తూతూమంత్రంగా వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు 

28 Apr, 2026 10:07 IST

తాడేప‌ల్లి: ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సరైన దిశలో దర్యాప్తు చేయలేదని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది తప్పెట నిరంజన్‌రెడ్డి సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఎన్‌ఐఏ అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిల్చిందన్నారు. దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిన ఎన్‌ఐఏ, చార్జ్‌షిట్‌ను చాలా హడావుడిగా దాఖలు చేసిందని కోర్టుకు వివరించారు.
 

జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందని, అటు తరువాత దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయని, అందుకే పూర్తిస్థాయిలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనపై హత్యాయత్నం కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న తన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు 2023 జూలైలో జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయ­మూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సందేహాల నివృత్తి కోసం తదుపరి విచారణను మే 6కి వాయిదా వేశారు.  

మారణాయుధంతో లోపలకు ఎలా వెళ్లాడో చెప్పని ఎన్‌ఐఏ  
అంతక్రితం సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘జగన్‌పై 2018 అక్టోబర్‌ 25వ తేదీన హత్యాయత్నం జరిగింది. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ మరుసటి రోజున శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్‌ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్‌ ఎంట్రీ పాస్‌ (ఏఈపీ)ను స్వా«దీనం చేసుకున్నారు. దీని ప్రకారం  హత్యాయత్నం జరిగిన రోజున ఎలాంటి ఎంట్రీ పాస్‌ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లాడని స్పష్టమవుతోంది.  ఇంటిలో పాస్‌ ఉంటే, ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లడం శ్రీనివాసరావుకు ఎలా సాధ్యమైంది? విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. 

లోపల ఉన్న హోటల్‌లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.  అలాంటిది శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోనికి వెళ్లాడో ఎన్‌ఐఏ చెప్పడం లేదు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్‌ఐఏ విచారించలేదు.  విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్‌ హోటల్‌లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాసరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్‌ తీసుకున్నారు.  దీనిని ఆ హోటల్‌ యజమాని హర్షవర్ధన్‌ ధ్రువీకరించారు. హర్షవర్ధన్‌ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచ్చింది. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్‌ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్‌ఐఏ సరిగా విశ్లేషించలేదు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాష్ట్రంలో ఎన్‌ఐఏ కేసులను విచారించే కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర

ప్రభుత్వం 2023 జూలై 21న నోటిఫికేషన్‌ 
ఇచ్చింది. జూలై 24న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. దీని ప్రకారం విశాఖపట్నం పరిధిలో చోటు చేసుకున్న ఘటనలపై విచారించే పరిధి విశాఖలోని ఎన్‌ఐఏ కోర్టుకు మాత్రమే ఉంది తప్ప,  విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు లేదు’ అని విన్నవించారు.  కాగా, ఎన్‌ఐఏ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ వాదనలు వినిపిస్తూ విజయవాడ కోర్టుకు విచారణ పరిధి ఉందన్నారు. జగన్‌ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపాలే తప్ప, సింగిల్‌ జడ్జి విచారించడానికి వీల్లేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది బి.ఆదినారాయణ రావు వాదనలు వినిపిస్తూ  ఈ కేసులో శ్రీనివాసరావే బాధితుడన్నారు. విజయవాడ కోర్టు ఉత్తర్వులు సరైనవేనని పేర్కొంటూ జగన్‌ పిటిషన్‌ను కొట్టేయాలన్నారు.