రైతుల గోడు పట్టించుకోని చెవిటి ప్రభుత్వం
తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకోని చెవిటి ప్రభుత్వం నడుస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మండిపడ్డారు. పెట్టుబడి సాయం నుంచి ఉచిత పంటల బీమా వరకు ప్రతి అంశంలోనూ రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసోందని ఆయన ఆక్షేపించారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.30 వేలు బాకీ పడిందని చెప్పారు. అన్నింటా దగా పడిన రైతులకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక శాపంలా మారిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో కైలే అనిల్‌కుమార్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
అన్నదాత సుఖీభవ మరో మోసం:
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర రైతులను దారుణంగా మోసం చేసింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. తర్వాత ఏడాది కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. అలా రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.30 వేలు బాకీ పడగా, తాజాగా ఇచ్చిన మూడో విడత లెక్కల్లో కూడా అనీ అసత్యాలే. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర రైతులను మరోసారి మోసం చేసింది.
7 లక్షల మంది రైతులకు కోత:
ఇచ్చిందే తక్కువ కాగా, అందులోనూ కూటమి ప్రభుత్వం ఏకంగా 7 లక్షల మంది రైతులకు కోత పెట్టింది. రైతు భరోసా కింద జగన్‌గారి ప్రభుత్వం 53.58 లక్షల మందికి రైతులకు పెట్టుబడి సాయం చేయగా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం 46 లక్షల మందికే ఆ సాయం అందించింది. ఇంకా కౌలు రైతులకు పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. అదే గత ప్రభుత్వంలో శాచురేషన్ పద్ధతిలో పథకాన్ని అమలు చేయడంతో పాటు, కౌలు రైతులు, ఆలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా రైతుభరోసా కింద పెట్టుబడి సాయం చేయడం జరిగింది.
రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆటలు:
కూటమి పాలనలో రైతులు విత్తనాల కొనుగోలు నుంచి పంటల విక్రయం కష్టాలు, నష్టాలే ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా అరటి, టమోటా, మొక్కజొన్న వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400 కాగా, రైతులు రూ.1400కే తెగనమ్ముకోవాల్సి వస్తోంది. అరటి పంట టన్ను రూ.5 వేలకే అమ్ముకుంటున్నారు. మొంథా తుపాను వల్ల పంటలు దెబ్బ తిన్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేయడం పెద్ద నేరం. కౌలు రైతుల గురించి ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు.
ఆటా, పాటలతో ఎమ్మెల్యేలు కాలక్షేపం:
16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా రైతుల సమస్యలను సభలో ప్రస్తావించలేదు. ప్రజా సమస్యలపై చర్చించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నిత్యం జగన్ నామస్మరణ చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉచిత పంటల బీమాకు ప్రీమియం చెల్లించలేదు. చివరకు రైతులు చెల్లించిన ప్రీమియానికి పరిహారం కూడా ఇప్పించలేకపోయారు. తమ నిర్వాకం వల్ల రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా, చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. అసలు రైతులపై వారికి కనీస కనికరం కూడా లేదు. పైగా అసెంబ్లీ సమావేశాల తర్వాత, చక్కగా ఆట పాటలతో కూటమి ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేశారు. ఇది అత్యంత హేయం.
ఇప్పుడైనా ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాలి. బకాయి పడిన మొత్తం చెల్లించాలి. అలాగే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలి. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంటరుణాలను అమలు చేయాలి. లేని పక్షంలో రైతుల పక్షాన పార్టీ తరపున పోరాడతామని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ స్పష్టం చేశారు.