రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందే
నెల్లూరు: రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంజీవని లాంటి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రారంభించాల్సిందేనని, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందేనని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ లిఫ్టును ఆపడంపై నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందుకే సోమశిల కండలేరు విజిట్‌కి టీడీపీ పిలుపునిచ్చినా వారి వెంట వెళ్లడానికి రైతులు నిరాకరించారని చెప్పారు. చంద్రబాబు తక్షణం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించకపోతే సాగునీటి రంగ నిపుణులు, రైతులతో కలిసి వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఏ ప్రయత్నాన్ని వైయస్ఆర్‌సీపీచూస్తూ ఊరుకోదని చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
● రైతుల కన్నీటిని తుడవడానికే రాయలసీమ లిప్టు ఇరిగేషన్
చంద్రబాబు సీఎం అయ్యాక తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్రంలో ఒక పక్క రైతులు కన్నీరుమున్నీరవుతుంటే ఇంకోపక్క పుండు మీద కారం చల్లినట్టుగా సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడు. దీనివల్ల రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ చంద్రబాబు రాయలసీమ ప్రజల దృష్టిలో చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వ్యవసాయం చేస్తున్న రైతులకు చివరి మూడు తడులకు నీరు లేక పంటలు నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ లిప్ట్ ద్వారా నీరు తెచ్చుకోగలిగితే రైతులకు ఎలాంటి నష్టం జరగదని మాజీ సీఎం వైయస్ జగన్ భావించి, ప్రాజెక్టును వాయువేగంతో ముందుకు తీసుకెళ్లారు. కానీ రైతు ఆవేదనను పట్టించుకోకుండా సంజీవని లాంటి ప్రాజెక్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి 130 టీఎంసీలు కేటాయిస్తే 20 ఏళ్లలో మూడు నాలుగు సార్లు తప్ప నీటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయాం. కేటాయించిన జలాలను కూడా వాడుకోలేని దుస్ధితిలో ఉన్నామని కలత చెంది రాయలసీమ రైతుల కన్నీటిని తుడవడానికే మాజీ సీఎం వైయస్ జగన్ రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు.
చంద్రబాబుతో నేను క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేయించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను చంద్రబాబు ఇంతవరకు ఖండించలేదు. దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తుంటే దానికి తప్ప ఏవేమో మాట్లాడి ఈ అంశం నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ చూస్తుంది. పైగా 20 టీఎంసీల గురించి అంత రాద్ధాంతం దేనికంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తే రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమని ఎవరైనా అనుకుంటారు.
● చంద్రబాబు నెల్లూరుకి ఏం చేశారో చెప్పాలి
సాగునీటికి తాగునీటికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దాన్ని పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు కేసులకు భయపడి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి రాయలసీమ లిఫ్టును ఆపేశాడని మేం నిరసన తెలియజేస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. మేము
సోమశిల ప్రాజెక్టు విజిట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. కండలేరు జలాశయం వద్ద నాలుగు గంటలపాటు నిలబెట్టారు. మేమంతా ప్రాజెక్టు విజిట్‌కి బయల్దేరితే వాటిని పూర్తి చేసిన ఘనత మాదే అన్నట్టు తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుటు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సోమశిల సామర్థ్యం ఎంతో, వైయస్సార్ సీఎం అయ్యాక ఎంతకు పెరిగిందో లెక్కలు తీస్తే నిజాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 60 టీఎంసీలు నీరు నిల్వ చేయలేకపోయాడు. వైయస్ఆర్ దాన్ని 130 టీఎంసీలకు పెంచి రైతుల పాలిట దేవుడయ్యాడు. సోమశిల - కండలేరు ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌కి వైయస్ఆర్‌సీపీ హయాంలో రూ. 120 కోట్ల పని జరిగింది. కెనాల్ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచారు. నిప్పుల వాగు సామర్థ్యాన్ని కూడా వైయస్ఆర్‌సీపీపీ హయాంలోనే 10 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచారు. సంగం నెల్లూరు బ్యారేజీకి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభిస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పూర్తి చేయలేదు. కానీ వైయస్ జగన్ సీఎం అయ్యాక కోవిడ్‌ను సైతం లెక్కచేయకుండా శరవేగంగా పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలో సోమశిలలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. జీకేయన్ కెనాల్ లో రూ. 60 కోట్ల పనులు తప్ప నెల్లూరు జిల్లాకు ఏ పనిచేయలేదు. వైయస్ఆర్‌సీపీ సోమశిల ప్రాజెక్టు విజిట్‌కి వెళ్లబోతే 10 మందికి మించి పర్మిషన్ ఇవ్వలేదు. సైక్లోన్ హెచ్చరికల పేరుతో మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ టీడీపీని మాత్రం అపరిమితంగా అనుమతించినా వారి వెంట రావడానికి రైతులు నిరాకరించారు. టీడీపీ నాయకుల వెంట రైతులు రావడానికి కూడా నిరాకరించారంటే జిల్లాలో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేయడం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది.
● చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు
చంద్రబాబు సీఎం అయ్యాకనే సాగు, సాగునీటికి సంబంధించి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించింది. కొన్ని పూర్తి చేసింది. కొన్ని ఇప్పటికీ నిర్మాణం జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించుకుంటోంది. 777 అడుగుల నీటి మట్టం నుంచే పాలమూరు- రంగారెడ్డి ద్వారా రోజుకు 2 టీఎంసీలు, 825 అడుగుల నుంచి ఎస్ఎల్‌బీసీ ద్వారా 4 టీఎంసీలు తరలిస్తున్నారు. శ్రీశైలం జలాశాయానికి రాకముందే జూరాల, నెట్టెంపాడు, కోయలసాగర్, బీమ లిఫ్టు ద్వారా 1 టీఎంసీని తరలిస్తున్నారు. 777 అడుగుల నీటి మట్టం నుంచి జలవిద్యుత్కేంద్రానికి నీటిని తరలిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడే కల్వకుర్తి లిఫ్టు సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచారు. కానీ చంద్రబాబు నోరు మెదపలేదు. తెలంగాణలో జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణం ఆపాలని నాడు ప్రతిపక్ష నేతగా 2015లో వైయస్ జగన్ గారు కర్నూలులో జలదీక్ష చేపట్టారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, అరెస్టులకు భయపడి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా విజయవాడకి పారిపోయి వచ్చాడు. వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక శ్రీశైలం ఎడమకాలువ ఆపరేషన్స్, పవర్ హౌస్, పవర్ జనరేషన్ ప్లాంట్, రైట్ బ్యాంక్ ఆపరేషన్స్ తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకుని రైతుల ప్రయోజనాలను కాపాడుకోగలిగాం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో నిర్మాణం జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే తెలంగాణ ప్రభుత్వానికి రూ. 960 కోట్ల పెనాల్టీ కూడా వేసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలంటే 880 అడుగులకు చేరితే తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.
● వైయస్ జగన్ కి మంచి పేరొస్తుందని భయం
ఇలాంటి పరిస్ధితుల్లో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలు నీటిని తరలించేలా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎంగా వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. వైయస్ జగన్ కి మంచి పేరొస్తుందనే భయంతో అలాంటి ప్రాజెక్టును కూడా అడ్డుకునేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు. ఈఏసీ వద్ద వాదనలు వినిపించడానికి మూడుసార్లు అవకాశం వచ్చినా చంద్రబాబు మౌనంగా ఉండిపోయాడు. రేవంత్‌రెడ్డి ప్రయోజనాలను కాపాడటానికి ప్రాజెక్టును నిర్వీర్యం చేశాడు. లక్షల మంది రైతుల ప్రయోజనాలను రేవంత్‌రెడ్డి ముంగిట తాకట్టుపెట్టాడు. ఇది చాలదన్నట్టు రాయలసీమ లిఫ్టు అనేదే వృథా అన్నట్టు మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టు రాయలసీమ లిఫ్టు వృథా అయినట్టయితే రేవంత్‌రెడ్డి అంతలా ఎందుకు కోరేవాడో చంద్రబాబు, మంత్రులు సమాధానం చెప్పాలి. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపడం వల్ల జరిగే నష్టంపై మేథావులు, సాగునీటి రంగ నిపుణులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. ప్రాజెక్టును ప్రారంభించేలా రైతులతో కలిసి వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. అప్పటివరకు పోరాటం ఆపే ప్రసక్తే ఉండదు.