ సంస్థ రూ.2.49 ఇస్తామంటే అందులో తప్పు పట్టడానికి ఏముందో? 2021 సెప్టెంబర్‌లో తమిళనాడు రూ.2.61పై ఒప్పందం చేసుకుంది. మరి, ఎందుకు అంటే ఏమిటి? వీలైనంత తగ్గించాలని ప్రయత్నించారు. చేతిలో మైకు ఉందని.. పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. IST చార్జీలు కూడా రూ.2.49పై కలిపే అని అందులో ఉంది. కమిషన్‌ కూడా ఏమీ లేదు.  కానీ ఈ విషయంలో నిపుణుల మాటనూ పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ కంటే ఇతర రాష్ట్రంలో పెట్టడం వల్ల పన్నుల మినహాయింపుతో పాటు వేలాది ఎకరాల భూమి మిగులుతోంది. రాయలసీమలో ఎక్కువ ఉంటే.. వాటి ట్రాన్స్‌మిషన్‌కు గ్రిడ్‌కు రూ.2వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అదీ మిగులుతోంది. వీటన్నింటిని చెప్పి ప్రజలను తికమత చేయాల్సిన అవసరం లేదు. పవర్‌పై శ్రీ జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఓ విజన్‌తో తీసుకున్నారు. ఆ పని చంద్రబాబు కూడా చేసి ఉండొచ్చు. కానీ అలా చేయాలనే ఆలోచన బాబుకు రాలేదు. బరువు ఎక్కే కొద్దీ కమిషన్లు ఎక్కువ ఉంటాయని చంద్రబాబు చూశారు. కానీ శ్రీ జగన్ గారు రివర్స్‌ టెండరింగ్ చేశారు. 

పీపీఏల ముసుగులో చంద్రబాబు అవినీతి చేశారు
విద్యుత్‌ విషయంలో ధరలు పెంచాలని చేస్తే.. 10-20% అధికంగా వేసుకొని చంద్రబాబులా పీపీఏలు చేసుకునేవారు. అలాకాకుండా, ఇప్పుడు సెకీ ద్వారా ఏర్పాటు అవుతున్న విద్యుత్‌ పీక్‌ సమయంలోనూ తక్కువకే లభిస్తాయి. ఇవన్నీ కొసరులాంటివి. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది కాబట్టి ఈ వివరాలు చెప్పాల్సి వస్తోందని సజ్జల వివరించారు. రెండున్నరేళ్ల క్రితం వరకు టీడీపీ అధికారంలో ఉండి ఏమీ చేయకపోగా రాష్ట్రాన్ని ముంచి.. ఇప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పని చేస్తుంటే అందులో దోషాలు వెతకాలని చూడటం ఏంటని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో స్పష్టతతో ఉంది. టీడీపీ, బీజేపీలు చేస్తున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదు. శ్రీ జగన్ గారు నిర్మాణాత్మకంగా రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తూ అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేస్తున్నారు. అసలు లేనివి సృష్టించి మోసం చేశారనటం ఏంటని సజ్జల మండిపడ్డారు. ఎంతో ఆలోచించి 9వేల మె.వా. విద్యుత్‌ను రాష్ట్రం కొనుగోలు చేసింది. దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. 25 ఏళ్ల పాటు రూ.2.49పై అన్నీ కలిపి విద్యుత్‌ కొనటం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో విలువైన భూమిని కూడా కాపాడుకోవటం జరిగింది. దాన్ని వేరే అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఇప్పటికైనా బీజేపీ నాయకులు గుర్తించి.. వాళ్ల కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి తగ్గించేలా చూడాలి.